విశాఖలో రేపు జరగబోయే గర్జన అందరి కళ్లు తెరిపిస్తుంది
విశాఖ: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న తలపెట్టిన విశాఖ గర్జన అందరి కళ్లు తెరిపిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శుక్రవారం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖను రాజధానిగా వ్యతిరేకించే వాళ్ల కళ్లు తెరిపేలా తమ గర్జన ఉండబోతుందన్నారు. గర్జన తర్వాత ఏ నిమిషంలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవ్వాలన్నదే తమ కోరిక అని మంత్రి బొత్స తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణే కాదు నిధుల విభజన కూడా జరగాలన్నారు. ఉద్యమాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్తామన్నారు. జాతి సంపద అందరికీ చెందాల్సిందేనని స్పష్టం చేశారు.
రాజకీయ కారణాలతో విశాఖను రాజధానిగా వ్యతిరేకించడం అంటే ద్రోహం చేయడమేనని మంత్రి బొత్స అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు విశాఖను రాజధానిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ రాజధానిగా ఎందుకు వద్దో వ్యతిరేకించేవారందరూ చెప్పాలన్నారు. అమరావతికి రాజధాని వచ్చినప్పుడు తాము వ్యతిరేకించలేదని.. మరి విశాఖకు అవకాశం వస్తే ఎందుకు వద్దంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు.