ఈనెలాఖరులోగా ఆక్వా ఫీడ్‌ ధరలు తగ్గించాలి

16 Jun, 2026 19:55 IST

తాడేపల్లి: దారుణంగా పెరిగిన ఆక్వా ఫీడ్‌ ధరలను ఈనెలాఖరులోగా తగ్గించాలని, లేని పక్షంలో వచ్చే నెల 1 లేదా 2వ తేదీన రైతులతో కలిసి ఆందోళన చేస్తామని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అ«ధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. 2019–24 మధ్య ఆక్వా రంగానికి తమ ప్రభుత్వం పూర్తి అండగా నిల్చిందన్న ఆయన, ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని, 57 నెలల్లో ఆ మేరకు విద్యుత్‌ సబ్సిడీ కింద రూ.3,306 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
    2014–19 మధ్య అదే యూనిట్‌ విద్యుత్‌కు రూ.3.85
వసూలు చేసిన నాటి సీఎం చంద్రబాబు, 2019లో ఎన్నికలకు 6 నెలల ముందు ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ రూ.2కే అంటూ జీఓ జారీ చేసినా అమలు చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా జోన్‌ లోపల రైతులకు సబ్సిడీ కత్తిరింపులపై బెదిరిస్తున్నారని, ఆ దిశలోనే వారం క్రితం జీఓ ఆర్‌టీ:169 జారీ చేశారని, అందులో క్లాజ్‌ నెం:4లో పవర్‌ ఫ్యాక్టర్‌ (పీఎఫ్‌) నిర్వహణపై రూల్‌ పెట్టారని చెప్పారు. అది ఆక్వా రైతులు వాడే మోటార్లకు చాలా కష్టం అన్న ఆయన, ఆ విధంగా ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ కట్‌ చేసే కుట్ర జరుగుతోందని ఆక్షేపించారు. తాము అప్పుడైనా, ఇప్పుడైనా ఎప్పుడూ ఆక్వా రంగానికి పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
    ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల మధ్య వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతులతో పాటు, ఏపీ ప్రాన్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అ«ధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి సమస్యలు సావధానంగా విన్న శ్రీ వైయస్‌ జగన్, ఆక్వా రైతులకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఆక్వా రైతుల సంతోషం కోసం నాడు ఎన్నెన్నో..:
    ఈరోజు అత్యంత దారుణ స్థితిలో రైతులు, ఆక్వా రైతులు ఉన్నారు. వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన హయాంలో రైతులు, ఆక్వా రైతుల సంతోషం కోసం చాలా ఆలోచన చేశాం. అందుకే గతంలో ఏనాడూ చూడని మార్పులు చోటుచేసుకున్నాయి. నాడు ప్రతి అడుగులో  రైతుల చేయి పట్టుకుని నడిపించాం. 10 వేలకు పైగా ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. వాటిలో 782 మంది ఫిషరీస్‌ అసిస్టెంట్స్‌ను నియమించాం. ఆక్వా సాగులో నాణ్యతతో కూడిన సీడ్, ఫీడ్‌ టెస్టింగ్‌ కోసం 35 ఆక్వా సాగు ప్రాంతాల్లో 35 ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు, 782 మంది ఫిషరీస్‌ అసిస్టెంట్లు. వీటికి తోడు అప్సడా ఏర్పాటు. దానికి సీఎం ఛైర్మన్‌. ఎక్కడా సిండికేట్‌ ఏర్పడి రైతులకు ద్రోహం జరగకుండా చూశాం. 

రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌:
    ఇంకా యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50 కి ఇచ్చి, ఆక్వా రంగాన్ని ఆదుకున్నాం. అందుకోసం రూ.3,306 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మనం ఆ అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాక, చంద్రబాబు యూనిట్‌ విద్యుత్‌ రూ.3.85 నుంచి రూ.2కి తగ్గిస్తానని ఆదేశాలు జారీ చేసినా, దాన్ని అమలు చేయలేదు. అక్కడా విద్యుత్‌ సబ్సిడీ రూ.340 కోట్లు ఎగ్గొట్టాడు.

