మొద‌లైన వైయ‌స్‌ జ‌గ‌న్ పుట్టినరోజు వేడుకలు 

20 Dec, 2025 15:12 IST

తాడేపల్లి :  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుక‌లు ఒక రోజు ముందుగానే ప్రారంభ‌మ‌య్యాయి. శ‌నివారం ప‌లు చోట్ల‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు.. వైయ‌స్‌ జగన్ ముంద‌స్తు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. తాజాగా కుంచనపల్లిలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ క‌ట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడారు.

జ‌నం వైయ‌స్ జ‌గ‌న్ వెంటే..
‘‘అధికారంలో ఉన్నా లేకపోయినా జనం వైయ‌స్ జగన్ వెంటే. ప్రజలకు మేలు చేసేది జగన్ ఒక్కడే. కోట్లాది మంది జగన్‌పై ఆ నమ్మకం పెట్టుకున్నారు. అందుకే తన ఐదేళ్ల పాలనలో అందరికీ మేలు చేశారు. ఎంతవరకు మేలు చేయాలో అంతవరకు చేశారు. రాజకీయాల్లో ఐదేళ్లు అనేది ఎక్కువేం కాదు. ఏదో ఆశించి వైయ‌స్ జగన్ సహాయం చేయరు. తన వలన ఎంత మేరకు మేలు చేయాలా అనే నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. ఓదార్పు యాత్ర సమయంలో కూడా ఆయన ఎంతో సహాయం చేశారు. తన తండ్రి కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఆయన యాత్ర చేశారు.   చాలా గొప్పగా సహాయం చేసినా ఆ విషయం బయటకు చెప్పుకోలేదు. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్. కరోనా‌ సమయంలో కూడా క్వారంటైన్ సెంటర్ లో మంచి భోజనం పెట్టాలనీ, మంచి వైద్యం చేయించాలని తపన పడ్డారు. ప్రతి ఒక్కరినీ వైయ‌స్ జగన్ తన కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కాలనీలే సృష్టించారు. 17 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, పోర్టులు, హార్బర్ లు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినా పబ్లిసిటీ చేసుకోలేదు. చంద్రబాబు 18 నెలల్లోనే రూ.2.70 లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ జనాలకు చంద్రబాబు చేసిన మేలు ఏదీ లేదు. జగన్ మాత్రం తన ఐదేళ్ల పాలనలోనే ఆర్ధికవేత్తలు సైతం ఆశ్చర్యపోయేలా పాలన చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనేది కూడా ఆయన ఈపాటికే ప్లానింగ్‌ వేసుకున్నారు’’ అని సజ్జల అన్నారు. 
 అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ప్రజల్లో రియలైజేషన్ మొదలైంది. చంద్రబాబు మాయ మాటలు నమ్మినందుకు ప్రజలే బాధ‌పడుతున్నారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నందుకు జనం ఆవేదన పడుతున్నారు. మళ్ళీ వచ్చేది జగన్ ప్రభుత్వమే. మంచి రోజులు త్వరలోనే వస్తాయి’ అని అన్నారు. 

YS Jagan Birthday Celebrations In AP

శ్రీకాళహస్తి..

శ్రీకాళహస్తి లో వైయ‌స్ జగన్ పుట్టినరోజు వేడుకలు శ‌నివారం ఘ‌నంగా నిర్వ‌హించారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో  పార్టీ కార్యాల‌యం నుంచి రామసేతు బ్రిడ్జ్‌ మీదుగా నెహ్రు వీధిలో ఉన్న వైయ‌స్ఆర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వ‌హించారు. వైయ‌స్  జగన్ పుట్టిన రోజు సందర్భంగా హెల్మెట్లు పంపిణి, కళాకారులకు డప్పులు వాయిద్యాలు మ‌ధుసూద‌న్‌రెడ్డి పంపిణీ చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో చురుగ్గా ఏర్పాట్లు

వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. పార్టీ కార్యాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు, జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో శోభాయమానంగా మారుస్తున్నారు. వైయస్‌ జగన్‌ సేవా కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరాలు, పేదలకు అన్నదానం, మొక్కల నాటకం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నారు. శాంతిభద్రతల పరంగా కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వైయస్‌ జగన్‌ పుట్టిన రోజును ప్రజా సేవా దినంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు సంకల్పించాయి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న వైయస్‌ జగన్‌ రాజకీయ ప్రస్థానానికి ఇది మరో గుర్తింపు అని పార్టీ నేతలు పేర్కొన్నారు.