రాష్ట్రమంతా దోచుకో.. పంచుకో.. తినుకో.. 

1 May, 2025 17:18 IST

 

తాడేపల్లి: రాష్ట్రమంతా దోచుకో.. పంచుకో.. తినుకో.. న‌డుస్తుంద‌ని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిప‌డ్డారు.  విచ్చలవిడి స్కాంలు జరుగుతున్నాయ‌ని, మన హయాంలో ఇసుకలో ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయ‌ని చెప్పారు.  ప్ర‌స్తుతం ఇసుక మాఫియా, మట్టి, మద్యం మాఫియా నడుస్తోంద‌ని విమ‌ర్శించారు. మన హయాంలో మద్యం అమ్మకాలు తగ్గించడానికి మనం చర్యలు తీసుకుంటే.. ఇవాళ ఏ గ్రామంలో చూసినా గుడి చివర, బడి చివర, వీధి చివర ఎక్కడ చూసినా బెల్టు షాపులే. ప్రతి బెల్టు షాపులోనూ ఎమ్మార్పీ కంటే రూ.20– రూ.30 ఎక్కువకే అమ్ముతున్నారు. అడిగితే ఊర్లోకి తెచ్చి అమ్ముతున్నామంటున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. గురువారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో  కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీల్లో వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో  మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సమావేశానికి  మున్సిపాలిటీ కౌన్సిలర్లు,  ఎంపీపీ, ఎంపీటీసీలు,  ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు హాజర‌య్యారు. 

ఈ సందర్భంగా వైయస్‌.జగన్ ఏమన్నారంటే..:

మీ అందరికీ నా హ్యాట్సాఫ్‌:
    రాష్ట్రంలో ఇవాళ పరిస్ధితులు ఎలా ఉన్నాయన్న సంగతి నాకన్నా మీకే బాగా తెలుసు. మనం రాక్షస రాజ్యంలో ఉన్నాం. కలియుగంలో ఉన్నామని చెప్పడానికి ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది. అంతటి దారుణమైన, దుర్మార్గమైన పాలన మనం చూస్తున్నాం. ఇలాంటి రెడ్‌ బుక్‌ పాలన, రాక్షస పాలన చేస్తున్న ఇలాంటి ప్రభుత్వంలో తెగువ చూపించి, నిబద్ధతతో నిలబడి, విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ.. అయ్యా చంద్రబాబూ రాజకీయాలంటే నీ మాదరిగా చేయడం కాదు.. ఎంపీటీసీలమైనా, జడ్పీటీసీలమైనా మమ్నల్ని చూసి నేర్చుకో.  విలువలు, విశ్వసనీయతకు అద్దం పట్టే రాజకీయమంటే ఇదీ అని చెప్పి, చంద్రబాబునాయుడుగారికి చూపించారు. ఈ సందర్భంగా మీరు గొప్ప తెగువ ప్రదర్శించారు. మీ అందరి తెగువకు, విలువలు, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ హ్యాట్సాఫ్‌ చెబుతున్నాను.

ఇద్దరి మధ్య ఇదీ తేడా:
    మన రాజకీయాలకు, చంద్రబాబు రాజకీయాలకు మధ్య ఈ 12 నెలల పాలనలో చాలా తేడా కనిపిస్తోంది. ఇద్దరి మధ్య తేడా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మన రాజకీయ జీవితలో మన ప్రస్ధానం అంతా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే తీసుకున్నాం. ఏనాడూ దొడ్డిదారిన, వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజూ మనం రాజకీయాలు చేయలేదు. 
    అదే చంద్రబాబు రాజకీయ ప్రస్ధానం.. వెన్నుపోటుతో మొదలవుతుంది. సొంత కూతుర్ని ఇచ్చిన మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడవడం దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఆయన జీవితమంతా వెన్నుపోటు పొడుస్తూనే రాజకీయాలు సాగిస్తూ వచ్చారు.  

