వైయస్ఆర్‌సీపీ నేత రాంబాబు కుటుంబానికి అండగా నిలిచిన వైయస్ జగన్
ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు డి. రాంబాబు ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన రాంబాబు అకాల మరణం వైయస్ఆర్‌సీపీ శ్రేణులను కలచివేసింది. ఈ నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాంబాబు కుటుంబానికి అండగా నిలిచారు. ఆయన తరఫున రాంబాబు కుటుంబానికి రూ.2.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జగ్గయ్యపేట వైయస్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ (చిన్న), ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఏలూరు శివాజీ కలిసి రాంబాబు కుటుంబ సభ్యులకు రూ.2.5 లక్షల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాంబాబు పార్టీకి అంకితభావంతో సేవలందించిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై రాంబాబు కుటుంబానికి సంతాపం తెలిపారు.