ఒక ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచించా...
విజయవాడ: ‘ఒక ముఖ్యమంత్రిగా నేను తీసుకునే నిర్ణయం భవిష్యత్తు తరాలపై పడుతుంది. ఒకవేళ నిర్ణయం తీసుకోకున్న ఆ ప్రభావం భవిష్యత్తు తరాలపై ఉంటుంది. రాజధానిగా చెప్తున్నా ప్రాంతంలో కనీసం సరైన రోడ్లు కూడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచించాను’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని గేట్‌వే హోటల్లో నిర్వహించిన ది హిందూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఏమన్నారంటే..సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాటల్లోనే..
ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ లో ది హిందూ మేనేజింగ్ ఎడిటర్ రామ్ గారితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉంది.
- ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏమిటంటే- మనం గతంలో ఎక్కడున్నాం, ఇప్పుడే స్థాయిలో ఉన్నామో చూసుకుంటే ఏపీలో నిరక్షరాస్యతా శాతం 2011 లెక్కల ప్రకారం 33% ఉంది. ఇది దేశీయ సగటు 27% కంటే ఎక్కువ. 18 నుంచి 23 ఏళ్ల వయసు పిల్లలు కాలేజీల్లో చేరే శాతాన్ని గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో అంటాం. తరుచూ మనం బ్రిక్స్ దేశాలైన బ్రెటిల్, రష్యా, చైనాలతో పోల్చుకుంటూ ఉంటాం. రష్యాలో 81% మంది పిల్లలు కాలేజీల్లో ఎన్రోల్ అవుతున్నారు. చైనా, బ్రెజిల్ దేశాల్లో ఇది 50% ఉంటే మన దేశంలో GER కేవలం 23% ఉంది. అంటే మన దేశంలో 77% మంది పిల్లలు ఇంటర్ తర్వాత కాలేజీలకు వెళ్లడం లేదు. కారణం ఏమిటని అన్వేషిస్తే కొన్ని చేదు వాస్తవాలు కనిపిస్తాయి.
నేడు అందరూ కంప్యూటర్ వాడుతున్నారు. సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, ఐపాడ్ ఉపయోగిస్తున్నారు. వీటిని వాడేందుకు మనం ఏ భాష వినియోగిస్తున్నాం. ఇంటర్నెట్ లో వాడే భాషేమిటి. ఇంగ్లీష్ మాత్రమే. ఇవాళ ఇంగ్లీష్ అనేది విలాసం కాదు అవసరం అయ్యింది. మన పిల్లలకు మంచి ఉద్యోగం కావాలన్నా, మంచి జీతం కావాలన్నా వాళ్లు ఈ ప్రపంచంతో పోటీపడాలి. ఇరవై ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే నేడు ఎలా ఉంది? ఇరవై ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతోంది? నేడు మనం ఆర్టిఫిషల్ ఇంటిలిజన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. త్వరలో డ్రైవర్లు కూడా ఉండరు అని మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి అత్యాధునిక కాలంలో ఉంటూ ఇంగ్లీష్ మీడియం వద్దని అనగలమా? రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాలంటే ఇంగ్లీష్ మీడియం కావాల్సిందే.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఓ తండ్రి స్థానంలో ఉండి నా పిల్లలను నేను ఏ స్కూల్ లో చదివించాలనుకుంటాను? తెలుగు మీడియంకు పంపుతానా? మీరు పంపుతారా? ఇక్కడున్న ప్రముఖులందరినీ అడుగుతున్నా. మనం ఎవరైనా మన పిల్లలను తెలుగు మీడియంలోనే చదివించాలనుకుంటామా? మరి మనమే ఆ పనిచేయనప్పుడు అట్టడుగు వర్గాల వారిని తెలుగు మీడియంలోనే పిల్లలను చదివించమని ఎలా అడుగుతాం? అది న్యాయమేనా? ఇంగ్లీష్ మీడియం చదువులు చాలా ఖరీదుగా ఉన్నాయి. దేశంలోని 98% ప్రైవేటు స్కూళ్లు కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉన్నాయి. వాటిల్లో