రాష్ట్రంలో రాక్షస పాలన
తాడేపల్లి: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు పాలనలో రాజకీయాల నైతికంగా పతనం అయ్యాయని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పరిపాలనలో కేసులు ఎదుర్కోవాలని.. అలాగే జైళ్లకూ వెళ్లగలగాలని, అలాంటి వారే ఇప్పుడు రాజకీయాలు చేయగలరని, రాజకీయాల్లో మనుగడ కొనసాగించగలరని ఆయన తెలిపారు.
కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కి చెందిన వైయస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..:
అలా ఉండగలిగినప్పుడే..:
మీ అందరితో ఈరోజు సమావేశం కావడం ఎంతో సంతోషకరం.
ఎలాంటి పరిస్థితుల మధ్య మనం ప్రయాణం చేస్తున్నామో నా కంటే మీకే బాగా తెలుసు. మనం రాక్షస యుగంలో ఉన్నాం. కలియుగంలో అంటే చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలంటే.. కేసులు వేసినా భయపడొద్దు. జైళ్లకు పంపినా, చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటాం అంటేనే, అలా ఉండగలిగినప్పుడే రాజకీయాల్లో ఉండగలం. రాజకీయాలు చేయగలం. అదే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటున్న పాఠం. ఆ విధంగా ఈరోజు రాజకీయాలు తయారయ్యాయి.
నాడు ఏనాడూ గతి తప్పలేదు:
చంద్రబాబు ఈరోజు చేస్తున్న రాజకీయంలో కనీసం ఒక శాతం కూడా మనం చేయలేదు. ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. నాడు స్థానిక ఎన్నికల్లో అన్నీ మనం గెల్చాం. కేవలం రెండు మున్సిపాలిటీల్లో మనం ఓడిపోయాం.
తాడిపత్రి మున్సిపాలిటీలో మనకు 16 మంది కౌన్సిలర్లు ఉంటే, టీడీపీకి 18 మంది ఉన్నారు. ఇద్దరిని లాగుదామని, మన ఎమ్మెల్యే అంటే, నేను వద్దన్నాను. ఎమ్మెల్యేను హౌజ్ అరెస్టు చేయించి, ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాను. అదీ మనం చేసిన విలువలతో కూడిన రాజకీయం.
నాడు జగనన్నకు చెబుతాం అని కార్యక్రమం పేరుతో, ఒక నెంబర్ ఇచ్చాను. దానికి ఎవరు ఫోన్ చేసినా, వెంటనే స్పందించి, సమస్యలు పరిష్కరించాం. అలాగే స్పందన అనే కార్యక్రమం వారం వారం నిర్వహించాం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాం. కలెక్టర్లు, మండల స్థాయిలో కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, నేరుగా సీఎంఓ ఫాలోఅప్ చేసేది. అప్పుడు ఎక్కువ సమస్యలు టీడీపీ వారివే పరిష్కారమయ్యాయి.
పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ:
ఆరోజు కులం, మతం, రాజకీయం చూడకుండా మనం పాలించాం. అదే ఈరోజు పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.
అయినా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మనం రాజకీయం చేస్తున్నాం.
ఈరోజు తిరువూరు చూసినా, ఎక్కడైనా అదే రాజకీయం.
తిరువూరులో 20 మంది కౌన్సిలర్లలో 17 మంది వైయస్ఆర్‌సీపీకి చెందిన వారు కాగా, టీడీపీ నుంచి ముగ్గురే ఉన్నా, బలవంతంగా లాగే ప్రయత్నం చేస్తున్నారు. 5గురిని లాగారు. అయినా ఆ ఎన్నికలో మనమే గెలవాలి. ఎందుకంటే మన బలం 12. టీడీపీకి కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. టీడీపీకి బలం లేకపోయినా, పదవి కోసం దారుణంగా వ్యవహరిస్తున్నారు. కానీ, అది కూడా జరగకుండా పోలీసుల సహాయంతో ఎన్నిక జరగకుండా చూస్తున్నారు. మన నాయకులను హౌజ్ అరెస్టు చేశారు. టీడీపీ వారందరినీ రోడ్ల మీదకు వదిలారు.
ఈరోజు కోర్టులో హౌజ్ మోషన్ మూవ్ చేశాం. పోలీసు బందోబస్తు కోరాం. ఎన్నికల జరగకుండా చూస్తున్నారు.
నరసారావుపేటలో మొత్తం 17 గెల్చాం. కానీ వారిలో కొందరిని లాక్కున్నారు. దీంతో మనకు 13 మంది సభ్యులు ఉండగా, టీడీపీకి కేవలం ముగ్గురే ఉన్నారు. ఒకరు చనిపోయరు. కోరం లేకపోయినా గెల్చామని ప్రకటించుకున్నారు.
