‘చంద్రబాబూ గుర్తుంచుకోండి.. చరిత్ర చెప్పే సత్యం ఇది’ 

2 Feb, 2026 09:44 IST

తాడేపల్లి: చంద్రబాబు సర్కార్‌ అరాచకాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యంలో మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని.. ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్‌లు ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ నిర్ధారణ చేశాయి. తర్వాత మీరు చేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే.. జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి ర‌మేశ్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం.. చంద్రబాబూ అది మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి చంద్రబాబూ’’ అంటూ ఎక్స్‌ వేదికగా వైయ‌స్‌ జగన్‌ హెచ్చరించారు.

‘‘అంబటి రాంబాబు, జోగి ర‌మేష్‌ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, ఆటవిక పాలనకు  ‘జంగిల్‌రాజ్‌’కు ప్రతీక. కానీ ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటలతో పుట్టిన వేడి.. చంద్రబాబూ మీ స‌ర్కార్‌ను ద‌హించివేయక మానదు. రానున్న కాలంలో మీకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసే ప్రజాగ్రహ జ్వాలలు.. మీ ప్రభుత్వాన్ని పూర్తిగా దహనం చేసి, బూడిద చేయకమానదు.

..చంద్రబాబూ గుర్తుంచుకోండి..  ప్రజాస్వామ్యంలో హింసా జ్వాలలను రేపే చేయి కాలక తప్పదు. అరాచక, ఆటవిక పాలన అంతం కాక తప్పదు! మీరు సృష్టించిన ‘జంగిల్‌ రాజ్‌’’ భూస్థాపితం కాక తప్పదు. చరిత్ర చెప్పే సత్యం ఇది.’’ అంటూ వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.