రేపు తాడేపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

21 Jan, 2026 11:21 IST

 తాడేపల్లి: రేపు(జ‌న‌వ‌రి 22) వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలను ఎలా బలంగా లేవనెత్తాలనే అంశాలపై ఎంపీలతో ఆయన విస్తృతంగా చర్చించనున్నారు.

ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంటులో వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఎలా ఉండాలనే దానిపై వైయ‌స్‌ జగన్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అంశం, దాని వల్ల పేదలు–మధ్యతరగతి ప్రజలపై పడే భారాన్ని పార్లమెంటులో ఎలా ప్రస్తావించాలన్న దానిపై ఎంపీలకు సూచనలు ఇవ్వనున్నారు. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేత, నీటి హక్కులు, అభివృద్ధి ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని జాతీయ స్థాయిలో ఎలా వెలుగులోకి తీసుకురావాలన్న అంశంపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా సహా పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఎంపీలు వ్యవహరించాలని వైయ‌స్‌ జగన్ సూచించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశం ద్వారా పార్లమెంటులో వైయ‌స్ఆర్‌సీపీ గళం మరింత బలంగా వినిపించేలా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.