జెడ్పీటీసీ సభ్యుడు భోగతి విజయ ప్రతాప్‌ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించిన వైయస్‌ జగన్‌

2 Jan, 2026 19:41 IST

తాడేప‌ల్లి: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండల కేంద్రంలో వైయ‌స్ఆర్‌సీపీ  జెడ్పీటీసీ సభ్యుడు భోగతి విజయప్రతాప్‌ రెడ్డిపై టీడీపీ వర్గీయుల హత్యాయత్నం ఘటనను వైయస్‌ జగన్‌ తీవ్రంగా ఖండించారు. ప్రతాప్‌ రెడ్డి తండ్రి భోగతి నారాయణరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ప్రతాప్‌ ఆరోగ్య పరిస్ధితిపై వాకబు చేశారు. ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైయ‌స్ఆర్‌సీపీ  నేతలను, కార్యకర్తలను దారుణంగా ఇబ్బందులు పెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను బలంగా తిప్పికొడదామని వైయస్‌ జగన్‌ సూచించారు. పోలీసు వ్యవస్ధను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు. కూటమి నాయకుల వైఫల్యాలను ప్రశ్నిస్తే ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారని వైయస్‌ జగన్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఈ అనైతిక కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, కూటమి పార్టీలకు తగిన బుద్ది చెబుతారన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. రాజకీయాలు ఇంతలా దిగజారిపోవడం దురదృష్టకరమన్నారు. చేయకూడని తప్పులు చేస్తున్న వారికి వైయ‌స్ఆర్‌సీపీ  అధికారంలోకి రాగానే చట్టప్రకారం తగిన చర్యలు ఉంటాయన్నారు. ప్రతాప్‌ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ  అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.