మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌ హత్యకు పక్కా స్కెచ్ 

9 Jul, 2025 08:29 IST

నెల్లూరు: మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక ప్రకారమే టీడీపీ మూకలు బరి తెగించాయి. దాడి దృశ్యాలు, వ్యూహాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. నెల్లూరు నగరం నడిబొడ్డున గల నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి సోమవారం రాత్రి మారణాయుధాలతో టీడీపీ మూకలు, రౌడీలు, పాత నేరస్తులు అక్రమంగా ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. 

తొలుత సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ప్రసన్నకుమార్‌రెడ్డిని చంపేస్తామని కేకలు వేస్తూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియోలు దాడి ఎంత భయంకరంగా జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాలతో ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లిన టీడీపీ మూకలు, రౌడీలు ఆయన ఇంట్లో లేకపోవడంతో ధ్వంసరచనకు పాల్పడ్డారు.  

అంతా కుట్ర ప్రకారమే 
ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి సమీపంలోపి బారాషహీద్‌ దర్గా వద్ద రొట్టెల పండగ జరుగుతోంది. జనసందోహం భారీగా ఉండటంతో ఆ సమయంలో తాము ఏం చేసినా ఎవరూ గుర్తు పట్టే అవకాశం ఉండదని భావించిన టీడీపీ గూండాలు వాహనాల్లో పెద్దఎత్తున సుజాతమ్మ కాలనీకి చేరుకున్నారు. వాహనాలను దూరంగా పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వచ్చారు. ఆయన ఇంట్లో లేరనే విషయం తెలిసి బీభత్సం సృష్టించారు. తొలుత దుండగులు ఇంటి ప్రధాన ద్వారంతోపాటు వెనుక వైపు ద్వారాల నుంచి లోపలికి ప్రవేశించారు. కొందరు ఇంట్లోకి ప్రవేశించగా.. మిగిలిన వారు ఇంట్లోని వారిని బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.

దీనిని బట్టి చూస్తే ప్రసన్నకుమార్‌రెడ్డిని హతమార్చేందుకు పక్కా స్కెచ్‌ వేసినట్టు స్పష్టమవుతోంది. దాడి ఘటనపై ప్రసన్నకుమార్‌రెడ్డి సోమవారం అర్ధరాత్రి అనుమానితుల పేర్లు ఉటంకిస్తూ.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి తనను హత్య చేయించేందుకు పథకం పన్నారని ఫిర్యాదు చేశారు. అనుమానితుల పేర్లు కూడా పోలీసులకు ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని.. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. 

పోలీసులొచ్చినా బెదరని మూకలు 
ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న దర్గామిట్ట పోలీసులతోపాటు స్పెషల్‌ పార్టీ పోలీసులు పదుల సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిబయట ఉన్న దుండగులు పరుగులు తీయగా.. ఇంట్లో విధ్వంసం చేస్తున్న రౌడీమూకలు ఏ మాత్రం బెదరలేదు. దాడి పూర్తయ్యాక తాపీగా నడుచుకుంటూ బయటకు వెళ్లారు. పోలీసులు వారిని పట్టుకునే అవకాశం ఉన్నా.. ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. దాడిని ఆపేందుకు అవకాశం ఉన్నా ఆ పని కూడా చేయలేదు. పోలీసులు అక్కడే ఉన్నా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాల మేరకే దాడి పూర్తయ్యే వరకూ కిమ్మనకుండా ఉండిపోయారు. 


ఘటనను తప్పుదోవ పట్టించేందుకు మరో కుట్ర 
దాడి ఘటనను టీడీపీ నేతలు తప్పుదోవ పట్టించే కుట్రకు తెరలేపారు. ఆయన ఇంటిపై మహిళలు దాడి చేశారని, అభిమానులు దాడులు చేశారని, వారే దాడి చేసుకుని ఉండొచ్చనే ప్రచారానికి టీడీపీ నేతలు తెరతీశారు. తద్వారా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి.. అసలు వాస్తవాన్ని పక్క­దారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికులు కొందరు దాడి దృశ్యాలను వీడియోలు తీసి.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేయడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ పోలీసులు మాత్రం తమకేమీ తెలియదన్నట్టు, ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై అసలు దాడే జరగలేదు అన్నట్టు ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు.  

ప్రసన్నకుమార్‌ హత్యకు టీడీపీ భారీ కుట్ర : మాజీ మంత్రి అనిల్‌కుమార్‌
 మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని హత్య చేసేందుకు టీడీపీ రౌడీమూకలు భారీ కుట్ర పన్ని మారణాయుధాలతో ఆయన ఇంట్లోకి రాత్రివేళ చొరబడ్డారని మాజీ మంత్రి కె.అనిల్‌కుమార్‌ యా­­దవ్‌ అన్నారు. ఆ సమయంలో ప్రసన్నకుమార్‌రె­డ్డి ఇంట్లో లేకపోవడంతో రెచ్చిపోయిన టీడీపీ మూ­కలు జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా బీభత్సం సృష్టించారన్నారు. సోమవారం రాత్రి ప్రసన్నకుమార్‌ ఇంటిపై జరిగిన దాడిపై ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన మాజీమంత్రులు అనిల్, ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేత వీరి చలపతిరావు ఏఎస్పీ సౌజన్యకు ఫిర్యాదు అందజేశారు. 

అనంతరం మీడియాతో అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు కనీ­వినీ ఎరుగని రీతిలో పచ్చమూకలు దారుణ ఘటనకు శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన నల్లపరెడ్డి కుటుంబంపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. టీడీపీ మూకలు వెళ్లిన సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి షాక్‌కు గుర­య్యా­రని.. ఆమెకు జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిది బాధ్య­త అని నిలదీశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, దాడికి పాల్పడిన వారి అనుచరులపై హత్యాయత్నం కేసు నమో­దు చేయాలని డిమాండ్‌ చేశారు. 


ఈ ఘటనపై ఎవరి ప్రోద్బలం ఉందో, ఎవరు పంపించారో అందరికీ తెలు­సన్నారు. ప్రనన్నకుమార్‌ ద్వారా ఇంకేమి నిజా­లు బయటకు వస్తాయోనని భయపడి ఈ దుశ్చ­ర్యకు పాల్పడ్డారన్నారు. డబ్బుందన్న మదంతో డాన్‌­లు కావాలని ఇలాంటి ఆగడాలు చేస్తున్నార­న్నారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసుల తీరుకు అద్దం పడుతోందని దుయ్యబట్టారు. ఘ­ట­న జరుగుతున్న సమయంలో పోలీసులు పక్క­నే ఉన్నా ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

నిజమే చెప్పాను.. వెనక్కి తగ్గను: ప్రసన్నకుమార్‌రెడ్డి 
మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడు­తూ.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురించి అంతా నిజమే చెప్పానని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఏడాది కాలంలో ఇప్పటివరకు ఆమె చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఆమె తనపై వ్యక్తిగత విమర్శ చేయడంతోనే నిజాన్ని ప్రజల ముందుంచానని చెప్పారు. మహిళలంటే తమకెంతో గౌరవం ఉందని, ఆమె తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే తాను ఆమె గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పానన్నారు. గంజాయి మత్తులో దాడి చేసిన వారిని, ఈ దాడులకు పురిగొల్పిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌   డిమాండ్‌ చేశారు.