సెయింట్ లూయిస్‌లో మహానేతకు ఘన నివాళులు
తాడేపల్లి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకని సెయింట్ లూయిస్‌లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పెద్దాయనను గురించిన అనుభూతులను గుర్తుచేసుకున్నారు. వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివ రెడ్డి , కడపల మోహన్ రెడ్డి వర్చువల్‌గా పాల్గొని, వారి మధురమైన అనుభవాలు, వైయస్ఆర్ జ్ఞాపకాలను పంచుకున్నారు. చికాగో, మెంఫస్, కాన్సాస్ నుండి వైయస్ఆర్ అభిమానులు, వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు తరలివచ్చి, ఈ వేడుకకు వైభవం చేకూర్చారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు కడప రత్నాకర్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో పేదల, రైతుల, రాష్ట్ర అభ్యున్నతి కోసం వైయస్ఆర్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలను, వాటి ద్వారా జరిగిన మేళ్లను గుర్తుచేశారు. వైయస్ఆర్ ప్రజల హృదయాల్లో కలకాలం గుర్తుండిపోయే మహానేత అని కీర్తించారు. మళ్లీ వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందని, ప్రియతమనేత ఆశయాలను, లక్ష్యాలను వైయస్ జగన్ నెరవేర్చుతారని చెప్పారు. సెయింట్ లూయిస్ (Saint Louis) లో జరిగిన వైయస్ఆర్ జయంతి వేడుక విజయవంతమైంది. ఈ సభలో ఎన్నో భావోద్వేగ క్షణాలు, ఎన్నో జ్ఞాపకాలు పంచుకున్నారు. వైయస్ఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మరో విశేషం ఏంటంటే, గతంలో 2007 లో వైయస్ఆర్ సెయింట్ లూయిస్ పర్యటనలో ఇదే కన్వెన్షన్ హాల్ లో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారని గుర్తు చేసుకున్నారు.