స్వార్థమే తప్ప..రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా..?
విజయవాడ:రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి స్వార్థం కోసం చంద్రబాబు జాతీయ రాజకీయాలు చేస్తున్నారని వైయస్ఆర్సీపీ నేత పార్థసారధి మండిపడ్డారు. విజయవాడలోని వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ,ఈడి,ఐటిని వాడుకుని ప్రత్యర్థుల మీద కక్ష తీసుకుంటుందని మాట్లాడే చంద్రబాబు..ఏపీకి జరిగిన అన్యాయం,పార్లమెంటు సాక్షిగా విభజన హామీలపై ఒక మాట కూడా మాట్లాడలేని పిరికిపంద అని ధ్వజమెత్తారు. దోపిడీ,అవినీతి,ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోడానికే అన్ని రాజకీయ పక్షాల కాళ్లు పట్టుకుని తిరుగుతూ రాష్ట్ర ప్రయోజనాలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడంలేదని రాష్ట్ర ప్రజలు గ్రహించాలన్నారు.
ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చల్లో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని వైయస్ఆర్సీపీ స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు.జగన్–కేటీఆర్ భేటీపై టీడీపీ నానాయాగీ చేస్తోందని.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వైయస్ జగన్ స్పష్టంగా చెప్పారన్నారు. జాతీయస్థాయిలో ఎంతోమందిని కలిసిన చంద్రబాబు ఒకసారైన రాష్ట్ర ప్రయోజనాలు గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. జననేత జగన్‌కు, చంద్రబాబుకు తేడా గమనించాలన్నారు. లోటస్‌పాండ్‌లో వైయస్ జగన్ దాకున్నారంటూ టీడీపీ మంత్రి వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఏపీలో 135 నియోజకవర్గాలకు పాదయాత్రతో పర్యటించిన నాయకుడు వైయస్ జగన్ మాత్రమే అని అన్నారు. సుమారు పదమూడు నెలలు పాదయాత్ర చేస్తూ టీడీపీ ప్రభుత్వం దోపిడీ, అన్యాయం, రాష్ట్ర ప్రయోజనాలను హక్కులను ఎలా తాకట్టు పెట్టరో వైయస్ జగన్ ప్రతి రోజు మాట్లాడుతూనే ఉన్నారని తెలిపారు. ఇవన్నీ మంత్రులకు వినపడలేదా..కనబడలేదా అని ప్రశ్నించారు.
వైయస్ జగన్,కేటీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చిస్తే ఫిడేల్ ఫ్రంట్ అని టీడీపీ నేతలు విమర్శించారని, చంద్రబాబు కలకత్తాలో చేసింది తోడేలు ఫ్రంటా అని ఎద్దేవా చేశారు. కలకత్తాలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలు గురించి ఎందుకు మాట్లాడకపోయారో సమాధానం చెప్పాలన్నారు. సొంత జాగీరులాగా మూడు గిప్ట్‌లు కేసీఆర్‌కు ఇస్తానంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని, చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన గిప్ట్‌లు చాలా ఉన్నాయి.వాటి గురించి ఆలోచించాలన్నారు.ఫెథాయ్ తుపాను బాధితులకు ఇప్పటివరుకూ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. తడిసిన ధాన్యాన్ని రైతులు అయినకాడికి అమ్ముకోవలసివస్తోందని..కాని ప్రభుత్వంలో స్పందనలేదన్నారు. ఈ విషయంలో కనీసం ప్రజలకు భరోసా కూడా కల్పించని బాబు పొరుగు రాష్ట్రానికి గిప్ట్ ఇస్తానంటూ చెబుతారని విమర్శించారు.
ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు మళ్లీ కుతంత్రాలు మొదలుపెట్టారన్నారు. 2018–19 బడ్జెట్లో కనీస కేటాయింపులు చేయకుండా ఎన్నికలకు రెండునెలలకు ముందు రెండువేల రూపాయలు పింఛను ఇస్తున్నాం అని చంద్రబాబు సిగ్గులేకుండా ప్రకటించారని దుయ్యబట్టారు.ఈ నాలుగున్నరేళ్లలో పింఛనును పెంచాలనే ఉద్దేశ్యం ఉందని చంద్రబాబు కాని, మంత్రులు కాని ఒక మాట కూడా మాట్లాడలేదన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామంటే చంద్రబాబు కూడా ఇస్తామంటున్నారన్నారు.
రెండు సంవత్సరాల క్రితం వైయస్ జగన్ ప్రజలకు మేలుచేసేవిధంగా నవరత్నాలను ప్రకటిస్తే రెండు సంవత్సరాల తర్వాత కళ్లు తెరిచిన చంద్రబాబు మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఉన్న పథకాలను గాలికొదిలేసి ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. రెండున్నర లక్షల ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు లక్షలకు పెంచుతానంటూ చంద్రబాబు చెబుతున్నారని.. ఇంతకంటే మోసం ఏమైనా ఉందా..అని అన్నారు. రెండున్నర లక్షల పథకమే ఏ ఆసుప్రతుల్లో కూడా అమలుకావడం లేదని, ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయబడదని బోర్డులు దర్శినమిస్తున్నాయన్నారు. ఆరోగ్యశ్రీకి కేవలం 500 కోట్లు చెల్లించలేకపోతున్న ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలకు ఎలా పెంచుతాడో చంద్రబాబుకే తెలియాలన్నారు.
రూ.2వేల పింఛను,తొమ్మిది గంటల ఉచిత విద్యుత్,ఆరోగ్యశ్రీలు వైయస్ఆర్సీపీ విజయాలే అని, ఇటువంటి పథకాలను అమలు చేసి ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కాని,మనసు కాని చంద్రబాబుకు లేదన్నారు. నవరత్నా పథకాలను చంద్రబాబు సర్కార్ కాపీ కొడుతుందన్నారు.డ్వాక్రా మహిళలకు వైయస్ఆర్ హయాంలో కేవలం 250 కోట్లు ఇస్తే,టీడీపీ హయాంలో 20వేల కోట్లు రూపాయలు ఇచ్చారని ఎల్లో ప్రతికల్లో అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. వైయస్ఆర్ హయాంలో కేవలం ఒక కృష్ణా జిల్లాలోనే 450 కోట్లు ఇచ్చిన విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఏ పథకం ప్రకటించిన కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు,పాదయాత్రలో చెప్పిన హామీలను కాపీకొట్టి ప్రకటిస్తున్నారన్నారు. యాదవ కార్పొరేషన్ కోసం కొందరు యువకులు అసెంబ్లీకి వెళ్తే వారందరిని జైల్లో పెట్టించారు. కార్పొరేషన్ ఇవ్వమని కరాఖండిగా చెప్పారన్నారు. నాయీ బ్రాహ్మణులు,మత్స్యకారులు వారి హక్కుల కోసం వెళ్తే వారిపై దుర్భాషలాడి,తోకలు కత్తిరిస్తామంటూ చెప్పిన చంద్రబాబు. నేడు పేదలు,బలహీనవర్గాలపై ప్రేమను ఒలకబోస్తున్నారన్నారన్నారు. కుల నాయకులందరిని పిలిచి వారికి తాయిలాలు ప్రకటిస్తున్నారన్నారు.చంద్రబాబు అవినీతి, అక్రమాలపై వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఉద్యమంలా కార్యక్రమాలు చేసిందని, రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగి..100పైగా కులాలతో చర్చించి సమస్యలను కూలంకషంగా అధ్యయనం చేసిందన్నారు. .రాష్ట్ర ప్రయోజనాలు,హక్కులు కాపాడేది వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని అన్నారు.