నియోజకవర్గంలో వైయస్ జగన్ విస్తృత పర్యటన
వైయస్ఆర్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ పులివెందుల నియోజకవర్గంలో చేపట్టిన మూడురోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం ఇప్పట్ల గ్రామానికి చేరుకున్న వైయస్ జగన్ తొలుత గ్రామ శివార్లలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
తరువాత ఇటీవల మరణించిన వైయస్ఆర్‌సీపీ నేత సుధాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ, కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల త్యాగాలు, కృషి ఎల్లప్పుడూ స్మరణీయమని వైయస్ జగన్ పేర్కొన్నారు.
అనంతరం ఇటీవల కన్నుమూసిన పుల్లారెడ్డి ఇంటికి చేరుకుని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. పుల్లారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇటీవల వివాహం చేసుకున్న ఆయన కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, అమృత రెడ్డి దంపతులను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
వైయస్ జగన్ ఇప్పట్ల పర్యటన సందర్భంగా గ్రామస్తులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. పులివెందుల నుంచి ఇప్పట్ల వరకు దారిపొడవునా అనేక గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు స్వాగతం పలికారు. వైయస్ జగన్‌ను కలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు తరలివచ్చారు. ఆయన ప్రయాణం మొత్తం ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ, అభివాదం చేస్తూ కొనసాగింది. ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను వినడం, ధైర్యం చెప్పడం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిస్తూ సాగింది