‘రాష్ట్రం ఒక జంగిల్‌ రాజ్‌’

28 Jan, 2026 16:05 IST

తాడేపల్లి: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో, పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఏలూరు నియోజకవర్గంతో ఈ తరహా సమావేశాలు మొదలు కాగా, రెండో సమావేశం భీమవరం నియోజకవర్గ కార్యకర్తలతో జరిగింది. 

ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..:

ఇదీ మనకు.. చంద్రబాబు పాలన మధ్య తేడా:
    ఈరోజు మనమంతా చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేళ్లు. ఫిబ్రవరి 11న మూడో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు.
ఈ ప్రభుత్వానికి మరో మూడేళ్లు మాత్రమే మిగిలింది. మరి ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికైనా మంచి జరిగిందా?. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటంటే.. గత ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దయ్యాయి. 
    మనం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాళ్లం. మ్యానిఫెస్టోను భగవద్గీతగా భావించేవాళ్లం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తపన పడే వాళ్లం. కోవిడ్‌ వంటి సంక్షోభంలో కూడా ఏ రోజూ ఏ హామీ ఎగ్గొట్టాలని అనుకోలేదు. ప్రభుత్వానికి ఎన్ని సమస్యలు ఉన్నా, వాటి కంటే ప్రజల సమస్యలు ఎక్కువని భావించి, చిరునవ్వుతో స్వీకరించాం. అన్ని హామీలు అమలు చేశాం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూశాం.
    అదే చంద్రబాబును చూస్తే.. మొత్తం మోసం. అబద్దాలు. సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌ గాలికెగిరిపోయాయి. ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చారు. విపరీతంగా ప్రచారం చేశారు. చివరకు ఇంటింటికీ బాండ్లు కూడా పంపారు. దానిపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ సంతకాలు చేశారు. పథకాల ద్వారా ఆ ఇంట్లో ఉన్న వారందరికీ ఎంతెంత వస్తుందనేది చెప్పారు. కానీ, ఏదీ నిలబెట్టుకోలేదు. ఒక మనిషి ఈ స్థాయిలో అబద్ధాలు చెబుతారా? అన్న ఆశ్చర్యం కలుగుతుంది. అది ఊహకు కూడా అందదు. మామూలుగా ఎవరైనా అబద్ధాలు చెప్పి, ఎవరైనా మోసం చేస్తే, 420 అని చెప్పి కేసు పెట్టి జైల్లో వేస్తారు. కానీ, చంద్రబాబుగారు, ఆయన కూటమి మాత్రమే అలా కేసులు పెట్టకుండా బయట ఉన్నారు. 

చంద్రబాబు పచ్చి మోసం. దగా:
    ఆరోజు ఇంటింటికీ వెళ్లి ఏం చెప్పారు? ఏమన్నారు?. ఆ ఇంట్లో ఎవరైనా పిల్లాడు కనబడితే నీకు రూ.15 వేలు,అని, ఆ పిల్లల తల్లులు కనబడితే నీకు రూ.18 వేలు అని, ఎవరైనా ఒక యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని, కండువా కప్పుకుని రైతు కనిపిస్తే నీకు రూ.26 వేలు అని, ఇంకా పెద్దవాళ్లు కనిపిస్తే నీకు రూ.48 వేలు ఇస్తాం అని చెప్పారు. ఆ తర్వాత పచ్చిగా మోసం చేశారు. చివరకు గ్యాస్‌ సిలిండర్లలో కూడా మోసం చేశారు. ఏటా మూడు సిలిండర్ల చొప్పున రెండేళ్లకు కలిపి మొత్తం ఆరు సిలిండర్లు ఇవ్వాలి. కానీ, ఇచ్చింది ఒకటి, రెండు మాత్రమే.అది కూడా అందరికీ ఇవ్వలేదు. చివరకు  అక్కడా అలా పచ్చిగా మోసం చేశారు.

