రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం
విశాఖ: రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సమాఖ్య స్ఫూర్తితో ఏపీకి అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. రెండో రోజు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఐఎస్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిష్టాత్మకంగా భావించి జీఐఎస్‌ను నిర్వహిస్తున్నారని సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. ఏపీకి పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు, నైపుణ్యం గల మానవ వనరులు ఏపీ సొంతమన్నారు. పలు కీలక రంగాల్లో కనెక్టివిటి పెరిగిందని చెప్పారు. ప్రతిభ గల యువత ఏపీలో ఉందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక ప్రగతిలో ఇండియా కీలకమని ఐఎంఎఫ్ ప్రకటించిందన్నారు. దేశంలో అంతర్జాతీయ రహదారులు నిర్మిస్తున్నామని చెప్పారు. నూతన భారత నిర్మాణం వేగంగా జరుగుతుందని తెలిపారు. 2025 నాటికి ఇండియాలో 250 యూనికార్న్ సంస్థలు ఉంటాయని పేర్కొన్నారు. ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయన్నారు.