వైయస్ఆర్‌సీపీ కార్యకర్తపై టీడీపీ నేత దాడి
పల్నాడు జిల్లా: మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త మందా సాల్మన్‌పై టీడీపీకి చెందిన మోటమర్రి పేతురు దాడి చేయడంతో ఆయనకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సాల్మన్‌ను వెంటనే పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో టీడీపీ నేతల ఆగడాలు అధికమయ్యాయి. ఈ క్రమంలో వైయస్ఆర్‌సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సాల్మన్‌పై దాడికి పాల్పడినట్లు సమాచారం. పచ్చమూకల దాడిలో సాల్మన్ తీవ్రంగా గాయపడటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుని సాల్మన్‌ను పరామర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులు, బెదిరింపులు పెరిగిపోయాయని పార్టీ నేతలు ఆరోపించారు. పోలీసుల తీరుపై కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దాడికి పాల్పడిన వ్యక్తిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని, బాధితుడికి పూర్తి రక్షణ కల్పించాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజకీయ కక్షసాధింపులతో దాడులు జరుగుతున్నాయన్నారు.