విమానయాన సంక్షోభానికి కేంద్రమంత్రి అసమర్థతే కారణం
రాజమండ్రి: విమానయాన సంక్షోభానికి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి అసమర్థతే కారణమని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... శాఖాపరమైన సమీక్ష నిర్వహించకపోవడమే సమస్యకు మూలకారణమన్న ఆయన.... తక్షణమే రామ్మోహన్ నాయుడుని కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే.. జాతీయ మీడియాలో లోకేష్ భజన చేస్తూ.. టీడీపీ అధికార ప్రతినిధులు తెలుగువారి పరువు తీశారని ఆక్షేపించారు. విమానయానరంగ సంక్షోభం పై లోకేష్ వార్ రూమ్ లో సమీక్షిస్తున్నారంటూ... జాకీలెట్టి లేపే ప్రయత్నంలో చేయగా, ఏ ప్రాతిపదికన లోకేష్ సమీక్షిస్తారంటూ జాతీయ మీడియా నిలదీయడంతో సమాధానం చెప్పలేక.. తెలుగువారి పరువు తీశారని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావసానాలు ఆలోచించకుండానే ఎఫ్ డీ టీ ఎల్ అమలు చేస్తూ... పైలట్ల విశ్రాంతి సమయం 36 నుంచి 48 గంటలకు పెంచడం వల్లే... ఇండిగోలో పైలట్ల కొరతతో వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దై సంక్షోభానికి కారణమైందని తేల్చి చెప్పారు. మరోవైపు ఇదే అదనుగా ఇతర విమానయాన సంస్థలు భారీగా టిక్కెట్ల రేట్లు పెంచినా... అదుపు చేయలేకపోవడం పౌరవిమానయానశాఖ వైఫల్యమేనని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే....
● తెలుగువారి పరువు తీసిన టీడీపీ నేతలు...
విమానయానరంగ సంక్షోభంపై నారాలోకేష్ ఏ ప్రాతిపదినక మానిటరింగ్ చేస్తాడు? ఇదేమైనా తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటున్నారా? ఆ పార్టీ అధికార ప్రతినిధులు నేషనల్ మీడియాలో లోకేష్ ని జాకీలుపెట్టి ఎత్తే ప్రయత్నం చేస్తే... లోకేష్ కి ఏం సంబంధం అని యాంకర్ చెప్పుతో కొట్టినట్లు చెప్పాడు. టీడీపీ నేతలకు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. విమానాశ్రయాల్లో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విమానాలు నడిపే పైలట్ల మీద కూడా చాలా ఒత్తిడి ఉంది. ప్రయాణికులు రక్షణ కోణంలో పౌరవిమానయాన శాఖ చాలా పెద్ద తప్పిదం చేసింది. ప్రయాణికుల భద్రతను గాలికొదిలేసింది. తరచూ శాఖాపరమైన సమీక్ష లేకపోవడం వల్లే ఈ ఇబ్బంది తలెత్తింది. ప్రయాణికులకు ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? రీల్స్ మంత్రి చెబుతాడా? ఇటీవలే అహ్మదాబాద్ ఘటన జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన కారణాలు పబ్లిక్ డొమైన్ లో పూర్తిగా పెట్టలేదు. కేంద్రమంత్రి సామర్ధ్యం ఇక్కడే తెలిసిపోతుంది. రష్యా అధ్యక్షుడు భారత్ లో పర్యటిస్తుండగా... దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ అసమర్థ కేంద్రమంత్రే దీనికి బాధ్యత వహించాలి. ఇవన్నీ సర్దుకోవడానికి మరో వారం రోజులు పడుతుంది. ఇండిగో ఎయిర్ లైన్స్ గొడ్డు చాకిరీ చేయిస్తుంది. పైలట్లకి విశ్రాంతి సమయం వారం రోజుల్లో 36 గంటలు ఇస్తున్నారు. ఇందులో మరో దారుణం ఏమిటంటే... ఎవరైనా సెలవు తీసుకుంటే.. దాన్ని కూడా ఆ 36 గంటల్లోనే మినహాయిస్తున్నారు. అత్యవసరమై ఒకటి రెండు రోజులు సిబ్బందిలో ఎవరైనా లీవ్ తీసుకుంటే.. వారం రోజులు గొడ్డు చాకిరీ చేయాల్సిందే. రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా ఉంటూ.. ఇన్ని తప్పులు చేస్తూ కనీసం సమీక్షకూడా నిర్వహించకపోవడమే ఈ సమస్యకు కారణం.
