చంద్రబాబు, పవన్ వాళ్ల పార్టీకి వాళ్లే సమాధి
ఎన్టీఆర్ జిల్లా : తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాఖ్యలతోనే వాళ్లు తమ పార్టీలకు తామే సమాధి కట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఈ ఇద్దరూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని వేంకటేశ్వరస్వామి కూడా క్షమించడని రోజా అన్నారు.
ఇబ్రహీంపట్నంలో టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని ఆర్కే రోజా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైయస్ఆర్‌సీపీ నేతలు శుక్రవారం పరిశీలించారు. అనంతరం జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.
మాజీ మంత్రి ఇంటిపైనే దాడులకు పాల్పడటం రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూపిస్తోందని రోజా విమర్శించారు. ‘‘మాజీ మంత్రి ఇంటిపైనే దాడి చేస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయి’’ అని ఆమె ఆరోపించారు.
వైయస్ జగన్ పర్యటనకు ప్రజలు భారీగా తరలివస్తుండటాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోందని రోజా అన్నారు. జగన్ పర్యటనకు జనం రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే ప్రజలు జగన్ వెంటే ఉన్నారనే విషయాన్ని పాలకులు గుర్తించాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు.