టీడీపీ నేతల దాష్టీకం
ప్రకాశం: రోజుకొక ముఖ్య నేత పార్టీని వీడుతుండడంతో టీడీపీ అతలాకుతలమవుతోంది. పార్టీని వదిలి వెళ్లే వారిని ఆపడం సాధ్యం కాదని తేలిపోవడంతో అధికార మదంతో టీడీపీ వర్గాలు భౌతిక దాడులకు దిగుతున్నాయి. టీడీపీని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. గ్రామ సభలో పాల్గొందుకు వెళ్లిన ఆమంచి అనుచరులపై రాళ్ల దాడి చేశారు. గ్రామ సభకు ఎందుకొచ్చారంటూ దూషించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో నలుగురు వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
ఇప్పటికే ఇద్దరు ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు, ఇద్దరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఆళ్లగడ్డ టీడీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, టీడీపీకి దగ్గరగా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్ వైయస్ఆర్ సీపీతో కలసి నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మరింత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారనే సమాచారంతో చంద్రబాబు హైరానా పడుతున్నారు.