● కనీస సమీక్ష లేకపోవడమే కారణం...
ఏదైనా ఒక నిబంధన తెచ్చినప్పుడు దాన్ని దశలవారీగా అమలు చేయాలి. ఏడాదిన్న కాలపరిమితి విధించి... ప్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ విధానాలు పాటించాలని నిర్ణయించారు. కానీ తగిన సంఖ్యలో పైలెట్లు లేరు. దేశంలో ఆ సంఖ్యలో పైలెట్లు లేనప్పుడు... బయట నుంచి తెచ్చుకున్నారా? అన్న విషయంపై కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. ఇవేవీ లేకుండానే ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. షిల్లాంగ్ లో భర్త చనిపోయి 48 గంటలైతే ...ఆ మృతదేహంతో కోల్ కతా వెళ్లాలనుకున్న మృతుడి భార్య విమానం ఎక్కినా, టేకాఫ్ కాలేదు. మృతదేహంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇలాంటి ఘటనలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకున్నాయి. పేషెంట్స్, సీనియర్ సిటిజన్స్ బాధ అయితే చెప్పనవరం లేదు. మరో కొత్త జంట అయితే విమానాల రద్దుతో ఆన్ లైన్ లో పెళ్లి చేసుకున్న పరిస్థితి.
ఇది కేవలం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అసమర్థత మాత్రమే. ఇండిగో ఎయిర్ లైన్స్ కి సుమారు 5400 మంది పైలట్లు ఉండగా... 36 గంటల విశ్రాంతి సమయాన్ని 48 గంటలకు పెంచారు. దీంతో అదనంగా మరో 900 మంది పైలట్లను నియమించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపైనా కూడా కనీసం రివ్యూ చేయలేదు. తగిన సంఖ్యలో పైలట్లను నియమించుకున్నారా? లేదా ? అన్నది పరిశీలించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణం.
గతంలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఇదే టీడీపీకే చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజు ఉంటే.. ఆయన్ను మేచ్ బాక్స్ మినిష్టర్ అని పిలిచేవారు. ఇవాళ కేంద్రమంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు... అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనా స్థలానికి తన సోషల్ మీడియా టీంతో పాటు వెళ్లి, తన పర్యటనను రీల్స్ చేసి పెట్టారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ రీల్ తొలగించారు. ఇదీ ఈ పార్టీ తరపున కేంద్ర మంత్రుల పరిస్థితి. ఇండిగో సంస్థకు 434 విమానాలుంటే, 128 డెస్టినేషన్ పాయింట్లకు సంబంధించి... సుమారు 2300 సర్వీసులు ప్రతిరోజూ నడుపుతున్నారు. అందులో 5400 మంది పైలట్లు వెట్టిచాకిరీ చేస్తున్నారు. ఒక పైలట్ డొమొస్టిక్ గా 4-5 డెస్టినేషన్స్ కి వెళ్తున్నారు అంటే.. .ఆ స్ధాయిలో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. విమానాలు 24 గంటలూ నడుస్తుంటాయి. పైలట్లు 5400 మంది మాత్రమే. వీరితోనే విపరీతంగా పనిచేయిస్తున్నారు. ఇండిగో 60 శాతానికి పైగా ఉంటే, ఎయిర్ ఇండియా 30 శాతం... అంటే ఈ రెండు సంస్థలే 90 శాతం పై చిలుకు మార్కెట్ షేర్ ఆక్యుపై చేశాయి. రాజమండ్రి నుంచి హైదరాబాద్ సడన్ గా వెళ్లాలనుకుంటే రూ.15 నుంచి రూ.18వేలువరకు నిలువునా దోచుకుంటున్నారు. మరో రెండు మూడు సర్వీసులు ఉంటే.. ప్రయాణికులకు ఆప్షన్ ఉంటుంది. ప్యాసింజర్ ఫ్రెండ్లీ వ్యవస్థ ఉండాలే తప్ప మోనోపలీ సరికాదు.
