మా పార్టీ నాయకుడి మృతిపై ఎల్లోమీడియా అసత్య ప్రచారం

6 Feb, 2026 17:35 IST


విజయవాడ : వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన నాయకుడు డి. రాంబాబు మృతిపై ఎల్లోమీడియా అసత్య ప్రచారం చేస్తోందని జగ్గయ్యపేట అసెంబ్లీ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఘటనను వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ, చిల్లకల్లు గ్రామానికి చెందిన డి. రాంబాబు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు తన గ్రామస్తులతో కలిసి ఇబ్రహీంపట్నానికి వచ్చారని తెలిపారు. మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అకస్మాత్తుగా కుప్పకూలిపోయారని చెప్పారు. ఆ సమయంలో రాంబాబు మేనల్లుడు కూడా అక్కడే ఉన్నాడని పేర్కొన్నారు. అక్కడున్న వారు వెంటనే సీపీఆర్ నిర్వహించి, గొల్లపూడిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినప్పటికీ, ఆస్పత్రికి చేరుకునేలోపే రాంబాబు మరణించారని వైద్యులు వెల్లడించారని నాగేశ్వరరావు తెలిపారు. రాంబాబు చాలా కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. అయితే ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రాంబాబు మరణాన్ని వైయ‌స్ జగన్ పర్యటనతో అనుసంధానించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాంబాబు అనారోగ్యానికి గురైన సమయంలో వైయ‌స్ జగన్ ఇంకా వెస్ట్ బైపాస్ ప్రారంభ ప్రాంతంలోనే ఉన్నారని, అప్పటికి ప్రజలు పూర్తిగా ఇబ్రహీంపట్నానికి చేరుకోలేదని స్పష్టం చేశారు. తొక్కిసలాటలో రాంబాబు మరణించినట్టు ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని నాగేశ్వరరావు మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పోలీసు అధికారులు కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల కోసం ఇలాంటి సంఘటనలను వాడుకోవడం దురదృష్టకరమని, రాష్ట్రంలో రాజకీయాలు ప్రమాదకరంగా దిగజారిపోతున్నాయని తన్నీరు నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.