వైయస్‌ఆర్‌సీపీ విశాఖ ఎంపీ తొలి విజయం
విశాఖ: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ శ్రమకు ఫలితం దక్కింది. ఉదయ్ డబుల్ డెక్కర్ విశాఖకు రప్పించి ఎంవీవీ తొలి విజయం సాధించారు. విశాఖ –విజయవాడ మధ్య నానాటికీ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు అవసరం ఉందని పట్టుబట్టి మరీ సాధించారు. రైల్వే శాఖ మంత్రి సురేష్ చెన్నబసప్పను కలిసి డబుల్ డెక్కర్ రైలు ఆవశ్యకతను వివరించారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి డబుల్ డెక్కర్ రైలు నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉదయ్ ఇవాళ పట్టాలెక్కింది. ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు పట్టాలెక్కింది. విశాఖ నుంచి విజయవాడకు నడిచే డబుల్ డెక్కర్ ఏసీ రైలును.. రైల్వే సహాయ మంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి అధికారికంగా గురువారం ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై రైలుకు పచ్చజెండా ఊపి ఆరంభించారు. గురువారం ఒక రోజు స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌గా ఇది నడుస్తుంది. శుక్రవారం నుంచి రెగ్యులర్ రైలుగా వారానికి ఐదురోజులు (ఆది, గురువారం తప్ప) పరుగులు తీయనుంది. ఎన్నో ప్రత్యేకతలతో ప్రారంభమైన ఉదయ్ రైలుకు విశాఖ నుంచి విజయవాడకు టిక్కెట్ ధర 525 రూపాయిలగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, గొట్టేడి మాధవి, రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.