అధికారంలోకి వచ్చిన వెంటనే హామీ అమలు చేస్తా

23 Mar, 2019 17:51 IST


తూర్పు గోదావరి: కాకినాడ సెజ్‌కు సంబంధించి రైతులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని ఎవరైనా కోరుకుంటారని, ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతారన్నారు. రైతులను సంతోషపెట్టి..వారి ముఖాల్లో చిరునవ్వులు చూశాకే ఎటువంటి సెజ్‌ వచ్చినా..మంచి జరుగుతుందన్నారు. ఇవాళ అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రైతులతో కూడిన ఓ కమిటీ ఏర్పాటు చేస్తానని, ఆ కమిటీ సిఫార్సుల మేరకు రైతన్నల ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు ఆ సిఫార్సులు అమలు అయ్యేలా చేస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో ఏర్పాటు చేసిన సభలో వైయస్‌ జగన్‌ మాట్లాడారు.

– పాదయాత్ర రోజులు నాకింకా గుర్తుంది. ఆ రోజు 3648 కిలోమీటర్లు నడవడం ఆ దేవుడి దయ..మీ అందరి ఆశీస్సులే. నాకు బాగా గుర్తుంది. ఇక్కడే..ఇదే రోజే ఆ రోజు మీటింగ్‌లో కూడా మాట్లాడాను. ఆ రోజు నేను విన్నా కష్టాలు..మీ బాధలు గుర్తున్నాయి. ఇక్కడ టీడీపీ నేతలు చెరువులు తవ్వేసి వందల కోట్లు దోచింది చెప్పారు. ఇదే నియోజకవర్గంలో అవ్వతాతలకు రావాల్సిన పింఛన్లు కార్యకర్తలకు పంచుకున్నది వివరించారు. పింఛన్లకు అన్ని రకాలుగా అర్హతలు ఉన్నా కూడా దక్కని పరిస్థితి చెప్పారు. అదంతా నేను విన్నాను. ఏలూరు కాల్వ ఆధునీకికరణ పనులు జరగలేదన్న రైతుల ఆవేదన విన్నాను. కాకినాడ సెజ్‌ విషయంలో చంద్రబాబు ఏరువాక కార్యక్రమంలో ఏమన్నది..మాటిచ్చిన విషయం నాకు గుర్తుంది. ఆ సెజ్‌ భూములు జగన్‌వే అని నాపై నిందలు మోపారు. అధికారంలోకి వచ్చిన తరువాత సెజ్‌ భూముల్లో అడుగుపెట్టిన రైతులపై తానే కేసులు పెట్టించారు. ఆ రోజు రైతన్నల బాధలు నేను విన్నాను. సెజ్‌కు సంబంధించిన ప్రతి అంశంపై మాట్లాడాను. ఎవరైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని భావిస్తారు. రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూశాకే హర్షిస్తారు. ప్రతి రైతుకు ఇవాళ హామీ ఇస్తున్నాను. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఒక కమిటీ ఏర్పాటు చేస్తాను. ఆ కమిటీ సిఫార్సు మేరకు అమలు చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నాను. పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నాను. ఆరు నెలలు ఒకరితో ఒకరు కలిసి ఉంటే వారు వీరౌవుతారు..వీరు వారవుతాన్న సామెత ఉంది. ప్రతి కష్టాన్ని నేను చూశాను. ప్రతి బాధను విన్నాను. ఆ రోజు ఆ బాధల నుంచి వచ్చిన కొన్ని సన్నివేశాలు నేను మరిచిపోలేదు. ఎవరైనా కూడా ఒక మనిషి, ఒక కుటుంబం ఏమి కోరుకుంటుందన్నది పాదయాత్రలో నా మనసులో ఉన్న ఆలోచనే. అధికారం అనే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ప్రజలకు ఏం చేయాలి? ప్రజల గుండెల్లో బతకాలన్న తపన ఉండాలి. మనిషికి మనసుంటే పొరుగువారికి సహాయం చేస్తాడు. ప్రభుత్వాన్ని అలాంటి మనసు ఉంటే ప్రతి ఇంటికి మేలు జరుగుతుంది. రైతుల సమస్యలు విన్నాను. అతి దగ్గర నుంచి చూశాను. ఏ రైతు అయినా కూడా వ్యవసాయం బాగా జరగాలని కోరుకుంటాడు. పెట్టుబడి ఖర్చులు తగ్గించే చర్యలు ప్రభుత్వం నుంచి ఆశిస్తాడు. గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఇచ్చే ప్రభుత్వం ఉండాలని ఆశిస్తాడు. ప్రతి రైతుకు ఇవాళ భరోసా ఇస్తున్నాను. నేనున్నానని కచ్చితంగా చెబుతున్నాను.

