రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ఘ‌ట‌న‌పై వైయస్ జగన్ దిగ్భ్రాంతి

23 Feb, 2026 11:37 IST

 

తాడేపల్లి :  రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఇప్పటికే నలుగురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషాద ఘటనపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రజలను కలిచివేసిందని, నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకే ముప్పు తెస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైతే నిపుణుల వైద్య బృందాలను నియమించి సమగ్ర వైద్యం అందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, పాలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు పేర్కొన్నారు.