తెలుగు మీడియం ఎందుకు లేదు? ఎందుకంటే ప్రజలు అదే ఆశిస్తున్నారు కనుక. పేదరికం నుంచి బయటపడాలనుకుంటున్నారు. నిరుపేదల జీవన శైలి మారాలంటే, వారికి సరైన విద్యను అందించడం ఒక్కటే మార్గం అని నేను బలంగా నమ్ముతున్నాను. అదే వారీ పోటీ ప్రపంచంలో వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తుంది. కేవలం ఆంగ్ల మాధ్యమాన్నొక్కటే మేము తీసుకు రావడంలేదు. విద్యావ్యవస్థలోనే సమూలమైన మార్పును తీసుకువస్తున్నాం. పేదలకు అత్యంత ఖరీదైన ఇంగ్లీష్ మీడియం చదువులను ఉచితంగా వారికి అందజేస్తున్నాం. దీనితోపాటు తెలుగును నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తున్నాం. గతంలో తెలుగు సబ్జెక్టును ఆప్షనల్‌గా మాత్రమే ఉంచారు. కానీ మేము దాన్ని తప్పనిసరి చేసాం. తొలి ఏడాది 6వ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి తర్వాత నాలుగేళ్లలో 10వ తరగతి వరకూ పెంచుకుంటూ వెళ్తున్నాం. ఈ నాలుగేళ్ల కాలంలో మధ్యలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ వెళతాం. ఇంగ్లీష్ మీడియంతో పాటు నాడు నేడు ద్వారా 45000 ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నాం. మూడు ఫేజుల్లో ఈ కార్యక్రమం ద్వారా స్కూళ్ల మౌలిక వసతులు పునరుద్ధరిస్తున్నాం. పాఠశాలల నాణ్యత ప్రమాణాలు పెంచుతున్నాం. అలాగే చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. పిల్లలను బడికి పంపించేలా తల్లులను ప్రోత్సహిస్తూ ఏడాదికి 15000 వారికి అందిస్తున్నాం. చిన్నవయసు నుంచే పిల్లల్లో ఇంగ్లీష్ భయంపోయి, స్పష్టంగా మాట్లాడగలిగేందుకు ఇంగ్లీష్ మీడియం సహకరిస్తుంది. ఇదంతా 12వ తరగతి వరకూ విద్యార్థులకోసం ఏర్పాటు చేసిన పథకాలు. ఇంటర్ తర్వాత డిగ్రీ ఇకపై మూడేళ్లు కాదు. నాలుగేళ్లు ఉండబోతోంది. ఇంజనీరింగ్ 5 ఏళ్లు చేస్తున్నాం. 1 ఏడాది ఇంటన్ షిప్, అప్రెంటీస్ షిప్ లను కలిపి జాబ్ ఓరియంటెడ్ గా ఉండేలా కరిక్యులమ్ లో మార్పులు తెస్తున్నాం. అలాగే 100% ఫీజ్ రీయంబర్స్మెంట్ ఇస్తున్నాం. వసతి దీవెన ద్వారా హాస్టల్ మెస్ ఛార్జీలను కూడా అందిస్తున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా నిరుపేద విద్యార్థులను ఉన్నత విద్య అందుకునేలా ప్రోత్సహిస్తున్నాం. విద్యావ్యవస్థలో నాణ్యతను పెంచేందుకు మేము చేస్తున్న కృషి ఇది. దారిద్ర్యరేఖ దిగువన ఉంటున్న వారి జీవనం మెరుగు పడేందుకు ఈ ప్రభుత్వం తెస్తున్న విద్యాసంస్కరణలు ఎంతో సాయపడతాయి. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఆ దేవుని ఆశీస్సులతో పాటు, ప్రజల దీవెనలు, భావసారుప్యతగల వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. విద్యార్థులకు సమాజానికి ఎంతో అవసరం అయిన ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, కొంత మంది విమర్శిస్తూ, రాళ్లేయాలని చూస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వారందరికీ నేను ఒకటే అడగాలనుకుంటున్నాను- మీరు మీ పిల్లలు, మనవలను ఎక్కడ చదివిస్తున్నారు? మీ పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ పేద ఇంటి పిల్లలను మాత్రం తెలుగు మీడియమే చదవాలని ఎందుకు వత్తిడి చేస్తున్నారు? తమ జీవితాలను మార్చుకునే నిర్ణయాన్ని వారినే తీసుకోనివ్వమని వారికి చెబుతున్నాను.
