అస్వస్థతకు గురైన విద్యార్థినులకు ఉషాశ్రీ చరణ్ పరామర్శ
శ్రీ సత్యసాయి జిల్లా: మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కస్తూర్బా బాలికల వసతి గృహంలో శుక్రవారం జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్ పరామర్శించారు. కలుషిత ఆహారం తినడం వల్ల 20 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆసుపత్రికి తరలించకుండా వసతి గృహంలోనే అరకొర చికిత్స అందించడం, అధికారులు విద్యార్థినులను నేలపై పడుకోబెట్టి సెలైన్ బాటిళ్లు ఎక్కించడంతో మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం వసతి గృహాల్లో ఆహార సురక్షిత ప్రమాణాలపై శ్రద్ధ చూపడం లేదని ఆమె మండిపడ్డారు. కాగా, మంత్రి సవిత పరామర్శకు వస్తున్నారంటూ పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్కడ ఉన్న వైయస్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ శ్రేణులు దౌర్జన్యం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడికి యత్నించి, ఓ విలేకరి సెల్ ఫోన్ పగులగొట్టారు. ఈ ఘటనపై మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ మండిపడ్డారు.