ఇళ్ల కూల్చివేతపై వైయస్ జగన్ ఫైర్
తాడేపల్లి: పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వెల్లటూరులో వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులన్న నెపంతో దుర్మార్గంగా ఇళ్లను కూల్చివేయడం పట్ల వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తమగోడును విన్నవించుకున్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వెంట వెళ్లి జననేతకు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. కూటమి నాయకుల ఆదేశాలతో నిరుపేదలమన్న కనికరం కూడా లేకుండా అధికారులు ఉన్నపళంగా ఇళ్లను కూల్చివేశారని వాపోయారు. బాధితులకు వైయస్ఆర్‌సీపీ అండగా నిలుస్తుందని మాజీ సీఎం వైయస్ జగన్ భరోసానిచ్చారు. వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ ద్వారా న్యాయపోరాటానికి అవసరమైన సహాయం అందజేస్తామని తెలిపారని బాధితులు మీడియాకు తెలిపారు. తమ సమస్యను జగనన్న వరకు తీసుకెళ్లిన బొల్లా బ్రహ్మనాయుడికి ధన్యవాదాలు తెలిపారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన బాధితులలో గంగబోయిన వెంకటనారాయణ, కంభంపాటి జీవన్ ఉన్నారు.