ఆంధ్ర యూనివర్సిటీలో అప్రకటిత కర్ఫ్యూ విధింపు దుర్మార్గం
తాడేపల్లి: ఆంధ్ర యూనివర్సిటీలో అప్రకటిత కర్ఫ్యూ విధింపు దుర్మార్గమని, కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఇదే నిదర్శనమంటూ వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకా ఏమన్నారంటే..:
ఆంధ్ర వర్సిటీలో అప్రకటిత కర్ఫ్యూ అమలు?:
ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ జారీ చేసిన సర్క్యులర్ ద్వారా ఐడీ కార్డు లేకపోతే యూనివర్సిటీలోకి ప్రవేశం లేకుండా పోయింది. వీసీని ప్రొఫెసర్లు, రిజిస్ట్రార్, సిబ్బంది కలవాలంటే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలన్న నిబంధనలు విధించడం అప్రకటిత కర్ఫ్యూ అమలు చేసినట్లే. వందేళ్ల చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయంలో ఇలాంటి నిషేధాజ్ఞలు విధించడం విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల స్వేచ్ఛను హరించడమే. ఈ సర్క్యూలర్‌కు కూటమి ప్రభుత్వమే కారణం, ఇది పూర్తిగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుకే నిదర్శనం.
విద్యాశాఖ మంత్రికి బాధ్యత లేదా?:
ఆంధ్ర యూనివర్సిటీలో అప్రజాస్వామిక సర్యులర్లు జారీ అవుతున్నావిద్యా శాఖ మంత్రి స్పందించకపోవడం దారుణం. యూనివర్సిటీలను గాడిలో పెట్టే బాధ్యత విద్యాశాఖ మంత్రిదే కాదా? ఇప్పటికే కూటమి పాలనలో హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లోకి విద్యార్థి సంఘాలు, పౌరులు ప్రవేశించకూడదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధానాన్ని ఇప్పుడు యూనివర్సిటీల్లోనూ అమలు చేస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రాజశేఖరా? లేక గీతం యూనివర్సిటీ చైర్మన్ భరతా? అన్నట్లుగా పరిస్థితి ఉంది. అందుకే ఆంధ్ర వర్సిటీలో అప్రకటిత కర్ఫ్యూ విధిస్తూ, జారీ చేసిన సర్క్యులర్లను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం.