చీకటి గోపీ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

18 Sep, 2026 12:43 IST

 గుంటూరు: తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపీ మృతి ఘటనపై సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరిపి నిజానిజాలను వెలికితీయాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ గోపీ మృతి ఘటనకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు, పోలీసుల వేధింపులు, చిత్రహింసలకు సంబంధించిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనలో తాడికొండ సీఐ ఉమేష్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బంది పాత్రపై చట్టపరంగా విచారణ జరపాలని తెలిపారు. దర్యాప్తులో ఆరోపణలు రుజువైతే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వనమా బాల వజ్రబాబు కోరారు. ఘటనపై సమగ్ర విచారణ పూర్తయ్యే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.