బాధ్యతలు చేపట్టిన మంత్రులు
అమరావతి : ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న వేణుగోపాల్ బీసీ మంత్రిగా, గతంలో బీసీ మంత్రిగా ఉన్న శంకర్‌నారాయణ రోడ్డు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం తమ ఛాంబర్లలో ప్రత్యేక పూజల అనంతరం వీరు బాధ్యతలు చేపట్టారు. కాగా, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా సీదిరి అప్పలరాజు ఇదివరకే బాధ్యతలు చేపట్టారు. అలాగే డిప్యూటీ సీఎంగా పదోన్నతి పొందిన ధర్మాన కృష్ణదాస్ కూడా బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. బాధ్యతలు చేపట్టిన మంత్రులు..తమపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంతఃకరణ శుద్ధితో విధులు నిర్వర్తించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తామని పేర్కొన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు వేణుగోపాల్, శంకర్ నారాయణలను పలువురు అభినందించారు.