జననేతకు ఘన స్వాగతం 

22 Apr, 2026 15:58 IST

వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు పులివెందుల పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పర్యటించిన ఆయన, ప్రజల సమస్యలు, అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో ఇటీవల వివాహం చేసుకున్న వైయస్ఆర్‌సీపీ నాయకుడు దివంగత పుల్లారెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి – అమృత రెడ్డి దంపతులను జగన్ ఆశీర్వదించారు. అలాగే అదే గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు వెంకటరామిరెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించారు.

ఇప్పట్ల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైయ‌స్ జగన్, అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. ఇదిలా ఉండగా కడప–పార్నపల్లి రహదారిపై రాజారెడ్డి కాలనీకి చెందిన ప్రజలు జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. జాతీయ రహదారి నిర్మాణం కారణంగా తమ ఇళ్లను కోల్పోతున్నామని, సరైన పరిహారం అందడం లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను శ్రద్ధగా విన్న వైయ‌స్‌ జగన్, న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అన్యాయం జరగనివ్వమని, వారి పక్షాన ఎప్పుడూ నిలబడతామని స్పష్టం చేశారు.