తిరుపతిలో దళిత విద్యార్థిపై దాడి ఘటన.. వైయస్ జగన్ ఆగ్రహం
తాడేపల్లి: తిరుపతిలో దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడి ఘటనపై వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది’’ అని వైయస్ జగన్ పేర్కొన్నారు.
‘‘చంద్రబాబు, అధికార పార్టీ నాయకుల డైరెక్షన్‌లో కక్ష సాధింపు చర్యల్లో మునిగి తేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు.. ఫిర్యాదు దారులమీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది.
..జేమ్స్‌పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదునుకూడా స్వీకరించలేని పరిస్థితి. తిరుపతి ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.