ఆక్వాలో అవార్డులు. ఉత్పత్తి. ఎగుమతుల పెరుగుదల:
    ఆక్వా రంగానికి అన్ని విధాలుగా తోడుగా నిలవడం ద్వారా ఆక్వా సాగు ఒక పండగలా సాగింది. దీంతో డొమెస్టిక్‌ ఫిష్‌ మార్కెటింగ్‌ స్కోచ్‌ అవార్డుతో పాటు, 2021–22, 2023–24 సంవత్సరాలకు రాష్ట్రానికి బెస్ట్‌ మెరైన్‌ స్టేట్‌ అవార్డులు కూడా దక్కాయి.
    నాడు ఆక్వా ఉత్పత్తులు కూడా గణనీయంగా పెరిగాయి. అంతకు ముందు 2018–19లో 38 లక్షల టన్నులు ఉన్న రొయ్య, మత్స్య ఉత్పత్తులు 2022–23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయి. మంచినీటి రొయ్యలు 4.55 లక్షల టన్నుల నుంచి 9.56 లక్షల టన్నులకు, ఉప్పునీటి రొయ్యలు 5.28 లక్షల టన్నుల నుంచి 7.15 లక్షల టన్నులకు పెరిగాయి. అలా ఆ ఐదేళ్లలో సముద్ర, మంచినీటి, ఉప్పునీటి రొయ్యల ఉత్పత్తి 11 లక్షల టన్నుల నుంచి 18.50 లక్షల టన్నులకు పెరిగింది.
ఆక్వా ఎగుమతులు:
    అంతకు ముందు చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే.. 2022–23లో రూ.19.847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి.

మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి:
    అప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే, ఇవన్నీ జరిగాయి. అందుకే ఆక్వా వర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. రూ.100 కోట్లు కేటాయించి భవనాల నిర్మాణం నిర్మాణం మొదలుపెట్టాం. మరోవైపు తాత్కాలిక భవనాల్లో క్లాస్‌లు కూడా మొదలు పెట్టించాం. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది.

ఇప్పుడంతా ఒకే వర్గం. సిండికేట్‌:
    ఇప్పుడు ఆక్వా రంగంలో సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్‌లో మొత్తం ఒకే వర్గం. చంద్రబాబుకు దగ్గరి వారే. ఆక్వా ఉత్పత్తి దశలో రేట్లు తగ్గించడం, చేపల వేట నిషేధ సమయంలో ఫీడ్‌ రేటు పెంచే సమీక్ష చేయడం ఒక కుట్ర. ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆక్వా రైతులు నానా ఇక్కట్లు పడుతున్నారు. 

పెంచిన ఆక్వా ఫీడ్‌ ధరలు తగ్గించాలి.
లేకపోతే జూలై 1 లేదా 2న ఆందోళన:

    ఫిబ్రవరి నుంచి జూన్‌ నాటికి కిలో ఫీడ్‌ దాదాపు రూ.16 వరకు పెరిగింది. ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు ధరలు తగ్గించాలి. లేని పక్షంలో జూలై 1 లేదా 2న ఆక్వా రైతులతో కలిసి ఆందోళన చేస్తాం. అలా రాష్ట్రమంతా చూసేలా, సమస్యను ఎలుగెత్తి చాటుదాం. అప్పటిలోగా, ఫీడ్‌ రేట్లు తగ్గిస్తారేమో చూద్దాం. అప్పటి వరకు వారికి టైమ్‌ ఇచ్చినట్లు కూడా ఉంటుంది. రేట్లు తగ్గించకపోతే ఆరోజు ఆక్వా రైతుల సమస్యలు యావత్‌ దేశ దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నిద్దాం.
    తీవ్ర కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులు క్రాప్‌ హాలీడే కూడా ప్రకటించుకోలేని పరిస్థితి. అలా చేస్తే ఆక్వా సాగులో ఉపయోగిచే పరికరాలు, ఉపకరణాలు తుప్పు పట్టి పోతాయి. చెరువులు తవ్వారు కాబట్టి.. ఆ భూములు ఎందుకు పనికిరావు. 