రాజధాని పేరుతో 5677 కోట్లకుపైగా ఖర్చు చేసింది గత ప్రభుత్వం. పైగా మరో 2,300 కోట్లు అప్పు మా ప్రభుత్వం మీద సులువుగా వేసేసి మరీ పోయింది. 10.52% వడ్డీతో అప్పలు తెచ్చి ఈ ప్రభుత్వం నెత్తిన వేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 1500 కోట్లు మాత్రమే వచ్చింది. దాన్నిమించి వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. మహా అయితే మరో 1000 కోట్లు ఇస్తారేమో. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే నేను నిలబడ్డ ఈ అమరావతి ప్రాంతం అభివృద్ధి చేయాలంటే, కనీస మౌలిక వసతులు కల్పించడానికే దాదాపుగా 1లక్షా9వేల కోట్లు ఖర్చు చేయాలి. రోడ్లు, డ్రైన్లు, కరెంటు, నీరు అందజేయాలంటేనే లక్షకోట్లు పెట్టాలి. ఇక్కడ నేను 5 లేక 6000 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి. అంటే సముద్రంలో నీటి చుక్కలాగా. అదే విశాఖ అయితే ఇప్పటికే అభివృద్ది చెందిన నెంబర్ వన్ సిటీ.
లక్ష కోట్లలో పది శాతం విశాఖపట్నంలో ఖర్చు చేస్తే ఇప్పుడు కాకపోయినా పది సంవత్సరాల్లో హైదరాబాద్‌కు, బెంగళూరు, చెన్నైకి దీటుగా తయారవుతుంది. మన రాష్ట్రంలోని యువత ఉద్యోగాల కోసం ఎక్కడికో పోవాల్సిన అవసరం ఉండదు. విశాఖ మా నగరం, మా ఊరు, మా రాజధాని.
అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది. అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది. ఎమ్మెల్యేలంతా ఇక్కడికే వచ్చి 60 - 70 రోజులు ఇక్కడే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం నంబర్ వన్ సిటీగా అక్కడే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడుతున్నాం. ముఖ్యమంత్రిగా నేను, మంత్రులు పరిపాలన కొనసాగిస్తాం. కర్నూలు జ్యుడీషియల్ రాజధానిగా కొనసాగుతుంది. గతంలో శ్రీబాగ్ ఒప్పందం మేరకు 1953-56 మధ్య కర్నూలు ఆంధ్రరాష్ట్ర రాజధానిగా కొనసాగింది. శ్రీబాగ్ ఒప్పందాలను కూడా పరిగణలోకి తీసుకొని కర్నూలును న్యాయ రాజధానిగా నిర్ణయించాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని నిర్ణయం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాం. రాబోయే తరాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నాపై ఉంది. రాబోయే తరాల వరకు అభివృద్ధి, ఉద్యోగాలు కోరుకుంటారు. డిగ్రీ పూర్తి చేసుకొని చేతుల్లో పట్టాలు పట్టుకొని యువత ఉద్యోగాలు కోసం వెతుకుతారు.. వారంతా ఎక్కడకు వెళ్లాలి.. అమరావతి లాంటి అద్బుతమైన నగరాలు కట్టేందుకు ఫండ్స్ లేవు. ఇది రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి. అమరావతిలో పెట్టే ఖర్చులో 10 శాతం మాత్రమే విశాఖకు అవసరం. ఇప్పుడిలా విమర్శలు చేస్తున్నారని చెప్పి విశాఖకు రాజధాని తరలించకుండా ఉంటే రేపు పొద్దున ఐదేళ్ల తరువాత వచ్చి మన రాజధాని ఏది అని చూపించమంటే.. అమరావతిని పూర్తిచేసేన్ని డబ్బులు మన దగ్గర లేవు కాబట్టి ఏ పల్లెటూరునో.. తుళ్లూరు మండలాన్నో రాజధానిగా చూపించాలి. అమరావతికి రూ. లక్ష కోట్లు ఖర్చు అవుతుంది. అది కూడా అప్పు తీసుకొచ్చి పెట్టాలి.. ఓ 20 ఏళ్ల తరువాత ఈ రూ. లక్ష కోట్లకు వడ్డీ రూ. 