ఉపాధి కూలీల పొట్టకొట్టడం మానుకోండి
తాడేపల్లి: ఇప్పటికే రాష్ట్రంలో 18.63 లక్షల ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులు తొలగించిన కూటమి ప్రభుత్వం, ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వారి పొట్ట కొడుతోందని వైయస్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది జూలై 27 నుంచి డిసెంబర్ వరకు రూ. 381 కోట్ల మేర ఉపాధి కూలీల వేతనాలు పెండింగ్ లో పెట్టారని, తక్షణమే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలు అనొద్దని చెప్పిన పవన్ కళ్యాణ్‌కి.. వేతనాలు సకాలంలో చెల్లించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. తన సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ ఉపాధి కూలీల పట్ల ఉంటే ఆరు నెలలుగా బకాయిలు పేరుకుపోయేవి కాదని వెల్లడించారు. 18.63 లక్షల జాబ్ కార్డుల తొలగింపుపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని వెన్నపూస రవీంద్రరెడ్డి డిమాండ్ చేశారు. దీంతోపాటు ఎంపీడీవోలకు డీడీఎల్‌వోలుగా మాజీ సీఎం వైయస్ జగన్ పదోన్నతి కల్పించి వారికి ప్రత్యేక ఆఫీసులు ఏర్పాటు చేస్తే, ఆ పేరుని డీడీవోలుగా మార్చి తానే ప్రమోషన్ ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేసుకోవడం పైన రవీంద్రరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నుంచి నేర్చుకున్న క్రెడిట్ చోరీని పవన్ కళ్యాణ్ కూడా పాటిస్తున్నాడని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులకిచ్చిన హామీల పట్ల నిజంగా చిత్తశుద్ధి, జవాబుదారీతనం ఉంటే పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ డీఏలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
● 18.63 లక్షల జాబ్ కార్డుల తొలగింపు
కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి చంద్రబాబు రాష్ట్రాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తున్నాడు. సొంత ఆస్తులు పెంచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి నాయకులు వెనుబడిన పేద వర్గాల అభ్యున్నతిని గాలికొదిలేశారు. యూరియా కూడా సరఫరా చేయలేక వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఈ ప్రభుత్వం, చివరికి ఉపాధి కూలీలను కూడా వదలకుండా వారి పొట్టకొడుతోంది. రాష్ట్రంలో పేదలకు ఉపాధి కల్పించడంలో విఫలం కావడమేకాకుండా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధ హామీ కూలీ వేతనాలు కూడా పెండింగ్ పెట్టి వెనుకబడిన పేద వర్గాలను వేధిస్తోంది. ఈ ఏడాది జూలై 27 తర్వాత రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలెవరికీ వేతనాలు అందడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు రూ.381 కోట్ల మేర ఉపాధి హామీ కూలి డబ్బుల బకాయిలు పేరుకుపోయాయి. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అడిగినంత పని కల్పిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధి దొరకడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పల్లెల్లో ఇప్పటి నుంచే బెదిరింపుల పర్వానికి తెరదీసింది. అందులో భాగంగా ఇప్పటికే 7.48 లక్షల కుటుంబాలకి సంబంధించిన 18.63 లక్షల జాబ్ కార్డులు తీసేసింది. తెలుగుదేశం పార్టీకి మద్ధతుగా నిలబడిన వారికే జాబ్ కార్డలు ఉంచి మిగతా వారి కార్డులను రకరకాల కారణాలతో ఏరివేస్తున్నారు. అంతేకాకుండా ఉపాధి హామీ పథకంలో పనిదినాలు కల్పించడంలోనూ ఈ ప్రభుత్వం విఫలమైంది. వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023-24లో రాష్ట్రంలో ఏప్రిల్ - నవంబరు మధ్య 21.37 కోట్ల పనిదినాలతో పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించగా, ఇప్పుడు చంద్రబాబు సర్కారు 2025–26 ఏప్రిల్- డిసెంబరు 7వతేదీ నాటికి కేవలం 15.94 కోట్ల పనిదినాలను మాత్రమే కల్పించింది. దాదాపు ఐదున్నర కోట్ల పనిదినాలకు కోతలు పెట్టింది. దీనిద్వారా పేదలు ఆర్నెళ్లలోనే రూ.435.14 కోట్లు నష్టపోయిన పరిస్థితులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి.
● సినిమా టికెట్ రేట్ల మీద ఉన్న శ్రద్ధ పేదల మీద ఏదీ?
ఒకపక్క ఏడున్నర లక్షల కుటుంబాల ఉపాధి హామీ జాబ్ కార్డుల తొలగింపు.. మరోవైపు దాదాపు ఐదున్నర కోట్ల పనిదినాల కోతలు.. ఇంకోవైపు లేబర్ కాంపొనెంట్ కింద నాలుగు నెలలకుపైగా ఉపాధి కూలీలకు వేతనాల బకాయిలతో ఉపాధి పనులనే నమ్ముకున్న గ్రామీణ నిరుపేదలను కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదు. తన సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ ఉపాధి హామీ కూలీలపై పెట్టడం లేదు. ఉపాధి కూలీలు అని పిలవొద్దని కళ్లబొల్లి మాటలు చెప్పడం వరకే ఆయన మాటలు పరిమితమయ్యాయి. ఉపాధి కల్పించి ఆదుకోవాల్సిన ప్రభుత్వమే శ్రమదోపిడీకి పాల్పడటం దుర్మార్గం.
● చిత్తశుద్ధి ఉంటే డీఏలు, పీఆర్సీ ఐఆర్ ప్రకటించాలి
చంద్రబాబు సహవాసంలో పవన్ కళ్యాణ్ కూడా క్రెడిట్ చేయడం నేర్చుకున్నాడు. పంచాయతీరాజ్ శాఖలో 25 ఏళ్లుగా ఎంపీడీవోలుగా పనిచేసిన వారందరికీ వైయస్ఆర్‌సీపీ హయాంలో డీడీఎల్‌వోలుగా పదోన్నతులు కల్పించడం జరిగింది. అయితే డీడీఎల్‌వోల పేరుని డీడీవోలుగా మార్చి తానే ప్రమోషన్ ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. దాన్ని సమర్థిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సహా మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సవితమ్మ చప్పట్లు కొట్టడం చూసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పేర్లు మారిస్తే ప్రమోషన్ ఇచ్చినట్టా? పేర్లు మార్చినంత మాత్రాన వారి వేతనాల్లో ఒక్క రూపాయైనా పెరుగుదల ఉంటుందా అని ప్రశ్నిస్తున్నా. కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల నిజమైన చిత్తశుద్ధి, జవాబుదారీతనం ఉంటే ఉద్యోగులకు పీఆర్సీ, పెండింగ్ డీఏ, ఐఆర్‌లు విడుదల చేయాలి.