స్థానిక ఉప ఎన్నికల్లో కూటమి అరాచకాలు:
    శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంటలో ఏడు ఎంపీటీసీ స్ధానాల్లో ఆరింట వైయ‌స్ఆర్‌సీపీ గుర్తు మీద గెల్చారు. టీడీపీ గుర్తుతో ఒక్కరే గెల్చారు. అలాంటప్పుడు ఎంపీపీ పదవి వైయ‌స్ఆర్‌సీపీకే రావాలి. ఒక్కడే ఉన్న టీడీపీకి ఎలా వస్తుంది? కానీ అక్కడ ఏం జరిగిందో మనమంతా చూశాం. యుద్ధ వాతావరణం. బెదిరింపులుకు పాల్పడ్డారు. పోలీసులను వాచ్‌మెన్‌లకన్నా హీనంగా వాడుకుంటున్నారు. పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యాలు కూడా చేస్తారు. మనం గట్టిగా నిలబడి ఎన్నికలను బాయ్‌కాట్‌ చేసి, వాయిదా వేయించుకోగలిగాం. కానీ రెండు మూడుసార్లు వాయిదా వేసిన తర్వాత కోరం లేకపోయినా వాళ్లంతట వాళ్లే సర్దుబాటు చేసుకుంటున్నారు. అలాంటి దుర్మార్గమైన పాలన చూస్తున్నాం. 
    ప్రకాశం జిల్లా మార్కాపురంలో 15 ఎంపీటీసీ స్ధానాలకు వైయ‌స్ఆర్‌సీపీ తరపున మన పార్టీ గుర్తు మీద 15కు 15 స్ధానాలు మనమే గెలిచాం. అక్కడ ఎంపీపీ మనకే రావాలి. అయినా అక్కడ కూడా మనం క్యాంపులు పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పోలీసులు బెదిరిస్తున్నారు. కూటమి పార్టీల నాయకులు సూట్‌కేసులతో ప్రలోభాలు పెట్టారు. అక్కడ కూడా మన వాళ్లు అంతా గట్టిగా ఒక్కటిగా నిలబడ్డారు. ఎవ్వరూ జారిపోలేదు. మీ అందరి తెగువకు హేట్సాఫ్‌ చెప్పాలి.
    కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాల్టీలో 30 మంది కౌన్సిలర్లలో 26 మంది మన పార్టీ గుర్తు మీద గెల్చారు. మరి అక్కడ మున్సిపల్‌ ఛైర్మన్‌గా వైయ‌స్ఆర్‌సీపీ వాళ్ళే గెలవాల్సి ఉండగా.. అక్కడ కూడా రకరకాల ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మన వాళ్లు గట్టిగా నిలబడ్డారు.
    ఇక కుప్పం మున్సిపాల్టీ చూసుకుంటే.. ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలు ఓట్లేస్తే.. 25 వార్డులకు గాను వైయ‌స్ఆర్‌సీపీ 19 గెలిస్తే.. టీడీపీ కేవలం 6 మాత్రమే గెలిచింది. అలాంటి పరిస్థితుల్లో వైయ‌స్ఆర్‌సీపీ తరపున మున్సిపల్‌ చైర్మన్‌ కావాలి కానీ అక్కడ కూడా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అదీ ఏ స్ధాయిలో అంటే.. మున్సిపల్‌ ఛైర్మన్‌ను బెదిరించి, రాజీనామా చేయించి వాళ్ల పార్టీలోకి తీసుకున్నారు. 
    చంద్రబాబు అంతటితో ఆగిపోకుండా. ఇది కుప్పం. నా నియోజకవర్గం. నేను ముఖ్యమంత్రి. నేను ఒక రాక్షసుడిని. రాక్షస సామ్రాజ్యానికి రాజుని నేను. నా కుప్పం నియోజకవర్గంలో ఎలా రాక్షస పాలన చేయాలో నేర్పుతాను. రాష్ట్రమంతా ఇలానే తెలుగుదేశం వాళ్లు  చేయాలని కుప్పం నుంచి సంకేతాలు ఇచ్చాడు. అలా సంకేతాలు ఇచ్చి బలవంతగా మున్సిపల్‌ చైర్మన్‌ పోస్టును తీసుకున్నారు. 6 స్ధానాలు మీరు గెలిస్తే.. 19 స్ధానాలు మేం గెలిచాం. అయినా మీరే కుప్పం చైర్మన్‌ మీ అంతటి మీరే చెప్పుకుంటున్నారు. ఒక్కో కౌన్సిలర్‌కు రూ.50 లక్షలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు. ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిన పని ఇదా చంద్రబాబూ?
    ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి. నేను దానికి ప్రతినిధిని. ముఖ్యమంత్రిని కాబట్టి.. రాజ్యాంగం అనేది ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ లాంటిది. ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగానికి లోబడి ఉంటానని ప్రమాణం చేసి చెబుతాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి రాజ్యాంగాన్ని తగలబెడుతున్నాడు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆయనే కుప్పం నియోజకవర్గంలో తప్పుడు సంకేతాలను పంపించారు. 
19 కౌన్సిలర్లు వైయ‌స్ఆర్‌సీపీ గెలిచినా ప్రలోభాలకు, పోలీసుల దౌర్జన్యాలకు నిదర్శనంగా కుప్పం నిలబడింది. 
    ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కుప్పాన్ని మున్సిపాల్టీ చేసింది మనమే. ఆయన నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా కూడా కుప్పాన్ని మున్సిపాల్టీ చేయాలన్న ఆలోచన రాలేదు. కనీసం కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్‌ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకు ఏ రోజు రాలేదు. రెవెన్యూ డివిజన్‌ మాట అటుంచి తాగడానికి కుప్పానికి తాగు నీళ్లు కూడా ఇవ్వలేదు. అది కూడా మన హాయంలోనే చేశాం. కుప్పంలో చంద్రబాబునాయుడు రాక్షస పాలన చేస్తున్న నేపధ్యంలో... తెగువ చూపించి నిలబడిన వైయస్సార్పీపీ కౌన్సిలర్లకు హేట్సాఫ్‌ చెబుతున్నాను.

