హిందువుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తోన్న కూటమి ప్రభుత్వం
రాజమండ్రి: రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో వరుస అపచారాలు జరుగుతున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. హిందువుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... హిందూ ఆలయాల్లో వరుస అపచారాలు జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. టీటీడీ పరిధి లోని తిరుపతి
గోవిందరాజుల స్వామి ఆలయంలోనే తాగుబోతు వీరంగం చేయడం మమ్మూటీకీ భద్రతా వైఫల్యమేనని ఆగ్రహించారు. మరోవైపు తిరుమల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా... వైకుంఠ ఏకాదశి రోజున భక్తులను రావొద్దనడం చెప్పడం ఏంటని నిలదీశారు. మరోవైపు గోవింద మాలధారణ భక్తులకూ దర్శనాన్ని నిరాకరించడాన్ని తిరుమల చరిత్రలో అత్యంత దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. ప్రభుత్వం భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతోందనడానికి ఇదే నిదర్శనమని తేల్చి చెప్పారు. తాజాగా ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం పాపం కూడా టీడీపీదేనని తేల్చి చెప్పిన భరత్... టీడీపీ నేత వీరభద్రరావు సోదరుడే శివలింగాన్ని ముక్కలు చేసి ఘోర తప్పిదానికి పాల్పడ్డాడని ఆక్షేపించారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో ఘోర అపచారం చేయడమే కాకుండా.. పురావస్తు శాఖ పరిధిలో ఉన్నా వారి ప్రమేయం లేకుండానే రాజమండ్రి నుంచి శివలింగం తెచ్చి పగిలిన లింగం స్ధానంలో ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. ఇంత జరుగుతున్నా సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్, బీజేపీ, దాని అనుబంధ సంఘాలు ఎందుకు మాట్లాడ్డం లేదని నిలదీశారు. మరోవైపు భూసేకరణతో పాటు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తెచ్చిన వైయస్.జగన్ కే , భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ ఘనత దక్కుతుందన్న భరత్... దాన్ని కూడా టీడీపీ నేతలు తమ ఖాతాలో వేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని తేల్చి చెప్పారు .ఇంకా ఆయన ఏమన్నారంటే...
● భక్తులకు దర్శనం కల్పించలేని అసమర్థ ప్రభుత్వం...
హిందువుల పట్ల కూటమి ప్రభుత్వం అత్యంత అగౌరవంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు వైష్టవ క్షేత్రాల్లోనూ మరోవైపు శైవ క్షేత్రాల్లోను విపరీతమైన అపచారాలు జరుగుతున్నాయి. గడిచిన మూడు నాలుగు రోజులగా అత్యంత హేయమైన చర్యలు ఆలయాల్లో చోటుచేసుకోవడం అత్యంత దారుణం. వైకుంఠ ఏకాదశి రోజున పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని తిరుపతి గోవిందరాజులుస్వామి ఆలయంపై ఉన్మాది తాగినమత్తులో గోపురంపైకెక్కి వీరంగం చేయడం అత్యంత దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల పాటు మద్యం అందుబాటులో ఉండడమే ఈ అరాచకాలకు కారణం. ఆ మద్యం మత్తులోనే గోవిందరాజులు స్వామి ఆలయం గోపురంపైకెక్కిన ఉన్మాది... కాళ్లతో దేవతామూర్తుల విగ్రహాలను తంతూ... నాకు మరలా మరో 90 ఎంఎల్ మందు కావాలని డిమాండ్ చేయడం దౌర్భాగ్యం.
ఇది కూటమి పాలనకు నిదర్శనం. ఇదే వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే.. ఆకాశం బద్దలయ్యేలా.. టీడీపీ దాని అనుకూల ఎల్లో మీడియా రచ్చ రచ్చ చేసేవారు. ఇవాళ ఇంత అపచారం జరిగినా ఈ మీడియా ఏమయ్యారు? తిరుమల కొండపైన మద్యం, మాంసంతో పట్టుబడిన సంఘటలు కూడా చోటుచేసుకున్నాయి. తనిఖీల్లోనే నేరుగా పట్టుబడుతున్నాయి.
వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ చరిత్రలో భక్తులు దర్శనానికి రావొద్దని చెప్పిన దారుణం ఇదే తొలిసారి. భక్తులను దర్శనానికి రమ్మని పిలవడం చూశామే తప్ప.. రావొద్దని చెప్పడమేంటి? చివరికి గోవిందమాల వేసుకున్న భక్తులకు కూడా దర్శనాలు నిరాకరిస్తున్న ఈ ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనం? భక్తులను ఏం చేయాలనుకుంటోంది? సామాన్య భక్తులకు దర్శనాలు ఉండడం లేదు కానీ వీఐపీ భక్తులకే అధిక ప్రాధాన్యనిస్తూ... ఘోరమైన అపచారాలకు పాల్పడుతోంది. ప్రజలందరూ దీన్ని గమనించాలి.
● ద్రాక్షారామం శివలింగం ధ్వంసం టీడీపీ పాపమే...
ఇక ద్రాక్షారామం శైవ క్షేత్రం, అష్టాదశపీఠాల్లో ఒకటి, పంచారామాల్లో ఒకటైన భీమేశ్వరస్వామి ఆలయంలో కపాలేశ్వరుడి లింగాన్ని టీటీడీ నేత శీలం వీరభద్రరావు సోదరుడే ధ్వంసం చేసి, కనీస జ్ఞానం లేకుండా వ్యవహరించాడు. కపాలేశ్వరుడి లింగానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. సాక్షాత్తూ దేవతలే ఈ లింగాన్ని ప్రతిష్టించారని ప్రతీక. అంతటి ఘన చరిత్ర కలిగిన క్షేత్రంలో శివలింగాన్ని ముక్కలు చేయడం ఘోర తప్పిదం.ఆ తర్వాత వీళ్లు చేసిన ఘనకార్యం చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సింది. శివలింగాన్ని ధ్వంసం చేసిన తర్వాత ఆగమశాస్త్ర పండితులను పిలిచి.. ఈ రకంగా అపచారం జరిగిందని చెప్పి, దానికి సంప్రోక్షణ చేసి, వేద మంత్రాల సాక్షిగా ప్రతిష్ఠ చేయాలన్న విధానాలను పక్కన పెట్టారు. ఉదయం రాజమండ్రి దగ్గర కాటేరు నుంచి లింగాన్ని తీసుకుని వచ్చి .. మధ్యాహ్నానికే సిమ్మెంటుతో లింగం పెట్టి.. ఎవరికీ అనుమానం రాకుండా వీభూది పూసి మాయ చేశారు. ఇదేనా అనుసరించాల్సిన వ్యూహం.
వాస్తవానికి ఆ గుడి పురావస్తుశాఖ పరిధిలో ఉంది. ఒక చిన్న ఇటుకు ముట్టుకోవాలన్న వారి అనుమతి తీసుకుని చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా టీడీపీ నేతలే ఆలయంలో ధ్వంసం చేస్తారు, వాళ్లే మరలా ఒక శివలింగాన్ని తీసుకొచ్చి ఎవరికీ తెలియకుండా ప్రతిష్ట చేస్తారా? హిందూ సంఘాలు ఎందుకు మాట్లాడ్డం లేదు? బీజీపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదు? హిందువులకు ఎక్కడ అపచారం జరిగినా ప్రశ్నించే భజరంగదళ్, విశ్వహిందూపరిషత్, ఆర్ ఎస్ ఎస్ ఏమయ్యారు? సాక్షాత్తూ గోవిందరాజుల స్వామి ఆలయంపైకి ఎక్కి అత్యంత పవిత్రమైన పర్వదినాన నాకు మద్యం కావాలని ఓ తాగుబోతు వీరంగం చేస్తుంటే.. భద్రతా దళాలు ఏం చేస్తున్నాయి?