అంతకు ముందు ఆక్వా రైతుల సమస్యల ప్రస్తావన సందర్భంగా మధ్యలో మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..:
మరి ఇది ఏ ట్యాక్స్‌?:
    నాడు ఆక్వా ఫీడ్‌ కొంచెం పెరిగితే, అది జగన్‌ ట్యాక్స్‌ అని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు చాలా దారుణంగా రేట్లు పెంచారు. మరి ఇది ఏ ట్యాక్స్‌? ఎవరికి పోతోంది? ఈరోజు మీరు (ఆక్వా రైతులు) నన్ను కలుస్తున్నారని చెప్పి, ఆక్వా సీడ్, ఫీడ్‌ ఉత్పత్తిదారులు తాము ధర ఎందుకు పెంచాల్సి వచ్చింది అని చెబుతూ, పేపర్‌లో ప్రకటనలు ఇచ్చారు.

సిండికేట్‌గా మారి దోపిడి:
    ఇప్పుడు అంతా సిండికేట్‌గా మారారు. అంతా కూడబలుక్కుని ఇష్టానుసారం రేట్లు పెంచారు. చేపలవేట నిషేధ సమయంలో ధర సమీక్షిస్తున్నారు. ఆ సాకు చూపి, ఫీడ్‌ రేటు పెంచుతున్నారు. కానీ, అది సరైన విధానం కాదు. ఫిషరీ సంపద ఎక్కువగా ఉన్నప్పుడు సమీక్షించి, నిర్ణయం తీసుకోవాలి.

సహకార వ్యవస్థతో మేలు:
    ఆక్వా ఫీడ్, సీడ్‌ రంగంలో సహకార వ్యవస్థ వస్తే, ఇలా సిండికేట్‌ కావడం, దోపిడి చేయడం సాధ్యం కాదు. డెయిరీ రంగంలో అమూల్‌ను తీసుకురావడం వల్ల, పాడి రైతులకు ఎంతో మేలు జరిగింది.

‘అప్సడా’ ఏర్పాటు. సిండికేట్‌కు అడ్డుకట్ట:
    అంతకు ముందు ప్రభుత్వంలో అలాగే సిండికేట్‌ కావడం వల్ల ఆక్వా రైతుల పరిస్థితి దారుణంగా మారింది. దాంతో మా ప్రభుత్వం రాగానే, ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే సరఫరా చేయడంతో పాటు, వారికి తోడుగా నిల్చేలా ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వా సాగు అభివృద్ధి సంస్థ’ (అప్సడా) ఏర్పాటు చేశాం. దానికి సీఎం ఛైర్మన్‌. ఇంకా ఏపీ ఫిష్‌ ఫీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) యాక్ట్‌–2020 అమలు చేసి, ఆక్వా కంపెనీలు రైతులకు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకున్నాం.
    కాగా, ఇప్పుడు ‘అప్సడా’ను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీంతో అప్సడా ఆమోదం, అనుమతి లేకుండా ఫీడ్‌ ధరలు దారుణంగా పెంచారు. వనామీ ఫీడ్‌పై కేజీకి రూ.10. టైగర్‌పై కేజీకి రూ.12 చొప్పున పెంచారు. మరి ఇప్పుడు ఏ ట్యాక్స్‌ పడింది? సీబీఎన్‌ ట్యాక్సా? లోకేష్‌ ట్యాక్సా?.వెంటనే పెంచిన ఆక్వా ఫీడ్‌ ధరలు తగ్గించాలి.

నాడు ‘అప్సడా’తో సిండికేట్‌కు బ్రేక్‌:
    ‘అప్సడా’ ద్వారా సిండికేట్‌ ఆట కట్టించడమే కాకుండా, అప్పుడు ఫీడ్‌ కంపెనీలు ధరలు పెంచితే, మూడు సార్లు ఉపసంహరించడం జరిగింది. ఇంకా థాయిలాండ్‌కు చెందిన సీపీఎఫ్‌ కంపెనీ ఒకేసారి కిలోకు రూ.6.8 పెంచడానికి సిద్ధపడితే, ఆక్వా రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ప్రభుత్వం వారిని (ఆ కంపెనీ ప్రతినిధులు) పిలిపించి, ధరల పెంపును విత్‌డ్రా చేసుకోవాలని, లేకపోతే ఫీడ్‌ యాక్ట్‌ ప్రయెగిస్తామని నోటీస్‌ ఇవ్వడంతో వారు దారికొచ్చారు. ఆ విధంగా ఆక్వా రైతుల కోసం చిత్తశుద్ధితో పని చేశాం. 
    కానీ, ఇప్పుడు ఆక్వా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్‌ యూనిట్లన్నీ ఒకే వర్గం వారి చేతుల్లో ఉన్నాయి. వారంతా ఆయనకు సన్నిహితులు. అందుకే వారిపై ఎలాంటి చర్యలు లేవు. 

రొయ్యల ధరలపై నిరంతర సమీక్ష:
    నాడు ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యల ధరల హెచ్చు తగ్గులను ‘అప్సడా’ ద్వారా సమీక్షిస్తూ, ప్రతి రైతుకూ ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర దక్కేలా చేశాం. 100 కౌంట్‌ రొయ్యకు రూ.245, 30 కౌంట్‌ రొయ్యకు రూ.470 చొప్పున కొనుగోలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు రొయ్యల ఉత్పత్తి వ్యయం పెరిగింది. కానీ రొయ్యల ధరలు పెరగకపోగా తగ్గాయి. దీంతో ఆక్వా రైతులు నష్టాల పాలవుతున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు.

కాగా, ఈ సమావేశంలో ఇంకా ఎవరెవరు ఏం మాట్లాడారంటే..:

ముదునూరి ప్రసాదరాజు. వైయస్సార్‌సీపీ ప.గో జిల్లా అధ్యక్షుడు
– రెండేళ్ల నుంచి ఆక్వా రంగంలో సంక్షోభం ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి శాపంలా మారింది. తాజాగా, సబ్సిడీ విద్యుత్‌కు సంబంధించి, జీఓ ఇచ్చారు. అందులో కొన్ని కండిషన్లు పెట్టారు. అలా సబ్సిడీ విద్యుత్‌కు మంగళం పాడే కుట్ర జరుగుతోంది.
పీఎఫ్‌ ఫ్యాక్టర్‌తో ఆక్వా సాగులో విద్యుత్‌ సబ్సిడీ ఎత్తివేసే కుట్ర జరుగుతోంది. గతంలో ఏనాడూ ఆక్వాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అందలేదు. మీరు వచ్చాకే, విద్యుత్‌ సబ్సిడీతో పాటు, అప్సడా ఏర్పాటు ద్వారా ఆక్వా రంగాన్ని నిలబెట్టారు. 
ఇప్పుడు ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో ఉంది. చంద్రబాబు బంధువులే ఆక్వా సీడ్, ఫీడ్‌ ఉత్పత్తిదారులు. అందుకే ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు.

