బిల్లులను అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి?

18 Apr, 2026 09:32 IST

 

 

 

అమరావతి: ‘కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపుదలను ఆమోదించి ఉంటే దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లూ పెరిగేవి... మహిళా రిజర్వేషన్‌ బిల్లూ ఆమోదం పొందేది..’ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆ బిల్లులను లోక్‌సభలో అడ్డుకున్న పార్టీలు తాము ఏం సాధించామో నిశితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. 

మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డుకున్న పార్టీల చర్యతో దేశంలో మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకూ న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడటంతోపాటు మహిళా రిజర్వేషన్‌ బిల్లు వాయిదా పడిందన్నారు. ఒకవేళ 2026 జనాభా లెక్కలే అమలైతే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై తన అభిప్రాయాన్ని వైఎస్‌ జగన్‌ శుక్రవారం తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు ద్వారా వెల్లడించారు. అందులో ఆయన పేర్కొన్న అంశాలు ఇవీ... 

» కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపుదల విధానంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరిగేవి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయి. ఇక 2026 జనాభా లెక్కలు అమలులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింతగా దిగజారుతుంది. కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసినందుకు జనాభా పెరుగుదల తగ్గిన దక్షిణాది రాష్ట్రాలు మరింతగా నష్టపోతాయి.  

» 50 శాతం సీట్ల పెంపుదల విధానాన్ని అమలు చేస్తే ప్రస్తుతం ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్లు  38 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 34 మాత్రమే అవుతాయి. అంటే ఏపీ 4 ఎంపీ సీట్లు నష్టపోతుంది. 

»    50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లు 26 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 24 మాత్రమే అవుతాయి. అంటే రెండు సీట్లు నష్టపోవాలి.  

» 50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న 28 ఎంపీ సీట్లు 42 స్థానాలకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా ఆ రాష్ట్రంలో 42 ఎంపీ సీట్లే ఉంటాయి. అంటే ఆ రాష్ట్రం ఏమీ నష్టపోదు. 

»  50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం కేరళలో ఉన్న 20 ఎంపీ సీట్లు 30 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 23 మాత్రమే అవుతాయి. అంటే కేరళ 7 ఎంపీ సీట్లు నష్టపోతుంది. 

» 50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం తమిళనాడులో ఉన్న 39  ఎంపీ సీట్లు 59 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 50 మాత్రమే అవుతాయి. అంటే తమిళనాడు 9 ఎంపీ సీట్లు నష్టపోతుంది. 

50 శాతం సీట్ల పెంపుదలే ఉత్తమ విధానం.. 2026 జనాభా లెక్కలు అమలైతే మరింతగా నష్టపోతాం
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తన వాదనను బలపరిచే గణాంకాలను పట్టిక రూపంలో కూడా తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం  పునర్విభజన బిల్లులో చెబుతున్నట్టుగా 50 శాతం సీట్లు పెరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల ఎలా ఉంటుంది..? అదే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు ఎంతగా తగ్గుతాయో వివరించారు. 

ఇక 2026 జనాభా లెక్కలు అమలులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య మరింతగా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లును యథాతథంగా ఆమోదించడమే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరమన్నారు. వైఎస్‌ జగన్‌ వెల్లడించిన గణాంకాలు ఇలా ఉన్నాయి.... 

మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి సంక్షిప్తంగా ఇలా..
»  ప్రస్తుతం దేశంలో ఉన్న 534 లోక్‌సభ ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల్లో 129 ఎంపీ సీట్లు ఉన్నాయి. అంటే దేశంలో ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.76 శాతంగా ఉంది.  

» కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పునర్విభజన బిల్లు ఆమోదం పొందితే... ప్రస్తుతం చెబుతున్న 50 శాతం పెంపు విధానం అమలైతే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య 195కు పెరుగుతుంది. అంటే దేశం మొత్తం మీద 815 ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.87 శాతానికి పెరుగుతుంది. 

» 2011 జనాభా లెక్కలనే పరిగణలోకి తీసుకుంటే దేశంలో ఏర్పాటయ్యే 850 ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల్లో 174 ఎంపీ సీట్లే ఉంటాయి. అంటే దక్షిణాది రాష్ట్రాల వాటా 20.44 శాతమే ఉంటుంది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలు 21 ఎంపీ సీట్లను నష్టపోతాయి.  

» అదే 2026 జనాభా లెక్కలు అమలులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాలు అంతకంటే ఎక్కువ ఎంపీ సీట్లను నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేస్తున్నాయి. దాంతో ఆ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు తగ్గింది. కాబట్టి 2026 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు బాగా తగ్గిపోతాయి. అందుకే జనాభా లెక్కలతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 50 శాతం సీట్ల పెంపుదలను ఆమోదించడమే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరం.