కుల వివక్షతోనే సంక్షేమ హాస్టళ్లు నిర్వీర్యం 

16 Feb, 2026 16:53 IST

తాడేపల్లి: వెనుబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటే చంద్రబాబుకి మొదటి నుంచీ చాలా చిన్నచూపని, అందువల్లే ఆయా వర్గాలకు చెందిన సంక్షేమ హాస్టళ్ల పట్ల ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. అది కచ్చితంగా కులవివక్ష అని  వైయ‌స్ఆర్‌సీపీ  ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లలో 900 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారని వెల్లడించారు. జాతీయ మానవ హక్కుల వేదిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య 2019 నుంచి మూడేళ్లపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఘటనల కన్నా ఎక్కువని తెలిపారు. విద్యార్థుల దుర్భర పరిస్థితుల మధ్య చదువలు సాగించ లేని పరిస్థితులుంటే మంత్రి లోకేష్‌ మాత్రం ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరుగుతూ జల్సాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
    బిల్‌గేట్స్‌ పర్యటనలో చేస్తున్న ఖర్చులను సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి కోసం వెచ్చించినా విద్యార్థులు ఆస్పత్రులపాలు కావాల్సిన దుస్థితి రాదని టీజేఆర్‌ సుధాకర్‌బాబు తేల్చి చెప్పారు. వెంటనే బిల్‌గేట్స్‌ పర్యటన ఖర్చు వివరాలు వెల్లడించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సుధాకర్‌బాబు డిమాండ్‌ చేశారు. 
ప్రెస్‌మీట్‌లో టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఇంకా ఏం మాట్లాడారంటే..:

విద్యార్థుల అస్వస్థత దేశంలోనే రికార్డ్‌:
    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న దాదాపు 900 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. విద్యార్థులు హాస్టళ్లలో వసతి సదుపాయాలు సరిగా లేక వారికి అందించే భోజనం నాసిరకంగా ఉండటంతోనే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రతి ఘటనలోనూ రుజువవుతోంది. విచిత్రం ఏంటంటే జాతీయ మానవ హక్కుల వేదిక ప్రకటించిన నివేదిక ప్రకారం 2019 నుంచి మూడేళ్లపాటు దేశం మొత్తం మీద చూసుకున్నా ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలైన ఘటనలు లేవు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నేతృత్వంలోని అసమర్థ కూటమి పాలనకు, విద్యాశాఖను నిర్వహిస్తున్న నారా లోకేష్‌ నిర్లక్ష్యానికి నిదర్శనం. 
    బిల్‌గేట్స్‌కు అమరావతి గ్రాఫిక్స్‌ చూపించి చంద్రబాబు సులభంగా మాయ చేయగలడేమో కానీ, విద్యార్థులు పడుతున్న ఈ కష్టాలను మాత్రం కాదనలేరు. సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు పెట్టే పురుగులన్నం, పాచిపోయిన నీళ్ల చట్నీ బిల్‌గేట్స్‌కి పెట్టగలడా? పిచ్చి మొక్కలు మెలిచిన హాస్టల్‌ పరిసరాలు, బొద్దికలు తిరిగే హాస్టల్‌ కిచెన్లు, దోమలు, ఎలుకలు సంచరించే విద్యార్థుల హాస్టల్‌ గదులను బిల్‌గేట్స్‌కి చూపించే ధైర్యం చంద్రబాబుకి ఉందా? సంక్షేమ హాస్టళ్లలో పేద విద్యార్థులు తింటున్న భోజనాన్ని చంద్రబాబు తన ఇంట్లో వారికి పెట్టగలరా?.

విద్యార్థులను గాలికొదిలేసి లోకేష్‌ జల్సాలు:
    గత వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో విద్యార్థులకు రోజుకో మెనూతో మంచి పౌష్టికాహారంతో కూడిన ఆహారాన్ని గోరుముద్ద ద్వారా అందిస్తే, కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారి పట్ల వికృతంగా వ్యవహరిస్తోంది. ఇది ఖచ్చితంగా వెనుబడిన కులాలకు చెందిన విద్యార్థుల పట్ల చంద్రబాబు చూపిస్తున్న కుల వివక్షతకు నిదర్శనమే. రెండేళ్లు కూడా గడవకుండానే దాదాపు రూ.3.27 లక్షల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం.. అంగన్‌వాడీకి వస్తున్న చిన్నారుల దగ్గర నుంచి సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ డిగ్రీలు చదివే విద్యార్థుల వరకూ ఏ ఒక్కరికీ నాణ్యమైన భోజనం అందించలేని దౌర్భాగ్యంలో ఉందా?.
    ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి ప్రకాశం జిల్లా శింగరాయకొండ నవోదయలో చదువుకుంటూ ఇటీవల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంకా అస్వస్థతకు గురైన 900 మంది విద్యార్థుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ సమాధానం చెప్పాలి. ఎలుకలు కొరికి, దోమలు కుట్టి, సరైన భోజనం అందక విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతుంటే మంత్రి నారా లోకేష్‌ మాత్రం వారిని గాలికొదిలేసి క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి దేశ, విదేశాలు తిరుగుతున్నాడు. ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తూ నారా లోకేష్‌ ప్రజల డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడు. 

తక్షణం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి:
    వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పక్కాగా అమలు చేసిన గోరుముద్దను తిరిగి అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద దాదాపు రూ.8 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష వైయ‌స్ఆర్‌సీపీ నిలదీస్తుందనే భయంతో రూ.1,200 కోట్లు బడ్జెట్‌ ఆర్డర్‌ ఇస్తున్నట్టు మోసపు ప్రకటన చేసింది. ఫీజు బకాయిలు చెల్లించకపోతే విద్యార్థులకు కళాశాలలు హాల్‌ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలన్నీ చెల్లించాలి.

అంబేడ్కర్‌ స్మృతివనాన్ని పట్టించుకోవాలి:
    ప్రపంచ దేశాలన్నీ డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ని పొగుడుతుంటే చంద్రబాబు మాత్రం, ఇక్కడ ఆయన స్మృతివనంలో కనీసం వసతుల గురించి కూడా పట్టించుకోవడం లేదు. మొక్కలకు కనీసం నీరు పోసే దిక్కు కూడా లేదు. అంబేడ్కర్‌ స్మతివనాన్ని ఇకనైనా, గతంలో మాదిరిగా తీర్చి దిద్దాలని టీజేఆర్‌ సుధాకర్‌బాబు కోరారు.