ఐపీఆర్‌ మోహన్‌రాజు. భీమవరం:
– ఆక్వారైతులకు జీవామృతంలా జగన్‌గారు ‘అప్సడా’ ఏర్పాటు చేశారు. దానికి ముఖ్యమంత్రి స్వయంగా ఛైర్మన్‌. ఇప్పుడు అప్సడాను బైపాస్‌ చేసి ఫీడ్‌ రేట్లు పెంచుతున్నారు. సముద్రంలో వేట నిషేధ సమయంలో ఫిష్‌ మీల్‌ రేట్లు సహజంగానే పెరుగుతాయి. దాన్ని బూచిగా చూపించి రేట్లు పెంచుతునారు. ఏటా డిమాండ్‌కు అవసరమైన ఉత్పత్తిని సరైన ధరకు ఇవ్వడానికి కంపెనీలకు ప్లాన్‌ చేయాలి. దాదాపు 40 బ్యాంకుల నుంచి వారికి సహాయ సహకారాలు ఉన్నాయి. నేషనల్‌ బల్క్‌ ట్రేడింగ్‌ వ్యవస్థ ద్వారా వారి ఉత్పత్తి ఉంటుంది. రైతులకు అవసరమైన ఉత్పత్తులను ముందస్తుగానే ఇన్వెంటరీ పెడతారు. ఫీడ్‌ కంపెనీలకు సపోర్టు వ్యవస్థ ఉన్నప్పటికీ రైతులను దోచుకు తింటున్నారు. తద్వారా రైతులు రూ.10వేల కోట్లు నష్టపోతున్నారు.
వైయస్సార్‌సీపీ హయాంలో సీపీఎఫ్‌ కంపెనీ ధర పెంచితే, అప్పటి ప్రభుత్వం స్వయంగా యాక్ట్‌  ప్రయోగిస్తామని చెప్పి, ధరను తగ్గించేలా చర్యలు తీసుకున్నారు. అప్సడాకు అన్ని అధికారాలు ఉన్నాయి. 
నవంబర్, డిసెంబర్‌ మధ్య ఆక్వాఫీడ్‌ రేట్ల విషయంలో తీసుకున్న రేట్లను ఏడాది అంతా కొనసాగించాలి. ఎందుకంటే అప్పుడు అవసరమైన ముడిసరుకులన్నీ అందుబాటులో ఉంటాయి. రైతులను దోచుకునే విధానాలకు ముగింపు పలకాలి. 
కోవిడ్‌ సమయంలో జగన్‌గారి ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా వ్యవహరించింది. ఆక్వా రంగంలో తరచుగా వచ్చే వ్యాధుల నివారణపై దృష్టి పెట్టాలి. తమిళనాడులో మైక్రో లెవల్‌లో ప్రారంభించారు. వ్యాధులు వచ్చి వనామీ రొయ్య రైతులు బాగా దెబ్బ తిన్నారు. నర్సాపురంలో పిషరీస్‌ యూనివర్శిటీని జగన్‌గారు మంజూరుచేసినా దాన్ని సరైన విధంగా ముందుకు తీసుకెళ్లడంలేదు. ఆక్వారైతులు కొనుగోలు చేసే సీడ్, ఫీడ్, ఇతరత్రా వాటికి తప్పనిసరిగా నాణ్యత ధృవీకరణ ఉండాలి. సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేయాలి. 
వంద కౌంట్‌ రొయ్యలు కేజీ ఉత్పత్తి చేయడానికి రూ.275 ఖర్చు అవుతోంది. కాని మార్కెట్లో ధర రూ.225 మాత్రమే ధర వస్తోంది.
లోకల్‌ మార్కెట్‌ను పెంచడానికి ఫిష్‌ ఆంధ్ర అనే కార్యక్రమం చాలా ఉపయోగపడింది. 

జి.శ్రీనాథ్‌రెడ్డి, నెల్లూరు జిల్లా:
– ఫిబ్రవరిలో టన్నుకు రూ.4వేలు పెంచారు. మళ్లీ ఈనెల 13న  రూ.10వేల నుంచి రూ.12వేలకు పెంచారు. వంద కౌంట్‌ రొయ్యలకు పెట్టుబడి ఖర్చు రూ.275 ఖర్చు అయ్యింది. నెల రోజుల క్రితం వరకూ రూ.250లకు కొనుగోలు చేశారు. ఫీడ్‌ ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల ఇప్పుడు రూ.225కు ధర తగ్గించేశారు. నాడు జగన్‌ గారు రాకముందు రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరెంటు సబ్సిడీ రూపాయిన్నరకు ఇవ్వడం వల్ల రైతులు పండుగ చేసుకున్నారు. 