మనకు ఆ ధైర్యం ఉంది. మరి వారికి?:
    రాజకీయలలో గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయినా కూడా ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా కాలర్‌ ఎగరేసుకుని వెళ్లగలుగుతాడు. మా పాలనలో మేం చెప్పిన ప్రతి మాట నెరవేర్చామని గర్వంగా చెప్పగలుగుతాడు. 
    కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి 12 నెలల పాలనలో, ఆ పార్టీ కార్యకర్తలు ఎవరైనా.. తమ పాలనలో ఏ ఇంటికైనా వెళ్లి వాళ్ల దీవెనలు, ఆశీర్వచనాలు పొందగలగుతాడా అని ప్రశ్నిస్తున్నాను.
కారణం ఆ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు, కూటమి నేతల ఫోటోలు తీసుకుని ఏ ఇంటికి వెళ్లినా.. చిన్న పిల్లాడి దగ్గర నుంచి ప్రశ్నిస్తారు. ఆ చిన్న పిల్లవాడు నా రూ.15వేలు ఏమయ్యాయని అడుగుతాడు. ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లి బయటకు వచ్చి నా రూ.18 వేలు ఏమైందని అడుగుతారు. ఆ తల్లుల అమ్మలు, అత్తలు వచ్చి మాకు 50 ఏళ్లకే రూ.48 వేలు ఇస్తామన్నారు కదా వాటి సంగతేంటని అడుగుతారు. అదే ఇంట్లో నుంచి  ఉద్యోగం కోసం చూస్తున్న యువకుడు నా రూ.36 వేల నిరుద్యోగ భృతి పరిస్థితి ఏంటిని ప్రశ్నిస్తారు. అదే ఇంట్లో నుంచి రైతన్న బయటకు వచ్చి నా రూ.26 వేల సంగతి ఏమిటని అడుగుతారు.

అన్నీ ఎగ్గొట్టి.. దారుణ వంచన:
    చంద్రబాబు పాలనలో సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ గాలికి ఎగిరిపోయాయి. చివరికి చిన్న, చిన్న హమీలైన ఉచిత బస్సు లాంటివి కూడా గాలికి ఎగిరిపోయాయి. మా కడప నుంచి విశాఖపట్నం వెళ్లి వద్దామనుకున్నాం. మా కర్నూలు నుంచి అమరావతికి పొద్దున్న పోయి సాయంత్రానికి చూసి వద్దామనకున్నామని ఆ ఉచిత బస్సు ఏమైందని అడుగుతున్నారు. 
    అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో ప్రతి మహిళ, ప్రతి రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి.  చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలవుతున్న అన్ని పథకాలను రద్దు చేశాడు. ఆయన ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా మోసంగా మార్చేశాడు. కానీ ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చినవి అన్నీ కొనసాగుతాయి. అంతే కాకుండా అధికంగా ఇస్తానని చెప్పాడు. చంద్రబాబు చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన బాండ్లు ప్రజలు ప్రతి ఇంట్లో  పెట్టుకున్నారు. ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే అడగాలని ఎదురుచూస్తున్నారు. ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ప్రజల ఆశీస్సులు కోరే పరిస్ధితి లేదు. ఇదీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి.