3 లేదా 4 లక్షల కోట్లు అవుతుంది. చంద్రబాబు చెబుతున్నట్లుగా క్యాపిటల్ నిర్మించేందుకు అనువైన భూమి ఇక్కడ లేదు. నేను అధికారులను సంప్రదించిన తరువాత వారు నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలను చెప్పారు. అవేంటంటే.. ఎంత భూమి ఉందంటే.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్, నది పరివాహక చట్టం ప్రకారం లీగల్‌గా భవనాలు కట్టేందుకు మిగిలింది కేవలం 5200 ఎకరాల భూమి మాత్రమే.
ఈ 5200 ఎకరాలకు మాత్రమే రూ. లక్ష కోట్ల పెట్టుబడి పెడితే అది 20 సంవత్సరాల తరువాత రూ. 3 లేదా 4 లక్షల కోట్లు అవుతుంది. ప్రస్తుతం అమరావతిలో ఎకరా రూ. 20 కోట్లు ఉంది. మరో 20 సంవత్సరాల తరువాత ఒక్క ఎకరా ఇక్కడ రూ. 90 కోట్లకు పైగా పలుకుతుంది. ఇంత డబ్బు ఎక్కడి నుంచి ప్రభుత్వాలు తీసుకురాగలుగుతాయి. ఇదే మనకు ఉన్న క్లిష్టమైన పరిస్థితి. అందుకే విశాఖను పరిపాలన రాజధానిగా ఎంచుకున్నాం.
మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అందరూ విప్లవాత్మకంగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఒక తండ్రిగా తన పిల్లలకు ఏదైతే చేయాలనుకుంటాడో అలాగే చేసాను. ఈ రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉంటూ నిర్ణయం తీసుకునే అవకాశం నాకు ప్రసాదించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను ఒక తండ్రి నెరవేర్చాల్సిన బాధ్యత నెరవేరుస్తున్నాను. నాకున్న సామర్థ్యం మేరకు ఎంత వరకూ చేయగలనో అదంతా ఉత్తమంగా చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీలో ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటే అడగొచ్చు.
శర్మ, ఫిజీసియన్
మంచి పని చేస్తున్నందుకు ముఖ్యమంత్రిని అభినందిస్తున్నాను. మీ ప్లానింగ్ ఎక్సలెంట్ గా ఉంది. అయితే అమలు కూడా అంతే బాగా జరుగుతుందా? లేక గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిలా ఎన్నో హామీలిచ్చి మధ్యలో వదిలేస్తారా? వీటికోసం నిధులు ఎలా సమకూర్చుకుంటారు?
నిధులు లేవు అనే వాస్తవాన్ని నేను దారి మళ్లించాలనుకోవడం లేదు.
చూడండి. ఎక్కువ ఖర్చు కాదు అని నేను వాస్తవాన్ని కప్పి పుచ్చలేను. నేను ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకోవడం లేదు. నేను గ్రాఫిక్స్ చూపించాలనుకోవడం లేదు. బాహుబలి గ్రాఫిక్సో, సింగపూర్ సిటీనో చూపించాలనుకోవడం లేదు. జపాన్ నగరాలనో, షాంఘై సిటీలనో చూపించి ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం లేదు. మాకు అవసరమైన నిధులేవీ లేవు. అయితే క్రమానుగతంగా వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకుంటున్నాను.
ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడ్డాయి. కానీ రాయలసీమ 4 జిల్లాల్లో డ్యామ్స్ నిండనే లేదు. కాల్వల సామర్థ్యం లేకపోవడమే దానికికారణం. కాల్వల ఆధునీకరణ చేయాలంటే ఆర్ అండ్ ఆర్ సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ పరిష్కరించాలంటే 33వేల కోట్లు అవసరం అవుతాయని ఇంజనీర్లు అంటున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చూసినా, పోలవరం చూసినా 16,000 కోట్లు అవసరం అవుతున్నాయి. వీటిలో నేను వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి? దశాబ్దాలుగా పూర్తి కాని ప్రాజెక్టులు, నా తండ్రి వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించిన ప్రాజెక్టులను గత ప్రభుత్వంలో చంద్రబాబు విస్మరించారు. వాటిని పూర్తి చేయాలంటే మాకు మరో 25,000 కోట్లు కావాలి.
47ఏళ్ల సీ.డబ్ల్యూసీ రికార్డులు పరిశీలిస్తే 1200 టీఎంసీల నీరు శ్రీశైలం చేరుతుందని ఉంది. కానీ గత పదేళ్ల రికార్డు చూస్తే 1200 టీఎంసీలనుంచి అది 600 టీఎంసీలకు పడిపోయింది. అదే ఐదేళ్ల నాటి రికార్డులపై విచారణ చేసి చూస్తే అది 400 టీఎంసీలకు క్షీణించినట్టు అర్థం అయ్యింది. అంటే నీరందక కృష్ణా ఆయకట్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. మరోపక్క గోదావరి వరద నీరు 3000 టీఎంసీలు వృద్ధాగా సముద్రంపాలౌతోంది.
వ్యవసాయ ఆధారితమైన ఈ రాష్ట్రంలో 62% మంది దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గోదావరి నీటిని కృష్ణకు మళ్లించడం తప్ప వేరే దారిలేదు. ఇంజనీర్లు ఇందుకు 68,000 కోట్లు ఖర్చౌతుందంటున్నారు. దీనికంటే తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తి అయ్యే మరో మంచి మోడల్ సూచించాలని వారిని కోరాను. అదైనా 40 నుంచి 45,000 కోట్లు ఖర్చు అవుతుంది. వీటిలో నేను వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి?
పేదలకు ఇళ్లు. ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి పట్టా ఉండాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. సుమారు 25లక్షల మందికి ఈ ఉగాదికి ఇంటి పట్టాలు ఇవ్వబోతున్నాం. వీటిలో కనీసం ఏడాదికి 6లక్షల మందికి ఇళ్లు కట్టించి నాలుగేళ్లలో వాటిని పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం ఏడాదికి సుమారు 9000 కోట్లు అవుతుంది. ఇవన్నీ చేయడానికి రాష్ట్రంలో నిధులు ఉన్నాయా? అలా చేసే స్వేచ్ఛ, అవకాశం లేదు.
మీరు ఉన్నవాటిలో చదువుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం విషయంలో ఏం చేయబోతున్నారు?
