నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు..!
అనంతపురం : తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, ఎంఎస్ రాజు, దగ్గుపాటి ప్రసాద్, ఇతర నాయకులపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ కోరారు. ఈ మేరకు వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, వైయస్ఆర్‌సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ వేదాంతం నాగరత్న, మేయర్ మహమ్మద్ వసీం, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్‌సీపీ నాయకులతో కలిసి శనివారం అడిషనల్ ఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు అందజేశారు.
అనంతరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గిరిజమ్మ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఈనెల 21వ తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌లు నా అనుమతి లేకుండా నా వ్యక్తిగత చాంబర్‌లోకి వెళ్లి దురుసుగా ప్రవర్తించారు. వాస్తవానికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఫొటోతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాకు జెడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించిన మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతగా ఆయన ఫోటోను నా వ్యక్తిగత చాంబర్‌లో పెట్టుకున్నా. ఒక వేళ జగన్ ఫొటో ఉండకూడదని మాకు వాళ్లు చెప్పింటే మా నాయకులతో చర్చించి నిర్ణయం తెలియజేసేవాళ్లం. అలా కాకుండా అనుమతి లేకుండా నా ఛాంబర్‌లోకి వెళ్లి దురుసుగా ప్రవర్తించారు. ఒక బీసీ మహిళ జెడ్పీ చైర్మన్‌గా ఉందన్న విచక్షణ లేకుండా జ్ఞానాన్ని మరచి నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ప్రజాస్వామ్యంలో గౌరవంగా ఉన్న నాకు అవమానం జరిగేలా ప్రవర్తించడం బాధాకరం. ఈ విషయంలో జెడ్పీ అధికారులకు ఎలాంటి సంబంధం లేదు. కానీ జెడ్పీ సీఈఓను రెడ్డి అంటూ సామాజిక వర్గాన్ని దూషిస్తూ మాట్లాడి కక్షసాధింపు ధోరణిలో ఫొటోలు తీయించడం బాధాకరం. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యేలు వాటిపై దృష్టి పెట్టాలి.
ఉమ్మడి జిల్లా పరిషత్‌లో తొలి బీసీ మహిళా చైర్‌పర్సన్‌గా ఉన్న నాకే ప్రొటెక్షన్ లేకుండా అవమాన పరిచారు. ఇక సామాన్యుల పరిస్థితి ఎంటి? చంద్రబాబు, కూటమి ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టండి. జిల్లాలో రైతాంగం అకాల వర్షాలతో నష్టపోయారు. రైతులకు ఏ పథకం అందించలేదు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సక్రమంగా పరిపాలన చేయండి. ఎక్కడో అట్టడుగున ఉన్న బోయ సామాజిక వర్గానికి చెందిన నన్ను గుర్తించి జగన్‌మోహన్‌రెడ్డి పదవులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఏం గుర్తింపు ఇచ్చారు? బీసీ మహిళలు రాజకీయంగా ఎదగకూడదని అనుకుంటున్నారా? రాయదుర్గం, గుంతకల్లు ఎమ్మెల్యేలు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. బీసీలపై మీకు గౌరవం ఉంటే వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వండి. మా జగనన్న గుర్తించడం వల్లే గతంలో గుమ్మనూరు జయరాంకు మంత్రి పదవి ఇచ్చారు. ఈ రోజు మమ్మల్ని గౌరవించారు కనుకే మేం జగనన్న ఫొటోను మా వ్యక్తిగత చాంబర్‌లో పెట్టుకున్నాం. బీసీ మహిళ చైర్మన్‌గా ఉందని మీరు ఓర్వలేకపోతున్నారు. మీ బెదిరింపులకు మేం భయపడం. భవిష్యత్‌లో జిల్లా పరిషత్ చైర్మన్‌గా నాతో పాటు జెడ్పీటీసీలకు, జెడ్పీ అధికారులకు ప్రొటెక్షన్ కల్పించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’’ అని తెలిపారు.
పక్కా ప్లాన్‌తోనే ఇదంతా చేశారు..!
వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ‘‘ఈనెల 21వ తేదీన జెడ్పీ సమావేశం జరిగే సమయంలో ముగ్గురు ఎమ్మెల్యే సురేంద్రబాబు, ఎంఎస్ రాజు, దగ్గుపాటి ప్రసాద్, ఇతరులు కలిసి జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ చాంబర్‌లోకి ప్రవేశించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోను ఎలా పెడతారంటూ దుర్భాషలాడారు. వ్యక్తిగతంగా జిల్లా పరిషత్ చైర్మన్‌ను కించపరిచారు. వారిపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎస్పీని కోరాం. ప్రజాస్వామ్యంలో ఇది చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. స్థానిక సంస్థలనేవి ఇండిపెండెంట్ బాడీలు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇండిపెండెంట్ బాడీలు. అక్కడ ముఖ్యమంత్రి ఫొటోలే ఉండాలి.. ఇతరుల ఫొటోలు ఉండకూడదన్న నిబంధన ఎక్కడా లేదు. చైర్మన్ హోదాలో కేటాయించిన గదిలో ఎవరి ఫొటోలు ఉండాలి? ఎవరివి ఉండకూడదు అనే రూల్స్ లేవు. జెడ్పీ సమావేశం జరుగుతుండగానే మధ్యలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇతర వ్యక్తులను తీసుకెళ్లి జెడ్పీ మహిళా చైర్‌పర్సన్‌ను కించపరిచేలా వ్యవహరించారు.