అన్ని వ్యవస్థలు నిర్వీర్యం:
    గ్రామాల్లో అన్యాయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కూళ్లలో నాడు–నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాణ్యత లేకుండా పోయింది. ఇంగ్లిషు మీడియం పక్కకు పోయింది. మూడో తరగతి నుంచి అమలు చేసిన టోఫెల్‌ పీరియడ్‌ తీసేశారు. ఎనిమిదో తరగతికి వచ్చే సరికి ప్రతి పిల్లవాడికి ట్యాబులు ఇచ్చే స్కీం కూడా అటకెక్కించేశారు. 
    మన హయాంలో పిల్లలు ప్రభుత్వ బడులకు పోవాలంటే నో వేకెన్సీ బోర్డుల ఉన్న పరిస్థితి నుంచి.. ఇవాళ అమ్మో ప్రభుత్వ బడులకు వద్దు అన్ని స్థితికి తెచ్చేశారు. ఇంజనీరింగ్, డిగ్రీ చదువులు చదువుతున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ఇవ్వాలి. వాళ్లందరూ పేదరికం నుంచి బయటపడాలంటే వాళ్లకు విద్య ఇవ్వాలి. ప్రతి కుటుంబం నుంచి డాక్టరు, ఇంజనీర్‌ వంటి పెద్ద చదువులు చదవితేనే ఈ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది.  అలాంటి గొప్ప పరిస్థితులు రావాలని విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో పూర్తి ఫీజులు కట్టిస్తూ.. లాడ్జింగ్‌ బోర్డింగ్‌ ఖర్చుల కోసం వారి చేతిలో డబ్బులు పెట్టేలా.. ప్రతి క్వార్టర్‌ ముగిసిన వెంటనే వారికి అందించాం. ఇవాళ ఆ పిల్లలు ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. చంద్రబాబు పుణ్యమాని విద్యాదీవెన, వసతి దీవెన గాలికెగిరిపోయింది.
    మరోవైపు ఆరోగ్యశ్రీ చూస్తే.. పేదవాడు గొప్పగా తలెత్తుకుని ఏ కార్పోరేట్‌ ఆసుపత్రికైనా వెళ్లి ఉచితంగా రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్స చేయించుకునే పరిస్థితి మన హయాంలో ఉండేది. వైద్యం తర్వాత చిరునవ్వుతో ఇంటికి వచ్చినప్పుడు డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెబితే.. నెలకు రూ.5 వేలు ఆరోగ్యఆసరా కింద వాళ్ల బ్యాంకు అకౌంట్లో వేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 11 నెలల టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నాశనం అయింది. నెలకి రూ.300 కోట్లు చొప్పున ఏడాదికి  దాదాపు రూ.3500 కోట్లు సుమారుగా బకాయిలు పెట్టారు. ఆరోగ్య ఆసరా లేదు. రూ.450 కోట్లు బకాయిలు ఇవ్వలేదు. పేదవాడు నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు వైద్యం కోసం వస్తే మేం వైద్యం చేయబోమని బోర్డు తిప్పేశారు. పేదవాడికి ఆరోగ్యం బాగా లేకపోతే, అప్పులు పాలైతే తప్ప వైద్యం అందే పరిస్థితి లేదు.
    మన ప్రభుత్వంలో రైతన్నలకు పెట్టుబడి సహాయం ఇస్తూ.. ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా.. రైతుల పంటలు సైతం మనమే కొనుగోలు చేసే కార్యక్రమం చేశాం. ఇవాళ చంద్రబాబు హయాంలో రైతుకు పెట్టుబడి సహాయంగా ఇస్తానన్న కార్యక్రమం మోసంగా మిగిలిపోయింది. మన హయాంలో ఉచితంగా పంటల బీమా ఉంటే.. ఇవాళ రైతులకు ఇన్సూరెన్స్‌ కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేశాడు. ఆర్బేకేలు నీరుగారి పోయాయి. ఇ– క్రాప్‌ కనబడకుండా పోయింది. 
రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్ధితుల్లో ఉన్నారు. ధాన్యం, మిర్చి, పత్తి, కందులు, పెసలు, మినుమలు, శెనగ, అరటి, పామాయిల్, చీనీ ఇలా ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేదు.

అంతా మాఫియా రాజ్యం:
    ఇంత దారుణమైన పాలన చేస్తున్నారు. మరోవైపు విచ్చలవిడి స్కాంలు జరుగుతున్నాయి. మన హయాంలో ఇసుకలో ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయి. ఏడాదికి రూ.750 కోట్లు వచ్చేవి. ఈ ప్రభుత్వంలో మన హయాంలో కన్నా అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఇసుక మాఫియా, మట్టి, మద్యం మాఫియా నడుస్తోంది. మన హయాంలో మద్యం అమ్మకాలు తగ్గించడానికి మనం చర్యలు తీసుకుంటే.. ఇవాళ ఏ గ్రామంలో చూసినా గుడి చివర, బడి చివర, వీధి చివర ఎక్కడ చూసినా బెల్టు షాపులే. ప్రతి బెల్టు షాపులోనూ ఎమ్మార్పీ కంటే రూ.20– రూ.30 ఎక్కువకే అమ్ముతున్నారు. అడిగితే ఊర్లోకి తెచ్చి అమ్ముతున్నామంటున్నారు. 
    ఎక్కడ చూసినా మాఫియాలే. ఏ నియోజకవర్గంలో మైన్స్, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకు అంతో ఇంతో ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రికి ఇవ్వాలి రాష్ట్రమంతా దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) నడుస్తోంది.

యథేచ్ఛగా భూపందేరాలు:
    చివరకి విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తున్నారంటే.. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, రూపాయికి  చంద్రబాబు హయాంలో తన బీనామీలకు మాత్రం మూడు వేల కోట్ల విలువైన భూములు మాత్రం ఇస్తారు. ఊరూ పేరు లేని ఉర్సా, లూలూ, లిల్లీలు ఈ కంపెనీలకు మరో రూ.1500 కోట్ల నుంచి రూ.2000 కోట్ల విలువైన భూములను కూడా ధారాదత్తం చేస్తున్నారు. ఊరూ పేరూ లేని లూలూ, లిల్లీ కంపెనీలకు ఈ మాదిరిగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకుని నాకింత నీకింత అని పంచుకుంటున్నారు. 

కాంట్రాక్టులు. కమీషన్లు:
    మొబిలైజేషన్‌ అడ్వాన్సులు తీసేస్తే అదే పనిగా వీళ్లు తీసుకొచ్చారు. రివర్స్‌ టెండరింగ్‌ మనం తెస్తే.. వీళ్లు రద్దు చేసారు. మనం తీసుకొచ్చిన జ్యూడీషియల్‌ ప్రివ్యూను రద్దు చేశారు. కాంట్రాక్టర్లు రింగ్‌ ఫామ్‌ అయి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి.. వాటితో టెండర్లు వేస్తున్నారు. వారికి చంద్రబాబు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద 10 శాతం ఇచ్చి 8 శాతం తిరిగి వెనక్కి  తీసుకుంటున్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. 

ఆరోజు త్వరలోనే వస్తుంది:
    ఇంతటి దారుణమైన పాలన సాగిస్తున్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదు. పైన దేవుడు చూస్తున్నాడు. ప్రజలు కూడా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు పుట్‌ బాల్‌ తన్నినట్లు తంతారు.
ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఎన్నో మోసాలు చేసి, అబద్దాలు చెప్పి, దుర్మార్గంగా పరిపాలన చేసిన ఆయన పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్‌ డిజిట్‌కు  రావడం ఖాయం. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దానికోసం మనం అంతా గట్టిగా శ్రమించాలి.

ఆ పరిస్థితుల్లో వాటి మీద..:
    ఇంతకు ముందు మన హయాంలో బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు చేయలేకపోవచ్చు. జూన్‌లో మనం ప్రమాణ స్వీకారం చేస్తే.. మార్చి కల్లా కోవిడ్‌ లాంటి మహుమ్మూరిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఆ తర్వాత రెండు సంవత్సరాలు పాటు ప్రజల ఆరోగ్యం మీద పాలన మీద ఎక్కువగా ధ్యాస పెట్టి నడపాల్సి వచ్చింది. 

ఇక మీకు పెద్దపీట:
    కార్యకర్తలు పడుతున్న కష్టాలు మీ జగన్‌ చూశాడు. మీరు చూపిస్తున్న తెగువన కూడా మీ బిడ్డ జగన్‌ చూశాడు. మీ అందరికీ మాట ఇస్తున్నాను. వచ్చే జగన్‌ 2.0లో మీ అందరికీ పెద్ద పీట వేస్తాడు.
    ఒక రాత్రి వచ్చిన తర్వాత పగలు రాకతప్పదు. కచ్చితంగా మంచి రోజులు వస్తాయి. మరలా మనమే అఖండమైన మెజార్టీతో వస్తాం అంటూ వైయస్‌ జగన్‌ ధీమా వ్యక్తం చేస్తూ, సమావేశంలో ప్రతి ఒక్కరికి ఆత్మస్థైర్యం కలిగిస్తూ.. పార్టీ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు.