అండ‌గా ఉంటాం..అధైర్య‌ప‌డొద్దు

7 Apr, 2026 15:25 IST

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత శ్రీ వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి గారిని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ తన తల్లిదండ్రులతో కలిసి కలిశారు. ఈ సందర్భంగా తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఆమె వివరించారు. తన తండ్రిపై తప్పుడు నేరం మోపినందుకు ప్రశ్నించ‌గా పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్‌లు తనను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి దారుణంగా కొట్టారని సుప్రియ పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ గ్రీవియెన్స్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, అదే పోలీసులు తనపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తరువాత బెయిల్‌పై విడుదలైనట్లు తెలిపారు.

స్థానిక టీడీపీ నేత గణేష్ ప్రభావంతోనే తమ కుటుంబంపై పోలీసులు ఇలా వ్యవహరించారని సుప్రియ ఆరోపించారు. వైయ‌స్ఆర్‌సీపీకి మద్దతుగా పనిచేస్తున్నామనే కారణంతో తన బాబాయి యాకోబు ఇంటిని తగలబెట్టించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై కక్ష సాధింపులు జరుగుతున్నాయని కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ ఘటనపై స్పందించిన వైయ‌స్ జగన్, బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు. సుప్రియకు అవసరమైన న్యాయ సహాయంవైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ అందిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే ఈ ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. పామర్రు సీఐ, ఎస్సైపై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చిన వైయ‌స్ జగన్, సుప్రియ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుప్రియ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.