 

మొత్తం డీపీటీ. దోచుకో. తినుకో. పంచుకో:
    మన హయాంలో 5 ఏళ్లలో, రెండేళ్లు కోవిడ్‌ వంటి సంక్షోభం ఉన్నా, మనం చేసిన అప్పు రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే. ఆ అప్పులో వివిధ పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు బటన్‌ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ఎవరికి ఆ డబ్బు పోయింది అన్న వివరాలు, వారి బ్యాంక్‌ ఎక్కౌంట్ల నెంబర్లు, వారి ఆధార్‌తో సహా ఇవ్వగలిగే విధంగా మన పాలన సాగింది.
    అదే, చంద్రబాబు ఇప్పటికే 20 నెలల్లోనే రూ.3 లక్షల కోట్లు అప్పు చేశాడు. అంటే మన హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పులో 95 శాతం ఇప్పటికే దాటాడు. మరి, ఆ డబ్బంతా ఏమైంది? ఎవరికి పోయింది? అన్న దానికి సమాధానం లేదు. అంతా దోచుకో. తినుకో. పంచుకో. అదే డీపీటీ. అదే మన కళ్ల ఎదుట కనిపిస్తున్న వాస్తవం.
    ఎక్కడ చూసినా, ప్రతిచోటా విచ్చలవిడి దోపిడి. అవినీతి. ఏ స్థాయిలో అవినీతి జరుగుతోంది అంటే, అసలు పాలకులు ఉన్నారా అని మనకే అనిపించే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. అదంతా తగ్గుతోంది. మరి, అదంతా ఎక్కడికి పోతుంది అంటే..  చంద్రబాబు మొదలు కింది వరకు ఇంత అని పంచుకుంటున్నారు. 


    మద్యం మాఫియా. ప్రైవేటు షాపులన్నీ లాటరీలో వాళ్ల మనుషులకే ఇచ్చుకున్నారు.గ్రామస్థాయిలో బెల్టుషాప్‌లు. ఇంకా వేలం పాట పాడి బెల్టుషాపులు ఇచ్చారు. ఎందుకంటే అక్కడ కార్యకర్తలు కొట్టుకోవద్దు కాబట్టి. ఇంకా అక్కడ పోలీసుల సహకారంతో మద్యం అమ్ముతున్నారు. మద్యం షాప్‌ పక్కనే పర్మిట్‌ రూం. అక్కడ పెగ్గుల్లో అమ్మకం. అక్కడా దోపిడి. వైన్‌షాప్‌ల్లో కూడా ఎక్కువ ధరకు అమ్మకాలు. ఎక్కడా ఎమ్మార్పీకి మద్యం అమ్మడం లేదు. బాటిల్‌ ప్లస్‌ రూ.20 వరకు వసూలు చేస్తున్నారు. ఇంకా ప్రతి నాలుగైదు బాటిళ్లకు ఒకటి నకిలీ. అలా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదోవ పడుతోంది.
    ఈరోజు ఇసుక ఫ్రీ అంటున్నారు. కానీ, ఎక్కడా ఫ్రీగా లేదు. ధర గతంలో కంటే డబుల్‌ రేటుకు అమ్ముతున్నారు. మన హయాంలో ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. అయిదేళ్లకు కలిపి దాదాపు రూ.3,500 కోట్ల ఆదాయం వచ్చింది. ఈరోజు ఆ ఆదాయం రావడం లేదు. ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు. ఇసుక తరలిస్తున్నారు. చివరకు ఏ ఒక్క గనిని వదలడం లేదు. సిలికా, మైకా, లాటరైట్, క్వార్ట్‌›్జ.. ఏదీ వదలకుండా అన్నీ దోచుకుంటున్నారు.

సంక్రాంతి సంబరాల్లో విచ్చలవిడితనం:
    మొన్న సంక్రాంతి చూస్తే.. అసలు మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోంది. అలాంటి ఆటవిక రాజ్యం మనం ఎప్పుడూ చూసి ఉండం. ఎంత దారుణం అంటే, సోషల్‌ మీడియాలో వీడియోలు చూస్తుంటే, ఆశ్చర్యం కలుగుతోంది.
    మొబైల్‌ రికార్డింగ్‌ డ్యాన్స్‌లు. కొత్తపేటలో వ్యాన్లపై రికార్డింగ్‌ డ్యాన్స్‌లు నిర్వహించారు. ఇంకా మొబైల్‌ వ్యాన్లలో మద్యం అమ్మారు. వాటి కోసం ప్రతి నియోజకవర్గంలో వేలం పాటలు పాడారు. చివరకు మా పులివెందులలో కూడా గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి వేలం పాట నిర్వహించారు. రూ.3 కోట్లకు అమ్ముకున్నాడు. వారు ఎక్కడి నుంచో వచ్చి, 8, 9 సెంటర్లు పెట్టి, అన్నీ నిర్వహించుకున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రభుత్వమే దగ్గరుండి ఇదంతా చేయిస్తోంది. ఇది జంగిల్‌ రాజ్యం. దోచుకున్న సొత్తు.. పై నుంచి కింది వరకు, చంద్రబాబు, లోకేష్‌ మొదలు కిందిస్థాకి నాయకుడి వరకు.. చివరకు పోలీసులు కూడా మీకింత, నాకింత అని పంచుకున్నారు.
    ఇక భీమవరం డీఎస్పీ మాటలు వింటే ఆశ్చర్యం వేసింది. ఆయన యూనిఫామ్‌లో ఉండి ఏమన్నాడు. ‘ఊపేయ్‌.. కుదిపేయ్‌’ అంటున్నాడు. అసలు మనం ఏ సమాజంలో ఉన్నామో అర్థం కావడం లేదు. ఏం జరుగుతోంది? ఇది ఆటవిక రాజ్యం కాక మరేమిటి?.

