మోసానికి షర్టు, ఫ్యాంటు వేస్తే అది చంద్రబాబే
తాడేపల్లి: 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో చూపించిన లెక్కలు, వాస్తవాలు, దాగి ఉన్న మోసాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
“మూడో బడ్జెట్‌లో మూడో మోసం”
ప్రజలను మోసం చేస్తూ, వంచిస్తూ తీసుకొచ్చిన బడ్జెట్ ఇదేనని జగన్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్, మ్యానిఫెస్టో హామీలు గాలికి కొట్టుకుపోయాయని విమర్శించారు.
“అన్నివర్గాల్ని మోసం చేసేలా ఈ బడ్జెట్‌ను రూపొందించారు. పదేపదే అబద్ధాలు చెబుతూ ‘సూపర్ క్విట్’ అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు” అని ఆరోపించారు.
* “మోసానికి షర్టు, ఫ్యాంటు వేస్తే అది చంద్రబాబే”
* “అబద్ధానికి రెక్కలు కడితే అది చంద్రబాబే” అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రగతి, వృద్ధి రేటుపై ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతాయని, కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అన్నారు.
వృద్ధి రేటుపై ప్రశ్నలు
“రాష్ట్ర వృద్ధి రేటు పెరిగిందంటే అన్నిరంగాల్లో అభివృద్ధి జరిగిందనే అర్థం. కానీ ప్రజల చేతుల్లో డబ్బు ఉందా? కొనుగోలు శక్తి పెరిగిందా?” అని జగన్ ప్రశ్నించారు.
వృద్ధి రేటు పెరిగితే తలసరి ఆదాయం కూడా పెరగాలని, కానీ ఆ దిశగా ఎలాంటి స్పష్టమైన ఫలితాలు కనిపించడం లేదన్నారు.
ఆదాయ లెక్కలపై విమర్శ
* 2024–25లో రూ.1,19,927 కోట్లు వస్తాయని అంచనా వేశారని,
* కానీ వాస్తవంగా వచ్చిన ఆదాయం రూ.94,937 కోట్లేనని పేర్కొన్నారు.
* కేవలం 10 నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం రూ.75,964 కోట్లకే పరిమితమైందని వివరించారు.
బడ్జెట్‌లో చూపించిన అంచనాలు, వాస్తవ ఆదాయాల మధ్య భారీ వ్యత్యాసం ఉందని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఆరోపించారు.