జగనన్న మా కుటుంబంలో ధైర్యం నింపారు
విజయవాడ: టీడీపీ నేతలు అంబటి రాంబాబు నివాసంపై చేసిన దాడిపై ఆయన చిన్న కుమార్తె అంబటి శ్రీజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసిన ఆమె, తమ కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ ఇంటికి వచ్చి అండగా నిలిచారని తెలిపారు. తమ తల్లి, అక్కలతో మాట్లాడి ధైర్యం నింపారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు తమ ఇంటిపై రాళ్లతో దాడి చేశారని, అయితే అనంతరం వేలమంది అభిమానులు తమ ఇంటికి వచ్చి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు.
తమ తండ్రి ఎప్పుడూ చెప్పినట్లే వెంకటేశ్వరస్వామి తమకు అండగా ఉన్నారని, దేవుడి ఆశీస్సులు ఉన్నంతవరకు తమపై వేసే ప్రతి రాయి పువ్వుగా మారుతుందని శ్రీజ అన్నారు. తమ ఇంటిపై అత్యంత దారుణంగా దాడి జరిగిందని, దాదాపు తొమ్మిది గంటల పాటు పెద్ద ఎత్తున జనాలు దాడికి దిగారని ఆరోపించారు.
ఉదయం గుడికి వెళ్లిన సమయంలోనే తమ తండ్రిపై టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారని, మహిళలు కూడా అసభ్య పదజాలంతో దూషించారని ఆమె పేర్కొన్నారు. ఆ సమయంలో జరిగిన ఘటనల నేపథ్యంలో తమ తండ్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన తరువాత ఆలోచించి ఆ మాట అనకూడదని చెప్పారని, లీగల్‌గా ఎదుర్కొంటానని ప్రకటించారని తెలిపారు. అయితే తమ ఇంట్లో ఉన్న మహిళలను కూడా దారుణంగా దూషిస్తూ దాడి చేశారని, కాపు సమాజాన్ని అవమానించేలా టీడీపీ శ్రేణులు వ్యాఖ్యలు చేశారని శ్రీజ ఆరోపించారు. ఒక డాక్టర్ అయిన కేంద్ర సహాయ మంత్రి ఈ ఘటనలకు ప్రోత్సాహం ఇవ్వడం బాధాకరమని, ఆయన మేధస్సు సరైన మార్గంలో నడిపించలేదేమో అనిపిస్తోందని విమర్శించారు.
అంబటి రాంబాబును నాలుగు గోడల మధ్య భౌతికంగా వేధించడం అమానుషమని, ఆయనను వేధించి రాక్షసానందం పొందారని శ్రీజ అన్నారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని గుర్తుంచుకోవాలని, జరిగిన దాడికంటే నాలుగు రెట్లు ఎక్కువ మంది అభిమానులు తమ కుటుంబానికి అండగా నిలిచారని ఆమె పేర్కొన్నారు.