మహిళల సహనాన్ని పరీక్షిస్తున్న కూటమి ప్రభుత్వం
విజయవాడ: ఎన్నికల హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ మహిళల సహనాన్ని పరీక్షిస్తోందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, డిప్యూటీ మేయర్ అవుతు శైలజా రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి శ్యామల కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మహిళ సూర్యుడు వంటిదని, ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చేది మనమే అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు పోరాటానికి వస్తే ఝాన్సీ లక్ష్మీభాయిలా మారుతారని హెచ్చరించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో మహిళలకు పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేశారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయకుండా తూట్లు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 33 రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.