కారంపూడిలో మొత్తం 14 వైయస్ఆర్‌సీపీ గెలిస్తే, ఆరుగురిని లాగారు. అయినా అక్కడ మన బలం 8 కాగా, టీడీపీకి ఆరుగురు మాత్రమే ఉన్నారు. అయినా అక్కడా కోరం లేకపోయినా గెల్చినట్లు ప్రకటించారు. చివరకు కుప్పంలోనూ అదే పరిస్థితి. కుప్పం మున్సిపాలిటీ, రామకుప్పంలోనూ అదే పరిస్థితి.
రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో వైయస్ఆర్‌సీపీ 9 గెలిస్తే, టీడీపీ 1 మాత్రమే గెల్చింది. అయినా ఛైర్మన్ ఎన్నికలో అక్రమాలు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ఎందుకీ రాజకీయాలు? సీఎం స్థాయిలోనే అక్రమాలు చేస్తే ఎలా? ఒక పార్టీ మీద గెల్చినప్పుడు, వారిని లాక్కోవడం ఏమిటి?
సీఎంగా ఉన్న వ్యక్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోవడం, పోలీసులను పెట్టి భయపెట్టడం ఏమిటి? మన పార్టీ నుంచి ముగ్గురిని లాక్కున్నారు. అయినా మనకు ఇంకా ఆరుగురు ఉన్నారు. మనదే మెజారిటీ. ఎన్నిక పెడితే మనమే గెలుస్తాం. అయినా దౌర్జన్యం చేసి, కోరం లేదని చెప్పి, ఎన్నిక గెల్చే ప్రయత్నం చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం, యలమంచిలి.
అక్కడ వైయస్ఆర్‌సీపీ 14. టీడీపీ 4 గెల్చింది. ఒకరిని లాక్కున్నారు. మిగతావారు గట్టిగా నిలబడడంతో, ఏం చేయలేక వదిలేశారు. ఇలా ప్రజాస్వామ్యం ఖూనీ అయిన పరిస్థితుల్లో మనం ఏకం అవుతున్నాం.
ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత:
మామూలుగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏడాది తర్వాత కొంత వస్తుంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వానికి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు ఆయన్ను తీవ్రంగా ద్వేషిస్తున్నారు.
ఆయన ఎందుకిలా చేస్తున్నాడు అనేది గమనిస్తే.. కారణం, ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చాడు. జగన్ ఇచ్చినవన్నీ ఇవ్వడమే కాకుండా, ఇంకా మూడు ఎక్కువ ఇస్తానన్నాడు. కానీ, ఏదీ నిలబెట్టుకోలేదు. ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. అందుకే ఆయన ప్రభుత్వంపై అంత వ్యతిరేకత వచ్చింది.
నాడు 99 శాతం హామీల అమలు:
అదే మన ప్రభుత్వ హయాంలో ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ఇంటింటికీ వెళ్లగలిగాడు. మ్యానిఫెస్టో చూపి, జగన్ ఏం చేశాడో చూపి టిక్ పెట్టమని అడిగాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు.. మూడు సార్లు, ప్రతి ఇంటికి వెళ్లి, ఎన్నికల ముందు ఏమేం చేశామో చెప్పాం. వాటిని చూపాం. ఎన్నికల మ్యానిఫెస్టోను ఒక భగవద్గీతగానూ, ఖురాన్‌గానూ, బైబిల్‌గానూ భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేసిన పార్టీ దేశంలో ఎక్కడా లేదు.
అయినా మనం ప్రతిపక్షంలో ఉన్నాం. కారణం ఏమిటంటే కేవలం 10 శాతం మంది నమ్మి, వ్యతిరేకంగా ఓటేశారు. అందుకే విపక్షంలో ఉన్నాం.
ఆయన్ను ఫుట్‌బాల్‌లా తంతారు:
ఇంత మంచి చేసిన మనకే ప్రతిపక్షంలో కూర్చున్నాం అంటే..అదే చంద్రబాబు పరిస్థితి ఏమిటి? ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ప్రజలు ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తన్నుతారు. చంద్రబాబు, ఆయన పార్టీ కార్యకర్త, ఏ ఒక్క ఇంటికి ధైర్యంగా పోలేరు. వారు ఏ ఇంటి తలుపు తట్టినా.. పిల్లవాడి స్థాయి నుంచి ప్రశ్నించడం మొదలు పెడతారు. ఎన్నికలప్పుడు ఇంటింటికి పోయి ఏం చెప్పారు? బాండ్లు అన్నాడు. ఇంకా ఏమేం చెప్పారు?.
ఇంటింటికీ వెళ్లి, చిన్న పిల్లాడు కనబడితే నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని, అదే ఇంట్లో ఆ పిల్లల అమ్మ కనబడితే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లోనే అమ్మమ్మలు కనబడితే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్ల యువకుడు కనబడితే నీకు రూ.36 వేలు అని, రైతు కనబడితే నీకు రూ.26 వేలు ఇస్తామని చెప్పారు.
ఆ మాటలు ఇంకా వారిని వెంటాడుతాయి. మాట మీద నిలబడని రాజకీయ నాయకుడు సీఎం హోదాలో ఉన్నాడు. మాట ఇస్తే, దాన్ని అమలు చేయని వ్యక్తి సీఎంగా ఉన్నాడు.
అన్నీ నిర్వీర్యం:
రాష్రంలో విద్యా రంగం నిర్వీర్యం అయింది. ఇంగ్లిష్ మీడియమ్ లేదు. గోరుముద్ద నామమాత్రం అయింది. నాడు–నేడు లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. మనం అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున ఇచ్చాం. ఇవాళ అది లేదు. నిరుపేదల ఆరోగ్యం గురించి ఆలోచించే పరిస్థితి ఈరోజు లేదు. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని వదిలేసింది. ఆ బిల్లులు దాదాపు రూ.3600 కోట్లు. అవి ఇవ్వడం లేదు. ఆరోగ్య ఆసరా అమలు లేనే లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకపోవడంతో, వైద్యానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి.
ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. దళారులు వచ్చారు.
ఆర్బీకే వ్యవస్థ నాశనం చేశారు. ఉచిత ఇన్సూరెన్స్ లేదు. పంటనష్ట పరిహారం ఇవ్వడం లేదు.
మనం బాగు చేస్తే.. బాబు చెడగొడుతున్నాడు:
మనం 17 మెడికల్ కాలేజీలు కడితే, ఈరోజు వాటిని అమ్మేస్తున్నారు. ఏదైనా జిల్లాలో మెడికల్ కాలేజీ ఉంటే, అక్కడ అన్ని వైద్య సదుపాయాలు, ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఉన్నట్లు. దాని వల్ల ఆ జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు రోగులను మోసం చేయలేవు.
మనం స్వయంగా మూలపేట (శ్రీకాకుళం జిల్లా)లో ఒక పోర్టు కట్టడం మొదలు పెట్టాం. దానితో కలిపి మూడు పోర్టులు కట్టడం మొదలు పెట్టాం. వాటిలో 30 శాతం పనులు పూర్తి చేస్తే, కమిషన్ల కోసం చంద్రబాబు వాటిని అమ్మేస్తున్నాడు.
ఉత్తరాంధ్రలో ట్రైబల్ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజ్, ఐటీడీఏ పరిధిలో 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం మొదలు పెడితే, ఈ పెద్దమనిషి మొత్తం వదిలేశాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు. దాని కోసం మనం భూసేకరణ చేశాం. 30 శాతం పనులు చేశాం. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా, ఏ అభివృద్ధి అయినా జరిగింది అంటే కేవలం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలోనే.
అందుకే రెడ్‌బుక్ రాజ్యాంగం:
చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు. ఆయన ఎక్కడా మాట నిలబెట్టుకోలేదు. అలా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు.
అందుకే తనను వరూ ప్రశ్నించవద్దని భయానక పాలన. అందులో భాగంగా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. ఎవరు మాట్లాడినా,గొంతు విప్పినా, వారి గొంతు నొక్కుతున్నారు. నులిపేస్తున్నారు.
ఇంకా తొలిసారి చూస్తున్నాం. మ్యానుఫ్యాక్చర్ విట్నెస్ సృష్టిస్తున్నారు. అంటే నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు. కానీ, వారు ఏం చేస్తున్నారంటే.. వారికి సంబంధించిన ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తున్నారు. ఆయన్ను అప్రూవర్ అంటున్నారు. ఆయనతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నారు. ఒక మ్యానుఫ్యాక్చర్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ మనిషితో, ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు. ఈ మనిషిని అరెస్టు చేస్తున్నారు. చరిత్రలో గతంలో ఏనాడూ ఇలాంటివి జరగలేదు.
ఒక తప్పుడు సంప్రదాయానికి ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు గారు ఈరోజు బీజం వేస్తున్నారు.
ప్రతి నియోజకవర్గంలో పాత కేసులు తిరగ తోడుతున్నారు. మన ఎమ్మెల్యే అభ్యర్థిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. చురుగ్గా పని చేస్తున్న ప్రజా ప్రతినిధులు, నాయకులను ఇరికిస్తున్నారు. ఎవ్వరినీ వదిలి పెట్టకుండా తప్పుడు కేసులు పెడుతున్నారు.