  •  గ్రామాల్లో అక్కచెల్లెమ్మలు పడుతున్న బాధలు విన్నాను. వారి కష్టాలు చూశాను. రుణాలు మాఫీ అవుతాయని ఆశించారు. ఆ తరువాత సున్నా వడ్డీ పథకం గాలికి పోయిన గాధలు విన్నాను. మీ సమస్యలు నేను విన్నాను. మీకు అండగా నేను ఉన్నానని ప్రతి అక్కాచెల్లెమ్మకు చెబుతున్నాను. 
  • ఫీజులు కట్టలేని పిల్లల పరిస్థితి చూశాను. ఆ పిల్లలను చదివించడం కోసం ఆస్తులు అమ్ముకుంటున్న పరిస్థితి చూశాను. తల్లిదండ్రుల కష్టాలను చూసి తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి చూశాను. అలాంటి ప్రతి తల్లికి, తండ్రికి, పిల్లాడికి చెబుతున్నాను. మీకు భరోసాగా చెబుతున్నాను. నేను ఉన్నానని కచ్చితంగా చెబుతున్నాను.
  •  ఉద్యోగాలు రాక డిగ్రీలు చేతపట్టుకొని వలస వెళ్తున్న నిరుద్యోగుల సమస్యలు విన్నాను. కమలనాధన్‌ కమిటీ చెప్పినట్లుగా రాష్ట్రంలో 2 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడు నోటిఫికేషన్‌ ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు. చదువుకుని అంతో ఇంతో ఉద్యోగాలు రావాలంటే అది ప్రత్యేక హోదా వల్లే సాధ్యం. అటువంటి ప్రత్యేక హోదాను కూడా తాకట్టుపెట్టిన పరిస్థితి ఉంది. చదువుకున్న ప్రతి పిల్లాడికి నేను హామీ ఇస్తున్నాను. నేనున్నానని మీ అందరికి హామీ ఇస్తున్నాను.
  •  ఆరోగ్యశ్రీ అమలు కాక..ఆపరేషన్‌ చేయించుకోవాలంటే ఆస్తులు అమ్ముకుంటున్న పరిస్థితి చూశాను. కుర్చీలకే పరిమితమవుతున్నారు. ఆ రోగుల పరిస్థితి నేను చూశాను. వాళ్ల కష్టాలు విన్నాను. 108 అంబులెన్స్‌ రాక చివరికి మనుషులను పొగోట్టుకున్న ఆ కుటుంబ గాధలు విన్నాను. ఆ పేదవాడికి ఇవాళ చెబుతున్నాను. నేను విన్నాను. నేను చూశాను. నేనున్నానని మీ అందరికి హామీ ఇస్తున్నాను.
  •  పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న అవ్వతాతలను చూశాను. ఏం అవ్వ పింఛన్‌ రావడం లేదా అంటే..నాయన పింఛన్‌ కావాలంటే జన్మభూమి కమిటీల వద్దకు వెళ్లాలని చెబుతున్నారు. కులం, పార్టీలపరంగా పింఛన్లు ఇస్తున్నారని చెబుతున్న బాధలు విన్నాను. ప్రతిఅవ్వకు, తాతకు చెబుతున్నాను. మీ బాధలు విన్నాను..నేను ఉన్నానని ప్రతి అవ్వకుతాతకు చెబుతున్నాను.
  •  ఇటువంటి అన్యాయమైన పాలన సాగుతోంది. కాపు సోదరులు నా వద్దకు వచ్చారు. ఏ రకంగా చంద్రబాబు మోసం చేశారో చెప్పారు. ఏరకంగా రూ.5 వేల కోట్లు ఇస్తానని, ఏడాదికి రూ.1000 కోట్లు ఇస్తామన్న చంద్రబాబు మాట తప్పిన విషయాన్ని నేను విన్నాను. మీ సమస్యలు నేను విన్నాను. మీ అందరికి ఇవాళ చెబుతున్నాను. నేను ఉన్నానని మీ అందరికి హామీ ఇస్తున్నాను.
  •  ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి చంద్రబాబు చెప్పని అబద్ధం ఉండదు. చేయని మోసం ఉండదు. రోజుకో సినిమా, డ్రామా చూపిస్తున్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం ఏమైనా చేయడానికి వెనుకాడడు. పదవి కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచి చంపిన వ్యక్తికి మరొకరు లెక్క కాదు. రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు పెరిగాయి. విశ్వసనీయత, విలువలు రాజకీయాల్లో కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితిలో నేను చెబుతున్నాను. ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఒక రాజకీయ నాయకుడు ఫలానిది చేస్తానని చెబితే..ఓట్లు వేయించుకున్న తరువాత తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలి. 
  •  రాబోయే రోజుల్లో చంద్రబాబు ఇంకా ఎక్కువ సినిమాలు, డ్రామాలు చేస్తారు. ఎన్నికలకు గ్రామాలకు మూటల కొద్ది డబ్బులు పంపిస్తారు. ఓట్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారు. మీరు ప్రతి ఒక్కరిని కలవండి. ప్రతి ఒక్కరికి చెప్పండి . అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న సీఎం అయ్యాక మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ఏడాదికి రూ.15 వేలు ఇస్తారని చెప్పండి. 
  •  మన పిల్లలను ఇవాళ ఇంజినీర్లు, డాక్టర్లుగా చదివించాలన్నా మనం చదివించలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పండి. 20 రోజులు ఓపికపడితే అన్న ముఖ్యమంత్రి అవుతారని చెప్పండి. అన్న ఉన్నాడు..ఎన్ని లక్షలు ఖర్చైనా మన పిల్లలను చదివిస్తారని ప్రతి ఒక్కరికి చెప్పండి.
  •  పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పండి. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు. సున్నా వడ్డీలను ఎగ్గొట్టారు. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పడితే అన్న సీఎం అవుతారు. అన్న వచ్చాక రుణాలన్నీ మాఫీ చేసి నేరుగా నాలుగు దఫాల్లో మన చేతుల్లో పెడతారని చెప్పండి.
  •  పేదరికంలో అలమటిస్తున్న ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కలకు చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దు. అన్న ముఖ్యమంత్రి అయ్యాక వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని తెస్తారు. ప్రతి ఒక్కరి చేతుల్లో రూ.75 వేలు ఉచితంగా ఇస్తారని చెప్పండి.
  •  రైతులుగా ఉన్న ప్రతి అన్నకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారు. గిట్టుబాటు ధరలు లేవు. ఇలాంటి దారుణమైన పరిస్థితిలో చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. అన్న సీఎం అయ్యాక ప్రతి రైతుకు మే మాసంలో పెట్టుబడి కోసం రూ.12500 ప్రతి ఏటా ఇస్తారని, రూ.50 వేలు పెట్టుబడి నిధి కింద ఇస్తారని చెప్పండి. గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఇస్తారని చెప్పండి. పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పండి. 
  •  ప్రతి అవ్వ, తాత వద్దకు వెళ్లండి. మూడు నెలల క్రితం ఎంత పింఛన్‌ వస్తుందని అడగండి. రాలేదని చెబుతుంది. లేదా రూ.1000 ఇచ్చేవారు అని చెబుతారు. జగనన్న పింఛన్‌ రూ.2 వేలు ఇస్తామని ప్రకటించకపోతే ఇప్పుడు రూ.2 వేలు చంద్రబాబు ఇచ్చేవారా? చంద్రబాబును నమ్మి మోసపోవద్దు. అన్న సీఎం అయ్యాక రూ.3 వేలు పింఛన్‌ ఇస్తారని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశం అందరికి తెలియాలి. ఈ నవరత్నాలతో ప్రజల జీవితాలు బాగుపడుతాయని నేను నమ్ముతున్నాను. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూస్తానని విశ్వాసం ఉంది. విలువలతో కూడిన పాలన రావాలంటే మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు వైయస్‌ఆర్‌సీపీపై ఉంచాలి. మీ అందరికి తెలిసిన వ్యక్తి దొరబాబు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. అలాగే ఎంపీగా వంగా గీతమ్మ మంచి వ్యక్తి..మన పార్టీ తరఫున నిలబడుతోంది. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు వీరిపై ఉంచాలని, మన పార్టీ గుర్తు ఫ్యాన్‌కు ఓటు వేసి గెలిపించాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.