తాజాగా కేంద్ర పౌరవిమానయానశాఖ గతంలో తాను ఇచ్చిన ప్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ ఆదేశాలను మరలా వెనక్కి తీసుకుంది. పైలట్లు ఆకస్మాత్తుగా వందలసంఖ్యలో గాల్లోంచి ఊడిపడే పరిస్థితి లేదు. అలాంటప్పుడు కనీస సమక్ష చేయకుండా సదరు మంత్రి రామ్మోహన్ నాయుడు ఏ రకంగా 36 గంటల నుంచి 48 గంటల పాటు విశ్రాంతి సమయం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటారు. దానివల్ల ప్రయాణికులు నష్టపోయారు. విమానాశ్రయాల్లో తమ గమ్యస్ధానాలకు చేరలేక ప్రయాణికులు ఆందోళనకు దిగుతున్నారు. విపరీతమైన పని ఒత్తిడి వల్ల పైలట్ల సామర్ధ్యం తగ్గుతుంది. దానివల్ల ఏదైనా జరగరానిది జరిగితే.. .ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికైనా కేంద్ర మంత్రి కళ్లు తెరిచి సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించారు. ఇండిగో సమస్యతో మిగిలిన ఎయిర్ లైన్స్ సంస్థలు సంక్షోభాన్ని అవకాశంగా చేసుకుని విపరీతంగా విమానటిక్కెట్ల రేట్లను పెంచేస్తున్నారు. టిక్కెట్ ధరల స్థిరీకరణ లేకపోవడంతో ఇష్టారీతిలో పెంచుకుంటూ పోతున్నారు. సామాన్యుడికి విమానం అందుబాటులో ఉండాలన్న ప్రధాని మోదీ నినాదానికి ఈ కేంద్ర పౌరవిమానయాన మంత్రి తూట్లు పొడిచారు. కొన్ని సందర్భాల్లో అవుట్ డేటెడ్ ఫ్లైట్ సర్వీసులు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే... టీడీపీ అధికార ప్రతినిధులు జాతీయ మీడియాలో వ్యవహరించిన తీరుతో రాష్ట్రం పరువు తీస్తున్నారు. ఈ నేపధ్యంలో తక్షణమే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలి, లేదా కేంద్ర ప్రభుత్వమైనా ఆయనతో రాజీనామా చేయించాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు.
రాజమండ్రిలో గౌతమి సూపర్ బజార్ నిర్మాణంలో కనీస నిబంధనలు పాటించలేదు. అనుమతి లేని నిర్మాణాలను తొలగిస్తామని చెబుతున్న మున్సిపల్ కమిషనర్ కి ఈ భవనం ఎందుకు కనిపించడం లేదు. టీడీపీ ఎమ్మెల్యే ఈ భవన నిర్మాణంలో నేను లంచం తీసుకున్నానని నా పై ఆరోపణలు చేశారు. నా పై వచ్చిన ఆరోపణలను నిరూపించమంటే ఎమ్మెల్యే ఎక్కడకి వెళ్లారు. నిబంధనల ప్రకారం లేకపోతే, ఈ భవనాన్ని కూలగొట్టాలని మున్సిపల్ కమిషనర్ ని డిమాండ్ చేస్తున్నాను.
రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భవతిగా ఉన్న తల్లి చనిపోయింది. పాప ప్రాణాలతో మిగిలింది. ఇది చాలా బాధాకరం. పైగా డాక్టరే చనిపోతే దిక్కులేదు.. మీరేంటి అని వైద్యులే మాట్లాడ్డం మరింత దారుణం. ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. ప్రభుత్వ ఆసుపత్రులో ప్రమాణాలు పూర్తిగా క్షీణించాయి. పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే... ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడ అత్యంత బాధాకరం.