ఘనంగా ‘ప్రజా సంక్షేమానికి రెండేళ్లు’ వేడుక
తాడేపల్లి: రెండు దశాబ్దాల్లో జరగని అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసి చూపించారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలను మొత్తం తన కుటుంబంలా భావిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ రెండేళ్ల పరిపాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తాడేపల్లిలోని వైయస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ ప్రధాన కార్యదర్శులు సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి నివాళులర్పించారు. సంక్షేమ పాలన రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కేక్‌కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.