దుగ్గినేని గోపినాథ్, ప్రకాశం జిల్లా:
– వైయస్‌ జగన్‌ ఆక్వా రైతులకు అప్సడా ద్వారా రక్షణ కవచం ఏర్పాటు చేశారు. నాణ్యమైన ఫీడు, సీడు వచ్చేలా ఒక రక్షణ కవచం చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. కోవిడ్‌ సమయంలో మా పంటను ఎవ్వరూ కొనకపోతే, దగ్గరుండి జగన్‌గారి ప్రభుత్వం కొనుగోలు చేయించింది. ప్రాసెసింగ్‌ ప్లాంట్ల సిండికేట్‌ జగన్‌గారి హయాంలో ఆగిపోయింది. మేం ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ప్రాససింగ్‌ ప్లాంట్లతో వైయస్సార్‌సీపీ హయాంలో ఎప్పటికప్పుడు సమావేశాలు జరిగేవి. జగన్‌గారి ఆదేశాల ప్రకారం ఒక ధర నిర్ణయించి రైతుల నుంచి కొనుగోలు చేసేలా చేశారు. అప్సడా చట్టం చాలా ఉపయోగపడింది. కోవిడ్‌ లాంటి సంక్షోభంలోనూ సరుకును అమ్ముకున్నాం. అప్పట్లో ఉత్పత్తి ఖర్చు అదుపులో ఉండేది. ఆరోజుల్లో రూ.180కి కొనుగోలు చేస్తే, రూ.220లకు కొనుగోలు చేయించారు. దీనికి మీకు ధన్యవాదాలు. 
సీడ్‌ కారణంగా రైతులు నష్టపోతే, సంబంధిత కంపెనీలను పిలిపించి మళ్లీ సీడ్‌ను ఉచితంగా ఇప్పించారు. సీపీఎఫ్‌ కంపెనీలు పీడ్‌ ధరలు పెంచితే, దాన్ని జగన్‌గారు రోల్‌బ్యాక్‌ చేయించారు. అంతర్జాతీయ కంపెనీ ఛైర్మన్‌ సీపీఎఫ్‌ ఛైర్మన్‌నే రాష్ట్రాన్ని రప్పించి, ధరలు తగ్గించారు. 
ఫిబ్రవరిలో అప్సడాతో అనుమతి లేకుండా, సంబంధం లేకుండా కంపెనీలు సిండ్‌కేట్‌ అయ్యి ఫీడ్‌ రేట్లు పెంచారు. మళ్లీ మే 11న మళ్లీ ఫీడ్‌ ధరలు పెంచారు.  మీరు ప్రశ్నించడంతో ఆ రేట్లను ఫ్రీజు చేశారు.
జూన్‌ 13న క్యాష్‌ ప్రైస్‌ వెనామీ రూ.10లు, టైగర్‌ రూ.12లు కేజీకి పెంచారు. వడ్డీ కూడా తీసుకుంటున్నట్టుగా రేట్లు పెంచారు. అప్సడాతో సంబంధం లేకుండా రేట్లు పెంచారు. రేట్లు పెంచితే ఆక్వాసాగు నిలబడదని చెప్పాం. రైతుల అభ్యంతరాలను పట్టించుకోలేదు. మే లో 100 కౌంట్‌ రొయ్యల ధర రూ.270 రేటు ఉంటే, మేం ఆందోళన చేస్తున్నామని రూ.220కి తగ్గించేశారు. మా ప్రకాశం జిల్లాలో కిలో సాగు చేయడానికి రూ.270 నుంచి రూ.290 వరకు ఖర్చు అవుతుంది. ఉప్పు నీటి వల్ల మా దగ్గర ఖర్చు ఎక్కువ పెరుగుతుంది. ఇవాళ ధర రూ.240 ఉంది. అంటే రూ.50లు నష్టపోతున్నాం. 50 కౌంట్‌ వస్తేనే బ్రేక్‌ ఈవెన్‌ అవుతాం. కాని ఇలా వచ్చేది రేవలం 20శాతం రైతులు మాత్రమే.
రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి జగన్‌ గారి ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని గట్టిగా అమలు చేయాలి. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి.

