దైవసాక్షిగా ప్రమాణం..
సచివాలయం: ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణస్వీకారం అట్టహాసంగా సాగింది. సచివాలయం సమీపంలో ప్రమాణస్వీకారోత్సవ వేదికను ముస్తాబు చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో మంత్రుల ప్రమాణస్వీకారం నేత్రపర్వంగా జరిగింది. జాతీయ గీతం అనంతరం మొదటగా అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తరువాత వరుసగా అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, కాకాణి గోవర్థన్‌రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, కె. నారాయణస్వామి, శ్రీమతి కె.వీ. ఉషాశ్రీచరణ్, డాక్టర్ మేరుగ నాగార్జున, డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూప్, పీడిక రాజన్నదొర, శ్రీమతి ఆర్కే రోజా, డాక్టర్ సీదిరి అప్పలరాజు, శ్రీమతి తానేటి వనిత, శ్రీమతి విడుదల రజినిలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
మంత్రులుగా ప్రమాణం చేసిన వారంతా గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిలకు కృతజ్ఞతలను తెలియజేశారు. నూతన మంత్రులకు గవర్నర్, సీఎం ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.
ప్రమాణస్వీకారోత్సవానికి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ చైర్మన్, తాజా మాజీ మంత్రులు, వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పాత, కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు, వైయస్‌ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.