వైయస్ఆర్ సీపీకి ఓటేశారని వేధింపులు
గుంటూరు: కారంపూడి మండలంలోని చింతపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో వైయస్ఆర్ సీపీ సానుభూతిపరులైన మహిళలపై అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాధిత మహిళలు లంకా జానమేరి, లంకా రత్నకుమారి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ఎస్సీ కాలనీ ఒకటో లైనులో మహిళలు మంచినీటి కుళాయి నీటిని పైపువేసి పట్టుకుంటుండగా, టీడీపీకి చెందిన లంకా యాకోబు వచ్చి దుర్భాషలాడాడు. బోరు తమ పార్టీ వాళ్లు వేయించారు... నీళ్లు పట్టుకోడానికి వీల్లేదని తిట్ల దండకం అందుకున్నాడు. గత 20 రోజులుగా యాకోబు ఇదే విధంగా ప్రవరిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని లంకా జానమేరి, లంకా రత్నకుమారి పోలీసుల్ని ఆశ్రయించారు. వైయస్ఆర్ సీపీకి ఓటేశామని తమని వేధిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని ఎస్‌ఐ మురళీని కోరారు. అక్కడ పార్టీల ప్రస్తావన ఏమీ లేదని, పైపులు వేసి పట్టుకోవడం వల్లే వివాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఇరువైపుల వారికి కౌన్సెలింగ్ ఇస్తానని ఎస్‌ఐ తెలిపారు.