సీహెచ్‌ కుమారదత్తాత్రేయ వర్మ, పాలకొల్లు:
– ప్రభుత్వం ఇటీవల జీవో నె:169 ఇచ్చింది. ఆ జీఓ కాలమ్‌ నెం:4లో పవర్‌ ఫ్యాక్టర్‌ (పీఎఫ్‌) గురించి రాశారు. పవర్‌ ఫ్యాక్టర్‌ పేరుతో రైతులకు సబ్సిడీని దూరం చేసే కుట్ర చేస్తున్నారు. నిర్దేశించిన పీఎఫ్‌ రావాలంటే కెపాసిటర్లు పెట్టుకోవాలి. అవి ఏర్పాటు చేసుకోవాలంటే ఎకరాకు లక్షన్నర ఖర్చు అవుతుంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరా లీజు లక్ష నుంచి లక్షన్నర అవుతుంది. సీడ్‌ యాభై వేలు అవుతుంది. రెండు టన్నుల మేత అవసరం. మొత్తానికి ఎకరా సాగుకు రూ.5 లక్షలు అవుతుంది. రైతులపై విపరీతమైన భారం పడుతోంది.

ప్రసాదరాజు. పశ్చిమ గోదావరి జిల్లా:
– ఆక్వా దాదాపుగా ఎగుమతి అవుతుంది. డాలర్‌ విలువ రూ.90 అయినా, రైతుకు రేటు మాత్రం రూ.240 దాటడం లేదు. 
డాలర్‌ విలువ రూ.40 అయినా, ఆ రోజుల్లో వనామీ రేటు రూ.300కి వచ్చేది. కరెంటు సబ్సిడీ రేటును బూచిగా చూపించి, ఫీడ్‌ రేట్లు పెంచుతున్నారు. సొంత మనుషుల కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారు. ఫీడ్‌ రేట్లు పెంచుకోవడానికి వారికి అనుమతి ఇస్తున్నారు.

పెద్దిరాజు. పశ్చిమ గోదావరి జిల్లా:
– ముంబై లాంటి మాఫియాలా ఆక్వా కంపెనీలు నడుస్తున్నాయి.

సీజన్‌ను చూసి రేట్లు తగ్గించేస్తున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిద్రపోతోంది. 6 నెలల క్రితం ముడిసరుకు రేట్లు తగ్గినప్పుడు, కిలోకు రూ.4లు తగ్గించామని చెప్తున్నారు. కాని దాన్ని డీలర్‌ కమిషన్‌ తగ్గించినట్టు చూపించారు. క్రాప్‌ హాలిడే ఇస్తేం మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అంతా తుప్పుపట్టిపోతోంది.

రాజ్‌కుమార్‌:
– థాయిలాండ్‌లో ఆక్వా సాగు బాగుంది. అక్కడి విధానాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయి.

జి.నారాయణమూర్తి. మొగల్తూరు. పశ్చిమ గోదావరి జిల్లా:
– గత ప్రభుత్వంలో రైతులకు తోడుగా నిలబడ్డారు. రేట్లు పడిపోకుండా చూశారు. ఒక ధర నిర్ణయించి అదే రేటుకు కొనుగోలు చేసేలా చూశారు. ఇప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీడు, సీడు ఇచ్చేవి అవే కంపెనీలు. ప్రాససింగ్‌ ప్లాంట్లూ వారివే. పంట వేసినప్పుడు మంచి రేటు ఆశ చూపిస్తున్నారు. తీరా పంట చేతికి వచ్చే సరికి రేట్లు కిందకు దించేస్తున్నారు. ఫీడు రేట్లు కూడా ఇష్టానుసారం పెంచుకుంటున్నారు. నర్సాపురంలో మీరు ఫిషరీస్‌ యూనివర్శిటీ మంజూరుచేశారు. ఇప్పుడు పనులు ముందుకు పోవడంలేదు.
ఆక్వాకు జగన్‌గారు మరింత తోడుగా నిలబడాలి. 

