కేరళలో ప‌ర్య‌టించిన‌ విజ‌య‌న‌గ‌రం జెడ్పీ బృందం 

16 Jun, 2026 12:36 IST

కేరళ : ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆధ్వర్యంలో జిల్లా జడ్పీటీసీ సభ్యుల బృందం కేరళ పర్యటనలో భాగంగా అలప్పుజా జిల్లాలోని కంజికుజి గ్రామ పంచాయతీని సందర్శించింది.  ఈ సందర్భంగా స్థానిక సంస్థల బలోపేతం, గ్రామ పంచాయతీల పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు విధానాలను జడ్పీటీసీ సభ్యులు అధ్యయనం చేశారు. కంజికుజి గ్రామ పంచాయతీ సర్పంచ్ సంతోష్ కుమార్, వైస్ సర్పంచ్ తిలకన్, వార్డు సభ్యులు, డెవలప్‌మెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అశ్విన్, వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కె.వి. విజిమోల్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ మురళీధరన్, పంచాయతీ కార్యదర్శి డి.ఎఫ్. సుభాష్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు బృందానికి ఘన స్వాగతం పలికారు.

కేరళలో గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు అమలు చేస్తున్న విధానాలు, స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంపై పంచాయతీ ప్రతినిధులు వివరించారు. అనంతరం జడ్పీటీసీ సభ్యులు పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.

ఈ పర్యటన ద్వారా స్థానిక పాలనలో అనుసరిస్తున్న అనేక ఉత్తమ పద్ధతులను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించిందని జడ్పీటీసీ సభ్యులు తెలిపారు. కేరళలో విజయవంతంగా అమలవుతున్న నమూనాలను అధ్యయనం చేసి తమ ప్రాంతాల్లో కూడా స్థానిక సంస్థలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆతిథ్యం అందించిన కంజికుజి గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి చిన్న శ్రీను, జడ్పీటీసీ సభ్యుల బృందం కృతజ్ఞతలు తెలియజేసింది.