దీనిపై మా మంత్రి మాట్లాడతారు. ఆయన రెవెన్యూ సర్వీస్ లో పనిచేసిన అనుభవం కల వ్యక్తి. స్వచ్ఛంద పదవీవిరమణ చేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. దళితుడు, సామాజిక మార్పును కోరుకునే వాడు. అందుకే ఆయన్ను విద్యాశాఖా మంత్రిని చేసాం. మేము ఆశిస్తున్న మార్పును ఆయనే ముందుండి నడిపిస్తారు. ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి టీచర్ల ట్రైనింగ్ కోసం ఓ కరిక్యులమ్ తయారు చేసాం. ప్రాధమికంగా జిల్లాకు 20 మందికి శిక్షణ ఇవ్వబోతున్నాం. ఒకపక్క టీచర్లకు ట్రైనింగ్ కరిక్యులమ్ తో పాటు మరోవైపు విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సును ఏర్పాటు చేస్తున్నాం. వెట్రి శెల్వన్ అనే యువ ఐఎఎస్ ఆఫీసర్‌ను ఇంఛార్జ్‌గా నియమించాం. ఈ అంశాలకు సంబంధించి అన్ని విషయాలను ఆమె వివరిస్తారు.
గొప్ప మార్పుకు నాంది పలికే ఈ నిర్ణయం చాలా మంచిది. అలాగే మీరు రివర్స్ టెండరింగ్ ద్వారా 20%కి పైగా ప్రాజెక్టుల్లో ఆదా చేస్తున్నామన్నారు. అదెలా ఉందో కాస్త చెబుతారా?
దేశంలోనే తొలిసారి ఓ మార్పుకు శ్రీకారం చుట్టాం. మూలాల నుంచి అవినీతిని నిర్మూలించే మార్పును ప్రారంభించాం. దేశం అంతా ఆదర్శంగా తీసుకునే నిర్ణయం తీసుకున్నాం. 100కోట్లకు పైబడిన ఏ టెండర్ అయినా ముందు జడ్జి ముందుకు వెళుతుంది. దీన్ని వారు పబ్లిక్ డొమైన్లో వారం రోజులు ఉంచుతారు. కాంట్రాక్ట్ లో ఉన్న నిబంధనలపై ఎవరికి అభ్యంతరాలున్నా, సలహాలు ఇవ్వదలుచుకున్నా ఇవ్వొచ్చు. చాలా వరకూ అవినీతికి ఆస్కారం ఎక్కడుంటుందంటే ప్రాజెక్టుల టెండర్లు టైలర్ మేడ్ లా ఉంటాయి. కొందరు మాత్రమే అర్హత పొందేలా వాటిని తయారు చేస్తుంటారు. దీన్ని నివారించడానికే మేము ఈ ప్రివ్యూ కమీషన్ ఏర్పాటు చేసాం. న్యాయ మూర్తి ఆధ్వర్యంలో అధికారులు టెండర్ నిబంధనలు ఖరారౌతాయి. టెండర్లో అతి తక్కువ కోట్ చేసిన ఎమౌంట్ ను చూపిస్తూ రివర్స్ టెండరింగ్‌కు వెళతాం. దాని కంటే తక్కువకు ఆ టెండర్ చేస్తామని ఎవరు పోటీ పడినా వారికి ప్రాజక్టు కాంట్రాక్టు అప్పగిస్తాం. ఈ ఏడు నెలల కాలంలో దాదాపుగా 2000 కోట్లు ఈ రివర్స్ టెండరిగ్ ద్వారా ఆదాచేయగలిగాం. పేదల ఇళ్లకు సంబంధించిన టిడ్కో ప్రాజెక్టు అందుకు ఓ ఉదాహరణ. గతంలో సుమారు 2700 కోట్లుగా నిర్ణయమైన ఈ టెండర్‌ను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం ద్వారా దాన్ని 2300 కోట్లకు తీసుకురాగలిగాం. అలాగే పోలవరంలో గత గత టెండర్ తో పోలిస్తే రివర్స్ టెండరింగ్ ద్వారా 830 కోట్లు ఆదా చేయగలిగాం. రాష్ట్రంలో ఇక ఏ టెండర్ అయినా ఇప్పుడు ఇదే పద్ధతిలో చేయబోతున్నాం. త్వరలో దీన్ని దేశమంతా అమలు చేస్తుందని నేను నమ్ముతున్నాను. పారదర్శకతకు మరో గొప్ప స్థాయిని ఇస్తున్నాం అని భావిస్తున్నా