జయకృష్ణంరాజు. ఉండి:
– ఆక్వారైతులు దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందినవారివే ఫీడు, సీడు. మిమ్మల్ని ఓడించినందుకు మాకు ఇది శాపంలా తగిలింది. ఆక్వా రైతులకు అండగా మీరు నిలబడ్డారు. 
బలమైన వ్యవస్థలు ఏర్పాటు చేసి రైతుకు మద్దతుగా నిలబడ్డారు.
ఆక్వా రంగంతో చాలామందికి ఉపాధి. మధ్య తరగతి జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. మళ్లీ మీరు ముఖ్యమంత్రిగా ఉండడం ఖాయం. ఫీడు, సీడు ప్లాంట్లను ప్రభుత్వమే కల్పించాలి.
దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది.

ధర్మరాజు:
– ఆక్వా సాగు సంక్షోభంలో ఉంటే ఉపాధి తగ్గిపోతుంది. రెవిన్యూ కూడా ప్రభుత్వానికి తగ్గిపోతుంది. రాష్ట్రంలో దాదాపు 7 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. అంటే కనీసం 7 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. అలాంటి ఆక్వా రంగంలో ఇప్పుడు కరెంటు సబ్సిడీని పీఎఫ్‌కి లింకు చేస్తున్నారు. ఇది అన్యాయం. కరోనా సమయంలో కూడా గతప్రభుత్వం రైతులకు అండగా నిలబడింది. కనీస మద్దతు ధరను నిర్ణయించి కొనుగోలు అయ్యేలా చూశారు. ఆరోజు జగన్‌గారు చేసి ఉండక పోతే ఆక్వా రంగం మరింత కుంటుపడేది. 

నానిరాజు, అమలాపురం:
– జగన్‌గారు గళం విప్పితే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి.


నాణ్యమైన సీడ్‌ ఇవ్వడం లేదు. ఈరోజు మేము ఇక్కడ మీటింగ్‌కు వస్తుంటే, అక్కడ వేరే పార్టీ వాళ్లు ఆందోళనకు దిగారు. అయితే మీరు గళం విప్పితే తప్ప, మాకు న్యాయం జరగదు. 

అండ్రాజు చల్లారావు. ఆప్కాబ్‌ మాజీ ఛైర్మన్‌:
– మేము ఇప్పుడు ఫీడ్‌ కంపెనీల మీద తిరగబడడానికి సిద్దంగా ఉన్నాం. మీరు ఒక్క మాట చెబితే చాలు. మేము ధైర్యంగా పోరాడగలం. ఇప్పుడు ఫీడ్, సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లన్నీ ఒకే వర్గం వారి చేతుల్లో ఉన్నాయి. దీంతో మాకు చాలా అన్యాయం జరుగుతోంది.

నర్సింహారావు. ఆక్వా రైతు:
– వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉచితంగా సర్టిఫికెషన్‌ చేసేవాళ్లు

ఇవాళ అందు కోసం ఎకరాకు రూ.5 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అప్పట్లో భూసార పరీక్షలు జరిగాయి. ఇప్పుడు జరగడం లేదు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా అప్పులు పీడ్‌ పంపిణీ జరగేది. ఇప్పుడు జరగడం లేదు. దీంతో చిన్న, సన్నకారు రైతులు రోజువారీ కూలీలుగా మారిపోతున్నారు.

    తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైయస్సార్‌సీపీ కోఆర్డినేటర్‌ వడ్డి ర«ఘురాంనాయుడు, పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుతో పాటు, ఏపీ ప్రాన్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు ఐపీఆర్‌ మోహన్‌రాజు, దుగ్గినేని గోపినాథ్, జి.రాజ్‌కుమార్, నడింపల్లి సూర్యనారాయణరాజు, ఆర్‌.వెంకటరాజు, జి.ధర్మరాజు, కె.శ్రీనాథ్‌రెడ్డి, మేకా వెంకటేశ్వరరావు, కె.సుబ్బారెడ్డి, రమేష్‌రెడ్డి, సీహెచ్‌ కుమార దత్తాత్రేయవర్మ, జి.నారాయణమూర్తి, కె.నరసింహారావు, గుంటూరి పెద్దిరాజు, ఎ.చల్లారావు, బొక్కా రాధాకృష్ణతో పాటు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.