వైయస్ జగన్‌ను కలిసిన పొగాకు రైతులు
తాడేపల్లి : కేంద్ర ప్రభుత్వం వర్జీనియా పొగాకు, సిగరెట్లపై విధించిన అధిక ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్టీ పెంపుతో పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన పొగాకు రైతులు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్‌ను కలిసిన రైతులు, కేంద్రం తీసుకున్న తాజా పన్నుల నిర్ణయాల వల్ల పొగాకుకు డిమాండ్ తీవ్రంగా తగ్గిపోతుందని, దాంతో ధరలు పడిపోవడంతో పాటు కొనుగోళ్లు తగ్గి తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో పొగాకు రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతూ పన్నుల తగ్గింపునకు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
ఈ సమస్యలపై తమ వినతిపత్రాన్ని వైయస్ జగన్‌కు అందజేసిన రైతులు, పొగాకు సాగుపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని వివరించారు. రైతుల ఆవేదనను శ్రద్ధగా విన్న వైయస్ జగన్, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక దుస్ధితిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని వైయస్ఆర్‌సీపీ ఎంపీలు తప్పకుండా లేవనెత్తుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి వైయస్ఆర్‌సీపీ ఇంఛార్జ్ కంభం విజయరాజు, ఎన్‌ఎల్‌ఎస్ వర్జీనియా పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు సత్రం వెంకట్రావు, ఉపాధ్యక్షుడు అట్లూరి సతీష్, సెక్రటరీ సత్యనారాయణ, రైతు నాయకులు సత్తెనపల్లి వీర్రాజు, మచిలీపట్నం పార్లమెంట్ వైయస్ఆర్‌సీపీ పరిశీలకుడు జెట్టి గుర్నాధరావు తదితరులు పాల్గొన్నారు.