బరితెగిస్తున్న కూటమి ప్రజా ప్రతినిధులు:
    కూటమి నేతలు, ప్రజా ప్రతినిధుల బరితెగింపునకు అడ్డు లేకుండా పోయింది. విచ్చలవిడి తనం ఊహించని స్థాయికి వెళ్లిపోయింది అంటే, చంద్రబాబుగారు, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏ స్థాయికి వెళ్లారంటే.. .
    రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌. అసలు అతడు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే, ఆ అమ్మాయి అన్నీ సాక్ష్యాధారాలతో సహా బయపడితే, ఏ చర్యా లేదు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వేధింపులు భరించ లేక ఒక స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఆత్మహత్యా యత్నం చేసింది. అయినా ఏ చర్య లేదు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళను బలాత్కారం చేసినా, చివరకు అధికార దుర్వినియోగం కేసును క్లోజ్‌ చేయించుకున్నాడు. ఎంత దారుణం.
    ఇంకా మంత్రి సంధ్యారాణి పీఏపై ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ, తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేస్తే.. అతణ్ని అరెస్టు చేయాల్సింది పోయి, ఫిర్యాదు చేసిన బాధిత మహిళను జైలుకు పంపారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్‌ అహ్మద్‌ ఫోన్‌లో ఒక మహిళతో మాట్లాడుతూ, అశ్లీలంగా ప్రవర్తించాడు. ఇంక ఒక మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అశ్లీల రికార్డింగ్‌ డ్యాన్సులు వేశాడు. స్టేజీపై డ్యాన్సర్లతో కలిసి చిందులు వేశాడు. అలా రాష్ట్రం ఆటవిక రాజ్యంలా మారింది. విచ్చలవిడి తనం కనిపిస్తోంది. 
    ఆ స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే, జైల్లో పెట్టాల్సింది పోయి, వారిని ప్రోత్సహిస్తున్నారు. ఎవరంటే సాక్షాత్తూ చంద్రబాబునాయుడుగారు, ఆయన కొడుకు, ఆయన ప్రభుత్వం. జంగిల్‌ రాజ్యం అంటే ఇదే. విచ్చలవిడితనం, దోపిడి. 

యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం:
    మరోవైపు రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారు. ఏ మనిషి తప్పు చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు సాక్ష్యాలు క్రియేట్‌ చేస్తున్నారు. అసలు తప్పు చేసిన వారిపై చర్య తీసుకోవడం లేదు. పైగా ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు ఆ పని చేస్తున్నారు. విచ్చలవిడి దోపిడి. రెడ్‌బుక్‌ రాజ్యాంగం. పోలీసులు ఇష్టానుసారం కేసు పెడుతున్నారు. వ్యవస్థలన్నీ పతనం అయ్యాయి. మరోవైపు సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయి. మరోవైపు ఎన్నికల హామీలు ఏవీ అమలు కాలేదు. అన్నీ మోసాలు. 

