అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు

1 Apr, 2026 13:03 IST

 తాడేపల్లి: అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం ఉందా? అని ప్రశ్నించారు. ఏడేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేమిటి? భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా?  అని వైఎస్‌ జగన్‌ అడిగారు.

 
వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నారా? ఇప్పటికీ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? ఇప్పుడు కూడా మూడు ప్రత్యేక విమానాల్లో షటిల్‌ సర్వీసు చేస్తున్నారు.వైయ‌స్ఆర్‌సీపీ అమరావతి ప్రాంతానికే కాదు.. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ వ్యతిరేకం కాదు.

శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా. రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని స్వయంగా మంత్రి పార్థసారథి చెప్పారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదు. చంద్రబాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ, అవినీతి. చంద్రబాబు సీఎంగా ఉండటం ఏపీ ప్రజల దురదృష్టం. ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆయా రాష్ట్రాలే రాజధానులను నిర్ణయించుకున్నాయి. ఏడేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేమిటి?. భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా?.

అమరావతిని ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు?. రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుందని చంద్రబాబు లెక్కలే చెబుతున్నాయి. ఆ లెక్కన లక్ష ఎకరాలకు 2 లక్షల కోట్లు కావాలి. రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి?. ఈ 2 లక్షల కోట్లు ఇంకా పెరుగుతూనే పోతాయి. 2019కి ముందు మాస్టర్‌ ప్లాన్‌ను ఎందుకు మారుస్తున్నారు. ఒకప్పుడు వరల్డ్‌ క్లాస్‌ సిటీ అని చంద్రబాబు ఊదరగొట్టారు. ఇప్పుడు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని ఎందుకు అంటున్నారు. చదరపు అడుగుకు 11వేల నుంచి 14వేలు అవుతుందని చెబుతున్నారు. ఐదున్నర గంటల చర్చలో అమరావతిపై ఏం చెప్పారు?. రాజధాని పేరుతో పట్టపగలే దోపిడీ చేస్తున్నారు. దోపిడీని డైవర్ట్‌ చేసేందుకు చంద్రబాబు డ్రామాలు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వైయ‌స్ఆర్‌సీపీ వ్యతిరేకం కాదు. చట్టసభల్లో భాగమైన కౌన్సిల​్‌లో చర్చ లేదు. కౌన్సిల్‌ సభ్యులు అవినీతిని బయటపెడతారని బాబు భయం. సభలు చట్టాలు చేస్తాయి. సవరణలూ చేయగలుగుతాయి’ అంటూ వ్యాఖ్యానించారు.