వైయస్ఆర్‌సీపీకి కార్యకర్తే నెం.1:
ఈరోజు నేను ఒకటే చెబుతున్నాను. మీ అన్నగా, మీ బిడ్డగా ఒకటే చెబుతున్నాను. జగన్ 2.0లో పరిస్థితి ఇలా ఉండదు. పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈరోజు కార్యకర్తల కష్టాలు చూశాను. స్వయంగా చెబుతున్నాను.
గతంలో మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్. దాంతో మనం యుద్ధం చేశాం. అందువల్ల అనుకున్న మేరకు కార్యకర్తలకు చేయలేకపోయాను. ఇప్పుడు చెబుతున్నాను. రేపు ఈ పరిస్థితి ఉండదు. వైయస్ఆర్‌సీపీకి కార్యకర్తనే నెంబర్ 1.
పేరు రాసి పెట్టుకొండి. సినిమా చూపిద్దాం:
ప్రతి కార్యకర్తకు చెబుతున్నా. మీకు ఎవరు అన్యాయం చేసినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, పేరు రాసుకొండి. అది ఏ బుక్ అయినా సరే. రెడ్ బుక్ అని నేను చెప్పాను. పేరు మాత్రం రాసుకొండి
ఆ తర్వాత మనం వచ్చాక, ఈరోజు మీకు అన్యాయం చేసిన వారికి సినిమా చూపిస్తాను. ఆ మనిషి రిటైర్ అయినా, దేశం వదిలి పోయినా లాక్కొస్తాం. ఎవ్వరినీ వదిలి పెట్టం. సినిమా ఎలా చూపాలో చూపిస్తాను.
ఎవరైనా కొట్టినా కొట్టించుకొండి. ఫరవాలేదు. నీ టైమ్ బాగుంది. కొట్టు అనండి. ఆ తర్వాత మన టైమ్ వస్తుంది. అప్పుడు మనం కొడతాం.ఇవాళ వారు నాటుతున్న విత్తనం రెండింతలు అవుతుంది.
దారుణ వేధింపులు:
ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది.
మంగళగిరికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి, పోలీస్ స్టేషన్లు తిప్పారు. అలాగే సుధారాణిని నెలల తరబడి స్టేషన్లు తిప్పారు. శ్రీకాకుళం నుంచి అన్ని స్టేషన్లు తిప్పారు. బెయిల్ రాకుండా చూశారు.
వంశీ. మాజీ ఎమ్మెల్యే. 11 కేసులు. ఒకదాంట్లో బెయిల్ వస్తే, మరో కేసు. 2 నెలలుగా జైల్లోనే ఉంచారు. ఒక దాని తర్వాత మరో కేసు పెడుతున్నారు. ఇంకొకరు మాజీ ఎంపీ. దళితుడు. నెలల తరబడి జైల్లో పెట్టారు. ఆయనే నందిగం సురేష్. ఆయనను నెలల తరబడి జైల్లో ఉంచారు. బెయిల్ మీద బయటకు వస్తే, మరో కేసుల ఇరికించి, జైలుకు పంపారు. వాళ్ల ఇంటి దగ్గరకొచ్చి ఒక మనిషి తిట్టాడు. ఎందుకు తిడుతున్నావని ప్రశ్నిస్తే, మరో కేసు పెట్టి, జైలుకు పంపారు.
తప్పుడు సంప్రదాయం. ఆ పరిస్థితి వస్తుంది:
ఈరోజు ఒక తప్పుడు సంప్రదాయం మొదలు పెట్టారు. అది ఒక వృక్షమై, రెండింతలు పెరిగి, మిమ్మల్ని తన్నే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో గట్టిగా పోరాడుదాం. చూస్తుండగానే ఏడాది గడిచింది. ఇంకా చూస్తుండగానే మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. చీకటి తర్వాత వెలుగు తప్పదు. మనం తప్పకుండా గెలుస్తాం.
అందుకే రాబోయే రోజుల్లో ఉధృతంగా పోరాడాలి.
ఈలోగా గ్రామస్థాయి నుంచి బూత్ కమిటీలు, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఉద్యమబాట పట్టి, ప్రభుత్వ తప్పులను ప్రజల్లో ఎండగట్టాలి. అందుకే ఈ సమావేశాల నిర్వహణ. ఈ ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలది చాలా గొప్ప పాత్ర అని వైయస్ జగన్ వివరించారు.
కాగా, ఈ సమావేశంలో వైయస్ఆర్‌సీపీకి చెందిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ ఛైర్‌పర్సన్స్, వైస్ ఛైర్‌పర్సన్స్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు కార్పొరేటర్లు. ఇంకా ఆయా జిల్లాల పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.