పథకాలన్నీ నిర్వీర్యం:
    పథకాల అమలు లేదు. విద్యాదీవెన 8 త్రైమాసికాలు బాకీ. మన ప్రభుత్వంలో ప్రతి క్వార్టర్‌కు పిల్లల తల్లుల ఖాతాలో జమ చేశాం. 2024 జనవరి–మార్చి త్రైమాసికం మొదలు.. గత డిసెంబరు వరకు 8 త్రైమాసికాలు. రూ.700 కోట్ల చొప్పున రూ.5,600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. రూ.4,900 కోట్లు బాకీ.
వసతి దీవెన ఏటా రూ.1100 కోట్లు. మొత్తం రూ.2200 కోట్లు బాకీ.
నాడు–నేడు పనులు లేవు. గోరుముద్ద నాణ్యత పడిపోయింది. పిల్లలు చనిపోతున్నారు. టోఫెల్‌ శిక్షణ, ఇంగ్లిష్‌ మీడియమ్, ట్యాబ్‌లు ఆగిపోయాయి.
    మన హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో 43 లక్షల మంది పిల్లలు చదివితే, ఈరోజు ఆ సంఖ్య 33 లక్షలు. అంటే 10 లక్షల మంది పిల్లలు తగ్గారు.
    ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు. రూ.6 వేల కోట్లకు రూ.2 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. రూ.4 వేల కోట్లు బాకీ. దీంతో ఆస్పత్రులు వైద్యం అందించడం లేదు. వైద్యం పడకేసింది. ఇంకా మెడికల్‌ కాలేజీల అమ్మకం దారుణం.
    ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. చివరకు యూరియా కూడా బ్లాక్‌లో కొనాల్సి వస్తోంది. రైతు భరోసా రూ.40 వేలకు బదులు రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. ఆక్వా విద్యుత్‌ సబ్సిడీ రూ.3,620 కోట్లు ఇచ్చాం. ఈరోజు పైసా ఇవ్వడం లేదు. యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50 కే ఇచ్చాం. అలా విద్య, వ్యవసాయం, వైద్య రంగాలు నిర్వీర్యం అయ్యాయి.

ప్రజల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ:
    ఇలాంటి దుర్మార్గమైన పాలన మధ్య మన వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతోంది. మనం ప్రజలకు ఎన్నో చేశాం. మరి ఏమీ చేయని చంద్రబాబును ఈసారి ప్రజలు కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారు. 
    మనం ప్రజల పక్షాన ఇలాగే నిలబడాలి. ఇంకా మూడేళ్లు మాత్రమే ఉంది. అందులో మరో ఏడాదిన్నర గడిస్తే.. నా పాదయాత్ర మొదలవుతుంది. దాదాపు 150 నియోజకవర్గాల్లో నేను పర్యటిస్తాను. అలా ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటాను.« ఆ యాత్రలో ప్రతి మూడో రోజు బహిరంగ సభ నిర్వహిస్తాం. ప్రజా ఉప్పెనను చూపుతూ, ప్రజా సమస్యలు లేవనెత్తుతూ, చంద్రబాబు తప్పుడు పాలనను ప్రజలకు వివరిస్తాం. వాటిని ఎండగడతాం. 

ప్రతి ఇంటా చర్చ జరగాలి. మీరు చొరవ చూపాలి:
    ఇప్పుడు మీరంతా కలిసికట్టుగా ఉండాలి. పోరాడాలి.

చంద్రబాబు దారుణ పాలనపై ప్రతి ఇంట్లో జరిగేలా చొరవ చూపాలి. మన పాలన, ఈ పాలన మధ్య తేడాను స్పష్టంగా ప్రజలకు వివరించాలి. వాటిపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ఆ దిశలో మీరంతా కలసికట్టుగా ఉండి కృషి చేయాలి. అదే విధంగా పార్టీ అనుబంధ విభాగాలన్నీ స్ట్రీమ్‌లైన్‌ చేయాలి. అన్నీ వ్యవస్థీకృతం కావాలి. చంద్రబాబు అన్యాయ పాలనను ప్రజల్లో బలంగా ఎండగట్టాలి. ఆ దిశలో మీరు చొరవ చూపాలి. అందరూ కలిసి పని చేయాలి.

కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం:
    జగన్‌ 2.0 లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. అదీ నా హామీ. క్రితంసారి, కోవిడ్‌ వల్ల పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చింది. 
జగన్‌ 2.0 లో కార్యకర్తలు టాప్‌ ప్రయారిటీ. వారి ద్వారానే మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీ ద్వారానే చంద్రబాబు అన్యాయ, దారుణ పాలన ప్రజల్లో ఎండగడతాం.
    ప్రజలకు మంచి చేయాలన్న తపనతో ఎలా పని చేస్తారు? చిత్తశుద్దితో కూడిన మంచి పాలన అంటే ఎలా ఉంటుంది? అనేది మనం చూపిస్తే.. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం ఎలా అన్నదానికి చంద్రబాబు పాలన ఉదాహరణ అని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.
    భీమవరం నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్‌ చినమిల్లి వెంకటరాయుడుతో పాటు, పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు.