అసెంబ్లీ సమావేశాలకు వైయ‌స్ జగన్ హాజరు

10 Feb, 2026 19:11 IST

తాడేపల్లి: రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రదర్శన రాజకీయాల్లో నిమగ్నమై ఉన్నారని విమర్శించారు. ప్రజలు అర్ధాకలితో జీవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్ర పాలనను పూర్తిగా గాలికి వదిలేశారని అన్నారు.

తిరుమల లడ్డూ వివాదంపై స్పందిస్తూ, లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసిన తర్వాత కూడా అదే అంశంపై చర్చించడం సమయ వ్యర్థమని పేర్కొన్నారు. సిట్ నివేదిక వచ్చిన తర్వాత కూడా మరో కమిషన్ ఏర్పాటు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఆ కమిషన్‌కు చట్టబద్ధత ఉందా అనే అంశాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సిట్ నివేదికను ప్రజల ముందుకు తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఎల్లుండి వైయ‌స్ఆర్‌సీపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అసెంబ్లీ వ్యూహంపై ఆ సమావేశంలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.