చంద్రబాబు అరాచక పాలనపై వైయస్ఆర్‌సీపీ పోరుబాట
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ వైయస్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్, బుక్‌లెట్‌ను పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను నిరాశపరిచిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలు, పరిపాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు.
ఈ నెల 4వ తేదీన రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం జూన్ 8, 9 తేదీల్లో టౌన్ హాళ్లలో చర్చా వేదికలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పనితీరుపై ప్రజలతో విస్తృతంగా చర్చించనున్నట్లు చెప్పారు.
అలాగే జూన్ 12న రాష్ట్రంలోని 175 నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్తామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని సజ్జల స్పష్టం చేశారు.