ఎమ్మెల్యేలు తమ కాలర్స్‌కు వైర్‌లెస్ మైక్‌లు పెట్టుకుని పక్కా ప్లాన్‌తోనే ఇదంతా చేశారు. శాసన సభ్యులు జిల్లా పరిషత్‌లో అధికార మెంబర్లు కాదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు గౌరవ సభ్యులు మాత్రమే. వారికి ఓటు హక్కు కూడా లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆమె ఎన్నికల కాలేదు. కేవలం జెడ్పీటీసీలతోనే ఎన్నికయ్యారు. ఇప్పటికీ మా పార్టీకే జిల్లా పరిషత్‌లో మెజార్టీ ఉంది. ఇక్కడే కాకుండా అనంతపురం కార్పొరేషన్‌లో కూడా ఇలాంటి చర్యలకే పాల్పడ్డారు. వెంటనే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరాం. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ఇప్పటికీ వైయస్ఆర్‌సీపీ అధికారంలో ఉంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్కడక్కడా దించారు. కొన్ని చోట్ల దించాలని ప్రయత్నించారు. అందులోనూ వాళ్లు వైఫల్యం చెందారు. ఇక చేతగాక జెడ్పీ చైర్మన్ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా చూడాలని చేశారు. జెడ్పీ చైర్మన్‌తో సహా జెడ్పీటీసీలను భయభ్రాంతులను చేయాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతోంది. జెడ్పీ చైర్మన్ పర్మిషన్ లేకుండా ఆమె వ్యక్తిగత చాంబర్‌లోకి వెళ్లిన కళ్యాణదుర్గం, మడకశిర, అనంతపురం ఎమ్మెల్యేలతో పాటు వీడియోలో ఉన్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’’ అని తెలిపారు.
కేసు బుక్ చేయండి.. విచారణ చేయండి
మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య మాట్లాడుతూ ‘‘ శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యుల ముందు గౌరవనీయులు అనేది ఉంటుంది. ముగ్గురు కొత్త శాసన సభ్యులు ఏం నేర్చుకున్నారు? వాళ్లకు ఏం ఎక్కువైందో నాకు అర్థం కావడం లేదు. డబ్బు ఎక్కువైందో.. అదృష్టం ఎక్కువైందో..! ఎవరైతే పాత శాసనసభ్యులు ఉన్నారో.., అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్లు కొత్తవాళ్లకు నేర్పించండి. వాళ్లు వాడిని భాష, ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయంగా ఉంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ఒక్కటే కోరుతున్నాం. కేసు బుక్ చేయండి. విచారించండి. పునరావృతం కాకుండా చేయండి. ఎక్కడా కూడా ఇది సరైన పద్ధతి కాదు.
చైర్‌పర్సన్‌కు కేటాయించిన గది అది. మీరు ఎలా వెళ్తారు? చేసే పని ఏంది? ఎక్కడైనా సరే.., పార్లమెంట్‌లో కూడా మా పార్టీకి, మాకు కేటాయించిన గదుల్లో మా నాయకుల ఫొటోలే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. అన్ని గవర్నమెంట్ ఆఫీసుల మీద ఈవెన్ కలెక్టర్ ఆఫీస్ మీద కూడా వీళ్లు ఇలాగే వెళ్తారు. ఎస్పీ ఆఫీస్ మినహాయింపేమీ కాదు. రేపు యూనివర్సిటీలు కూడా మినహాయింపు కాదు. చైర్‌పర్సన్ ప్రభుత్వ ఉద్యోగి కాదు. నెల జీతం తీసుకోవడం లేదు. అలవెన్స్‌లు మాత్రమే తీసుకుంటున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే గవర్నర్ ఫొటోలే అన్ని చోట్లా ఉండాలి. ముఖ్యమంత్రికైనా, మంత్రులకైనా గవర్నర్ పేరుతోనే జీవోలు వస్తాయి.
ఇక డిప్యూటీ సీఎంకు రాజ్యాంగ హోదా లేదు. చారిత్రక అవసరమో, మీ అవసరమో అలా తెచ్చి బలవంతంగా రుద్దారు. ఎక్కడా రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో గవర్నర్ ఫొటో కనపడడం లేదు. ఇది గవర్నమెంటా? కాదా? మేయర్ ఛాంబర్‌లోకి కూడా అలాగే వెళ్లారు. అదే 20 ఏళ్ల క్రితం నేను చూశా. మా ఆఫీస్‌ల మీద ఎమ్మెల్యేలు, ఎంపీలు దౌర్జన్యం చేస్తే ప్రజలంతా రోడ్లు ఎక్కేవాళ్లు. నేను పీడీగా ఉన్న సమయంలో కూడా జరిగింది. మాకు ప్రతీదీ రాజకీయం చేయాలని లేదు. కానీ, గౌరవాన్ని కాపాడుకోవడం ముఖ్యం. చట్టాన్ని ఎంత గొప్పవాడైనా చేతుల్లోకి తీసుకోకూడదు. సీనియర్ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్లు కొత్తవాళ్లకు నేర్పించడండి. లేకపోతే ఏం జరుగుతుంతో టైం విల్ జడ్జ్’’ అని రంగయ్య తెలిపారు.