వైయస్.జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే వీళ్లంతా ఎంతలా గోల చేసేవాల్లో అందరికీ తెలుసు. అయినా కూడా మా ప్రభుత్వ హయంలో ఇలాంటి సంఘటనలకు చోటు లేకుండా చూశాం. పైపెచ్చు ఈ టీడీపీ నేతలే కావాలని ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారు. రాజమండ్రిలో టీడీపీ కార్పొరేటర్ సుబ్రమణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవతామూర్తుల విగ్రహాల చేతులు పగలగొట్టి.... మలినాలు పూసి అపచారం చేశాడు. వీళ్లే క్రియేట్ చేస్తారు. కృష్ణా పుష్కరాల్లో 44 దేవాలయాలను కూల్చివేశారు. ఎందుకు ప్రశ్నించడం లేదని మిగిలిన పార్టీలను అడుగుతున్నాను. సనాతని పవన్ కళ్యాణ్ ఏమయ్యారు. తిరుమలలో అపచారం జరిగిందని లుంగీ బిగించి మెట్లు కడిగిన డిప్యూటీ సీఎం.. ఇవాళ గోవిందరాజులు స్వామి గోపురం పైకెక్కి అపచారం చేస్తే.. మీరేమి చేస్తున్నారు. ఎందుకు స్పందించడం లేదు?
● కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు క్రెడిట్ చోరీ..
ఇక భోగాపురంలో వైయస్.జగన్ నేతృత్వంలో 2023లో ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఓట్ చోరీ తరహాలో ఏపీలో దానికి అదనంగా క్రెడిట్ చోరీ కూడా జరుగుతోంది. సాక్షాత్తూ కేంద్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్, హైవేశాఖ మంత్రి నితిన్ గడ్కరీయే చెప్పారు. జీఎమ్మార్ సంస్థ అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు గారు వేదికపై చెప్పిన మాటలు వింటే వాస్తవాలు అందరికీ అర్ధం అవుతాయి. ఎయిర్ పోర్టుకు భూసేకరణ, అన్ని అనుమతులు తీసుకొచ్చి వైయస్.జగన్ శంకుస్థాపన చేస్తే.. టీడీపీ నేతలు మాత్రం చంద్రబాబు నాయుడు 2019లోనే శంకుస్థాపన చేశారని చెప్పుకుంటున్నారు. ఏ అనుమతులు లేకుండా ఎలా శంకుస్థాపన చేశారని నేను టీడీపీని ప్రశ్నిస్తున్నాను. మీ పార్టీకి చెందిన అశోక్ గజపతిరాజు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా ఉన్నా కూడా మీరు అనుమతులు తేలేకపోయారు. అలాంటి స్ధితిలో భూసేకరణ కోసం అనేక కోర్టు కేసులను ఎదుర్కొని వాటిని క్లియర్ చేయడంతోపాటు కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు తెచ్చుకున్న తర్వాతే వైయస్.జగన్ విమానాశ్రయ పనులకు శంకుస్థాపన చేశారు. ఇదే విషయాన్ని ఎయిర్ పోర్ట్ నిర్మాణ సంస్థ అధిపతి జిఎమ్మార్ చెబితే.. కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయడు..ఈ ప్రాజెక్టు చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్ అని పచ్చి అబద్దాలు చెబుతున్నారు. ఇక కేంద్రమంత్రి గడ్కరీ సైతం ఆ రోజు శంకుస్థాపన సభలో...ఏపీ సీఎం వైయస్.జగన్ తన దగ్గరకు వచ్చిన ప్రతిసారీ ఏపీ అభివృద్ధి గురించే మాట్లాడుతారని, రూ.6 వేల కోట్లతో విశాఖ పోర్టు నుంచి ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టు మంజూరు చేస్తున్నానని చెప్పారు. ఇవన్నీ వైయస్.జగన్ హయాంలో జరిగితే టీడీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. ఇటీవల ఇండిగో సంక్షోభంలోనూ ఇదే విధంగా క్రెడిట్ చోరీ చేయడానికి టీడీపీ అధికార ప్రతినిధి ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డారు. మరలా ఇప్పుడు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టు, శ్రీకాకుళం పోర్టు కూడా చంద్రబాబు వల్లే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.
దివంగత నేత వైయస్.రాజశేఖర్ రెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్టు పనులకు శంకుస్థాపన చేసి, పనులు పూర్తిచేసి ప్రారంభిస్తే.. భోగాపురం ఎయిర్ పోర్ట్ కి వైయస్.జగన్ అన్ని అనుమతులు తెచ్చి పనులు ప్రారంభించారు. కానీ ఇక్కడ ఓ ట్రెయిల్ రన్ నిర్వహించిన టీడీపీ ఆ నిర్మాణ ఘనతను కూడా తమ ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని మార్గాని భరత్ స్పష్టం చేశారు.