ఐదుగురు వైద్య విద్యార్ధుల మృతిపై వైయస్ జగన్ తీవ్ర విచారం
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ముంబయి జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్‌బంకు వద్దకు రాగానే అదుపుతప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరులో చికిత్స పొందుతూ ఐదుగురు వైద్య విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు వైద్య విద్యార్ధులు, మరొకరు మృత్యువాత పడటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.