బీహార్‌లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదం బాధాకరం
తాడేపల్లి : బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న యాత్రికుల బస్సు రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు భక్తులు మృతిచెందిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా నుంచి ఉత్తర భారతదేశ యాత్రకు బయల్దేరిన భక్తులు ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.
ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన 15 మంది యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రమాద బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు.